దసరా సందర్భంగా ఈ ఏడాది మళ్లీ 21-10-2012 ఆదివారం ఆంధ్రభూమిలో ముఖ చిత్ర కథనం నాదే. వివివి రమణ పేరుతే వచ్చింది. అదే ఇది......
పండుగలు అందరూ చేసుకుంటాం. కాని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ పండుగలు మహోత్సవంలా, కన్నుల పండుగగా జరుగుతాయి. ముఖ్యంగా దసరా.
దసరా.. అంటూనే మనందరికీ గుర్తుకు వచ్చేవి తొమ్మిది రోజులపాటు అతి వైభవంగా ఉత్సవాలు జరిగే నవరాత్రులు. శరదృతువులో రావడం వల్ల ఈ నవరాత్రులను శరన్నవ రాత్రులని అంటారు. ఒక్కోరోజు దుర్గ ఒక్కో విశిష్టమైన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి అనేక ఆధ్యాత్మిక అనుభూతులను ఇస్తుంది. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులని అంటారు. దశ హర అంటే పది రోజుల పండుగ అనే అర్థంలో చెబుతారు. ఈ దశ హరయే దసరా అని వ్యవహారంలోకి వచ్చింది. దశ హర అంటే పది పాపాలను నాశనం చేసేది అనే మరో అర్థం కూడా ఉంది.
ముంబై, హైదరాబాద్ నగర వాసులు వినాయక చవితి ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, భక్తితో చేసుకుంటారో, కోల్‌కతా, మైసూర్ వాసులు దసరా పండుగని అంతకన్నా ఘనంగా జరుపుకుంటారు.
పలు రాష్ట్రాల్లో తొమ్మిది రోజులపాటు వివిధ రకాల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేసి పేరంటాలు నిర్వహించడం ఈ పండుగ మరో ప్రత్యేకత. భారతీయులంతా ఈ నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో శక్తి పూజే ప్రధానం. నవ అంటే నవ్యతను కలిగింది. అంతేకాదు. ఈ తొమ్మిది రోజులూ శక్తిని పూజించి మన దేహంలో ఉండే మహాశక్తిని గుర్తించి నవ విధ భక్తులను పెంపొందించుకుని ఆధ్యాత్మికంగా ముందుకు సాగడమే ఈ నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యత.
నవరాత్రి ఉత్సవాలెలా ఆరంభమయ్యాయి...
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేసి ఎవరివల్లా చావులేని వరం పొందాడు. ఆ వరంతో మహిషాసురుడు అహంకారపూరితుడై దేవతలనూ, మునులనూ బాధించ నారంభించాడు. మహిషుని బాధలు తాళలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, అతని వరం గురించి తెలిసిన విష్ణుమూర్తి దుర్గామాత వానిని సంహరిస్తుందని చెప్పాడు. మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. పదవి పోయిన దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోదాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజమంతా కేంద్రీకృతమై ఒక స్ర్తి రూపంగా అవతరించింది. శివుని తేజమే ముఖంగా, విష్ణు తేజమే చేతులుగా, బ్రహ్మ తేజమే పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్నీ, విష్ణువు చక్రాన్నీ, బ్రహ్మదేవుడు అక్షమాలనీ, కమాండలాన్నీ ఇచ్చారు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్నీ ఇవ్వగా, హిమవంతుడు ఆమెకు వాహనంగా ఒక సింహాన్ని ఇచ్చాడు. ఇలా దేవతలంతా ఇచ్చిన ఆయుధాలను సమకూర్చుకొన్న దుర్గాదేవి మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పి మొత్తం పది రోజులపాటు యుద్ధం చేసింది. యుద్ధ కాలంలో తొమ్మిది రోజులు ఒక్కో అవతారమెత్తి చివరి రోజు మహిషాసురుని సంహరించింది. పదో రోజు దుర్గాదేవి విజయం సాధించినందుకు గుర్తుగా భూలోక వాసులు ఆనందంతో విజయ దశమి వేడుకలు జరుపుకున్నారు. అలా అనాదిగా ఆ రోజు నుంచి విజయ దశమి వేడుకలను మనం జరుపుకుంటున్నాం. ఇదీ వాడుకలో అందరూ చెప్పుకునే కథ.
ఇంకో కథ ఏమిటంటే, మనందరికీ తెలిసిన రావణాసుర వధ కథ. మరో కథ ప్రకారం పార్వతీదేవి పది రోజులు పది రకాల అవతారాలను ఎత్తి ఒక్కో అవతారంలో ఒక్కో రాక్షసుని చంపింది. అలాగే మధుకైటభుల వధ గురించి కూడా మరో కథ ఉంది.
మహాభారతంలో విజయదశమి పరంగా పాండవులు శమీ వృక్షాన్ని పూజించి విజయాన్ని సాధించిన కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భవిష్యత్ పురాణంలో దసరా గురించి ఒక వర్ణన ఉంది. ఇందులో నవరూపాల వర్ణన లేదు గానీ ఈ తొమ్మిది రోజులూ అస్త్ర శస్త్రాలనూ పూజించి పదవ రోజున అమ్మవారిని ఏనుగుపై పల్లకిలో ఉంచి ఊరేగించాలని వివరించి ఉంది. అంటే అమ్మవారి ఊరేగింపు సరిగ్గా ఆశ్వయుజ శుక్ల దశమి రోజు జరగాలన్నమాట.
నవరాత్రులు - నవరూపాలు
ఆది శక్తి పరాశక్తి. సాక్షాత్తూ ఆ సూర్య భగవానుడే ఆదిశక్తి ‘మహాశక్తి అనీ, విద్య అనీ, అన్ని లోకాలూ ఆమెనే ఆశ్రయించి ఉన్నాయనీ, అసలు సృష్టి, స్థితి, లయలకు మూలం ఆమేననీ, ఆమె ప్రేరణ వల్లే త్రిమూర్తులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని వర్ణించాడు.
ఆమెయే ఇంద్రుడిలో ఉండే శక్తి. ఆకాశంలో కనిపించే మెరుపులో ఉండే విద్యుత్ శక్తి. ఈ విషయాన్ని గుర్తించిన మహాముని కావ్యకంఠ గణపతి ఆ శక్తినే ఇంద్రాణీ శక్తిగా గుర్తించాడు. ఆ శక్తిని పూజిస్తూ, ప్రార్థిస్తూ ఇంద్రాణీ సప్తశతి పేరుతో ఏడువందల శ్లోకాలను రాసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఆమె ఆదిశక్తి కాబట్టి ఆమెకు పరాజయం లేదు. అందుకే ఆమెకు అపరాజిత అని పేరు.
నవరాత్రుల సందర్భంగా దేశంలో కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవ రోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ద్ధిత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాలలో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకరణలో కనిపిస్తుంది.
నవదుర్గలు
సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీ కవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రథమం శైల పుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్ర ఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం/ పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం/ నవమం సిద్దిదా ప్రోక్తా, నవదుర్గా ప్రకీర్తితా ఇక్తానే్యతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని ఉంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు. సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరీ (శతాక్షి), భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ గురించి చెప్పారు. కానీ, వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా వ్యవహరించలేదు.
అన్నట్టు, సప్తసతీ దేవతలని మరో సంప్రదాయం ఉంది. దీనిలో నందా, శతాక్షీ, శాకంబరీ, భీమా, రక్తదంతికా, దుర్గా, భ్రామరీ అనే ఏడుగురు సప్తసతుల గురించి సప్తశతీ గ్రంథంలో ఉంది. దీనివల్లే ఈ గ్రంథానికి సప్తసతి అని మరో పేరు వచ్చిందంటారు.
తొమ్మిది అంకె విశిష్టత
నవ నాడులు, నవరంధ్రాలు, నవ చక్రాలూ వీటన్నిటికీ నవ రాత్రులతో ఆధ్యాత్మిక పరమైన సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. తల్లి గర్భంలో శిశువు ఉండేది 9 నెలలు. కాశీ క్షేత్రంలో 9 నెలలు కానీ, 9 రోజులు కానీ, 9 గడియలు గానీ ఉంటే చాలట. పితృపాపాలన్నీ ఇట్టే తొలగిపోతాయట.
సాయిబాబా తన భక్తుడైన పాట్‌కర్‌కు నవ విధమైన భక్తి మార్గాల గురించి బోధించాడు కూడా. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యత, ఆత్మ నివేదన - ఇవీ నవ విధ భక్తిమార్గాలు. భక్తిలేని సాధనలు దండగ.
ఐతే అన్నిటిలోనూ నవ అంటే 9 అంకెనే ఎందుకు చెప్పుకుంటున్నారనేది ప్రశ్న.
తొమ్మిది అంకె మార్పులకు లోను కాని బ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది. 9 విచిత్ర సంఖ్య. 9ని 1తో గుణిస్తే 9 వస్తుంది. అదే 9ని 2తో గుణిస్తే, 18 (అంటే తొమ్మిదే), 3తో గుణిస్తే 27 (అంటే మళ్లీ తొమ్మిదే) - ఇలా 9ని ఏ అంకెతో గుణించినా 9 మాత్రమే వస్తుంది. అంటే శక్తి నిశ్చలంగా ఉండటమే. ఇదే బ్రహ్మ తత్వ రహస్యం.
అదే 8 అనే అంకెను తీసుకోండి. అది మాయను సూచిస్తుంది. 8ని 1తో గుణిస్తే 8 వస్తుంది. 2తో గుణిస్తే 16 (అంటే 7,8 కన్నా 1 తక్కువ), 3తో గుణిస్తే 24 (అంటే 6,8 కన్నా 2 తక్కువ) - ఇలా మాయా శక్తి జీవుడిలో ఉండే శక్తిని హరించి వేస్తుంది.
అంటే సన్మార్గంలో ఉంటే మనకు అంతులేని శక్తిని (అంటే పాజిటివ్ ఎనర్జీ అన్నమాట) ఇస్తుంది. అంటే దుష్టబుద్ధి కలిగిన వాడికి మాయ కమ్మి (అది నెగెటివ్ ఎనర్జీ అన్నమాట) ఆ జీవుడి పాపం పండాక ఆ జీవునిలో ఉండే శక్తిని హరించి వేస్తుంది.
యజ్ఞాది కర్మల్లో సాధారణంగా 16, 116, 1116 - ఇలా దక్షిణలిస్తారు కదా. అవి అలా ఎందుకుంటాయో జాగ్రత్తగా గమనిస్తే, అవి 7,8,9 అనే అంకెలను సూచిస్తాయి.
కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళా, జీవమనే 9 వ్యూహాలే రూపంగా కలిగిన పరశంభుని దేహమే శ్రీమాత. ఆ భగవతి దేహమే పరానంద సంజ్ఞ కల శంభువు.
మన దేహంలోని 9 స్థానాలకూ, 9 చక్రాలకూ ఎలా సంబంధం ఉందో, అదే రీతిలో శ్రీ చక్రంలోని 9 చక్రాలతోనూ సంబంధం కలిగి ఉంది. అంటే, శ్రీవిద్యోపాసన అంటే, ఆత్మోపాసనే కానీ వేరే కాదు. దేవీ అర్చన అంటే, ఆత్మను అర్పించడమే కానీ వేరే ఏదో కాదు.
నవరాత్రులు - నవ రూపాలు
దసరా నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరిస్తుంది. తొలి రోజు దుర్గాదేవిగా, రెండో రోజు బాలాత్రిపుర సుందరిగా, మూడో రోజు గాయత్రీదేవిగా, నాలుగో రోజు అన్నపూర్ణగా, ఐదో రోజు లలితా త్రిపురసుందరిగా, ఆరో రోజు శ్రీమహాలక్ష్మిగా, ఏడో రోజు సరస్వతీదేవిగా, ఎనిమిదో రోజు దుర్గాదేవిగా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా, పదోరోజు రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. ఆయా రోజుల్లో అమ్మవారిని ఆయా రూప సంబంధ స్తోత్రాలను భక్తిశ్రద్ధలతో పఠిస్తే ఎంతో మంచిది.
దుర్గాదేవి రూపంలో అమ్మ దారిద్య్ర బాధలను తొలగిస్తుంది. బాలాత్రిపుర సుందరిగా అందరి కోర్కెలను తీరుస్తుంది. లలితగా కార్య విజయాన్నీ, సంకల్ప సిద్ధినీ కలుగజేస్తే, అన్నపూర్ణగా అన్నపానాదుల కొరతే లేకుండా చేస్తుంది. సకల జ్ఞానాలను సరస్వతీదేవి రూపంలో ఇస్తుంది. మహాలక్ష్మి రూపంలో సకల సంపదలనూ ఇస్తుంది. అష్టమినాటి దుర్గ అన్ని రకాల దుర్గుణాలనీ పారద్రోలుతుంది. విజయదశమి నాటి రాజరాజేశ్వరీ దేవి సకల కార్యసిద్ధిని కలుగజేస్తుంది.
శక్తి పీఠాలు
దేశ విదేశాల్లో ఆది పరాశక్తి ఆరాధన ఇప్పటికీ జరుగుతోందనడానికి ఆసియా ఖండంలో ఉండే 52 శక్తి పీఠాలే సాక్ష్యాలు. ఈ 52 శక్తిపీఠాలను గుర్తించడానికి ఎలాటి ఐతిహాసిక ఆధారాలు మనకు లభించకపోయినా పురాణాలూ, శాసనాలూ ఆయా పీఠాలను గుర్తించడానికి తోడ్పడ్డాయి.
భారతదేశంలో ఈ శక్తిపీఠాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, అసోం రాష్ట్రాల్లో ఉన్నాయి.
అలాగే విదేశాల సంగతికి వస్తే, ఈ శక్తి పీఠాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, టిబెట్, శ్రీలంకలలో ఉన్నాయి.
అష్టాదశ శక్తిపీఠాల్లో 17 మన దేశంలోనే ఉండటం ఒక విశేషం. అవే కంచి (కామాక్షి), ప్రద్యమ్న - బెంగాల్ (శృంఖలాదేవి), మైసూర్ (చాముండేశ్వరి), అలంపురం (జోగులాంబ), శ్రీశైలం (భ్రమరాంబ), కొల్హాపూర్ (మహాలక్ష్మి), మాహోర్ (ఏకవీర), ఉజ్జయిని (మహాకాళి), పీఠికపురం (పురుహూతిక), ఒరిస్సా (గిరిజా), ద్రాక్షారామం (మాణిక్యాంబ), గౌహతి (కామరూపిణి), అలహాబాద్ (మాధవేశ్వరి), జ్వాలాముఖి - జమ్మూ (వైష్ణవీదేవి), కాశి (విశాలాక్షి), కాశ్మీర్ (సరస్వతి - శారికా) అనేవి. 18వది శ్రీలంకలో (శాంకరీదేవి)లో ఉంది.
అన్నట్టు ద్వాదశ శక్తి పీఠాలనే మరో జాబితా కూడా ప్రచారంలో ఉంది. అవి శ్రీశైలం (భ్రమరాంబ), కంతి (కామాక్షి), కేరళ (కుమారి), ఆన్తరం (అంబిక), కొల్హాపూర్ (మహాలక్ష్మి), మాళవ (కాళిక), ప్రయాగ (లలిత), వింద్యాద్రి (వింధ్యవాసిని), కాశి (విశాలాక్షి), గయ (మంగళ గౌరి), బెంగాల్ (సుందరీ దేవి), నేపాల్ (గుహ్యకేశ్వరి)
ఇలా అష్టాదశ పీఠాలనీ, ద్వాదశ పీఠాలనీ అలనాడు మహర్షులే నిర్ణయించినందువల్ల, ఈ ఎంపికంతా కేవలం అలనాడు వారి ప్రాధాన్యతలోని తేడాలవల్ల ఏర్పడిందే. ఇందువల్ల ఏ క్షేత్రమూ తక్కువైంది కాదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ క్షేత్ర మహాత్మ్యం దానిదే.
మన దేశంలో వివిధ ప్రదేశాలలో దసరా
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటారు. మైసూర్, కలకత్తా, ఒరిస్సా, తెలంగాణ, విజయవాడలలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.
ఉత్తర భారతదేశంలో దసరాల తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణాసంచాతో తయారుచేస్తారు. రామ లక్ష్మణ వేషధారులు బాణాలను సంధిస్తారు. తమ అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు.
మైసూర్ - దేశమంతటా దసరా పండుగ చేసుకుంటున్నా దసరా వేడుకలని చూసి తరించాలంటే మాత్రం మైసూర్ వెళ్లి తీరాల్సిందే. అదే మైసూర్ దసరా ప్రత్యేకత. మైసూర్ మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కుల దైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. రైతుల దసరా, మహిళా దసరా, యువ దసరా, పిల్లల దసరా.. ఇలా అక్కడ ఎవరి దసరా వారిదే. ఆటల పోటీలు, పాటల పోటీలు, ప్రదర్శనలూ.. వెరసి ఊరు ఊరంతా తిరునాళ్లే. అందుకే ఆ పదిరోజుల పండుగకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలైపోతాయి. మైసూర్ దసరా పండుగని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. ఆ వేడుకల్ని తిలకించడానికి, వాటిలో భాగమై పోవడానికి దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు మైసూర్‌లో వాలిపోతారు. ఎప్పుడో రాజుల కాలంలో మొదలైన ఈ దసరా సంబరాలకి నేటికి నాలుగొందల రెండేళ్లు. ఆనాటి సంప్రదాయాన్ని, వైభవాన్ని ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు ఆధునికత ఉట్టిపడే సంబరాలకి వేదికైన మైసూర్ దసరా.
కలకత్తా: దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షల మంది దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్టమ్రంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజున నదీ తీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.
ఒరిస్సా: ఒరిస్సా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిన ప్రతిష్టిస్తారు. స్ర్తిలు మానికలో వడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవిని ఆరాధించడం అలవాటు. దీనిని వారు మాన బాన అంటారు. ఒరిస్సా ప్రజలు విజయదశమి నాడు విజయ దుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణాసంచాతో తయారుచేసి మైదానంలో కాలుస్తారు. ఈ రావణ దహనాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు.
గుజరాత్: దసరా సమయంలో గుజరాతీయులు పార్వతీదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం. ఇంటి గోడల మీద శ్రీచక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు. ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారుచేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేసి, ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిస్తారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్ర్తిలు ఉత్సాహంగా పాల్గొంటారు.
తమిళనాడు - తమిళనాడులో అన్ని అమ్మవార్ల దేవాలయాల్లో దసరా ఉత్సవాలు బాగానే జరుగుతాయి. ముఖ్యంగా మధుర మీనాక్షి అమ్మ దేవాలయం గురించి చెప్పుకోవాలి. మీనాక్షి దేవాలయంలో ఉండే సువిశాల స్థలంలో పెట్టే బొమ్మల కొలువు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. అతి పెద్దదైన ఆ ఆలయ ప్రాంగణంలో నాలుగు వేపులా అద్భుతమైన బొమ్మల కొలువు కన్నుల విందుగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ - ఏటాటే బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడుసార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత అమ్మవారిని పాతబస్తీలో ఊరేగిస్తారు. 1వ టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి ఊరేగింపు ముగుస్తుంది. దసరా చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.
విజయనగరంలో దసరా సందర్భంగా సిరిమాను ఊరేగింపు విశేషంగా చెప్పుకోవాలి. దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. ఈ దేవికి దసరా వెళ్లిన తరువాత మొదటి మంగళవారంనాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు ఎడ్లబండిలో మూడు రోజుల ముందుగా వచ్చి రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. కృష్ణా జిల్లాలో ఉన్న రేవుపట్టణం మచిలీపట్టణంలో దసరాల్లో శక్తి పీఠాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు నూరు సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందిలీలకు చెందిన ఒక సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేశాడు. అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పీఠాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీసుకురావడం మొదలైంది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో దసరా ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు. కళారాలంటే పెద్ద ముఖాకృతి (మాస్క్‌లనొచ్చు) కాళికాదేవి, మహిషాసుర మర్దిని, నరసింహ స్వామి కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు. ఇలా కళారాన్ని ఊరి నడిబొడ్డుకు తెచ్చాక అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీర వాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది.
ఐతే, దసరా సమయంలో కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో ప్రజలు రాళ్ల యుద్ధం చేస్తారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూ ఇటూ చేరి కంకర రాళ్లను గుట్టగా పోసుకొని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్లను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. దీనే్న రామరావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. అధర్మంపై ధర్మం యుద్ధం చేసి విజయం పొందినట్లు భావిస్తారు. ఈ రాళ్ల యుద్ధంలో దెబ్బలు ఎంత ఎక్కువ తగిలితే ఉత్సవం అంత బాగా జరిగినట్లు అక్కడి ప్రజల లెక్క. తెలంగాణ ప్రాంతంలో దసరా సమయంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు చేస్తారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒకచోట స్ర్తిలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు.
ముక్తాయింపు:
మానవత్వాన్ని పెంచేదే మతం. అందులో శక్తి పూజలూ, దేవతారాధనలూ - ఇవన్నీ సంకేతప్రాయాలే. ప్రతిదానికి ఒక రహస్యం ఉంది. అదేమిటంటే, మనలోని చెడును గుర్తించు. దాన్ని తొలగించు. అదే భక్తి భావం. ముక్తి మార్గం. దేవుడెక్కడో లేడు. నీలోనూ ఉన్నాడు. నాలోనూ ఉన్నాడు. సత్యం, ధర్మం, శాంత, ప్రేమ - ఇవే మన మానవ జన్మ సార్థకం కావడానికి సాధనాలు. అదే మన భారతీయ పండుగల వెనుక ఉన్న పరమార్థం. ఈ విషయం తెలుసుకున్న రోజున, ఒక్క దసరాయే కాదు. ఏ పండుగనైనా ఆనందంగా, సంతోషంగా గడుపుకోగలం.
యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. *
మైసూర్ దసరా వేడుకలు సామరస్యానికి ప్రతీక
‘తాతల కాలం నుంచి మైసూర్ దసరా వేడుకలను అత్యంత దగ్గరి నుంచి తిలకించే భాగ్యం నాకు లభించింది. కుటుంబ సభ్యుల మందరం ఉత్సాహంగా ఈ సంప్రదాయ దసరా వేడుకల్లో పాల్గొనేవాళ్లం. అప్పట్లో మా తాతగారు బంగారు సింహాసనంపై కూర్చొని దర్బార్ నిర్వహిస్తుంటే ఆ ఠీవి చూడముచ్చటగా ఉండేది. కాలక్రమంలో రాజ వంశస్థుడిగా నాకు కూడా ఈ బంగారు సింహాసనాన్ని అధిష్టించే అపురూప అవకాశం లభించింది. దీనిని పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తుంటాను. మైసూర్ దసరా కర్ణాటక ప్రజల జీవితంలో ఓ భాగంగా మారింది. అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యానికి బలమైన పునాదులు వేసింది. అందుకే ఈ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా పాల్గొంటుంటారు.
అసలు ఇలాంటి ఉత్సవాల నిర్వహణ ఉద్దేశం కూడా అదే. గణేష్ ఉత్సవాల నిర్వహణలో కనిపించే సామరస్యం మైసూర్ దసరా ఉత్సవాల్లో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. రాజుల కాలం నుంచి తరాలు మారి ఉత్సవాలు కొత్త రూపం సంతరించుకున్నా ఆ సందడి మాత్రం తగ్గనే లేదు. పైగా ఏటా దాని వైభవం పెరుగుతూనే ఉంది. దసరా ఉత్సవాలను ప్రజలు, ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహించడం అనేది బహుశా దేశంలో మరెక్కడా లేదనుకుంటాను. ఈ చారిత్రాత్మక దసరా మరిన్ని వందల వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష. నాటి తరం దసరా వైభవాన్ని నేటి తరానికి చాటి చెప్పే ప్రయత్నం మరింతగా జరగాలని కోరుకుంటున్నాను.’
-శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మాజీ యువరాజు 400 మైసూర్ దసరా వేడుకల సందర్భంగా అన్న మాటలివి.
శక్తి స్వరూపిణి - శ్రీవిద్య
శ్రీదేవీ లీలా విగ్రహ స్వరూప మహాత్మ్యం అనేది అనిర్వచనీయమైంది. ఇతర దేవతల ధ్యాన స్వరూపంలో వరాభయ ముద్రలుంటాయి. ఐతే పరాదేవత సర్వజగత్కల్యాణదాయిని కావడంవల్ల ఆమె ఎలాటి ముద్రలూ, అభినయాలూ లేకుండానే భక్తులకు వరప్రదాయినిగా అయింది.
శక్తిశే్చచ్ఛాది రూపా, సర్వకార్యానుకూలా - అయిన ఆ శక్తి మహా త్రిపురసుందరి. ఆమె భర్తే త్రిపురుడు. ఆ శక్తి దశ మహా విద్యలుగా ఇలా పరిణమించింది.
శ్లో.కాళీ, తారా, మహావిద్యా, షోడశీ, భువనేశ్వరీ
భైరవీ, ఛిన్నమస్తాచ, విద్యా దూమావతీ తథా
బగళా, సిద్ధ విద్యాచ, మాతంగీ, కమలాత్మికా
ఏతా దశ మహావిద్ సిద్ధ విద్యః ప్రకీర్తితాః
అసలు మంత్రాలన్నీ శ్రీవిద్య నుంచే వచ్చాయి. ఆ విషయాన్ని గుర్తించిన ఉపాసకులు శ్రీవిద్యను ప్రధానంగా ఉపాసిస్తారు. ఆమె సర్వ మంత్ర స్వరూపిణి. సప్త కోటి మంత్ర స్వరూపాలూ ఆమెవే. అలాగే శ్రీయంత్రం నుంచే సకల దేవతల యంత్రాలూ ఉత్పన్నమవుతాయి గనుక ఆమెను అందరూ సర్వ తంత్ర స్వరూపా అని కీర్తిస్తున్నాం. ఈ ఆత్మ విద్యనే షోడశి, భువనేశ్వరి, కాళి - అని మూడు భాగాలై కాలాంతరంలో మార్పులు చెంది దశ మహా విద్యలుగా రూపొందాయి.
భూతాని దుర్గా భువనానిన దుర్గా
స్ర్తీయో నరశ్చాపి పశుశ్చ దుర్గా
యద్యద్ధి దృశ్యం ఖలు సైవ దుర్గా
దుర్గా స్వరూపా దపరం న కించిత్
నమః శ్రీవిద్యా పాదుకాభ్యః
దుర్గాదేవి - వాగ్దేవి
దుర్గాదేవి వాగ్దేవిగా ప్రశంసలను అందుకుంది. అందరికీ వాక్కునిచ్చే దేవత ఆమె. ఆమెనే మెరుపుల్లో కనిపించే విద్యుత్ శక్తి. ఆమెయే ఇంద్రాణి. జ్యోతిర్మయి. మనలోని వాక్కు కూడా ఆమెనే. మేఘాలను వర్షింపజేసే రీతిలో, ఆకాశంలో ఉండటం వల్ల ఏకపదిగా, అంతరిక్షంతో కూడి ఉండటం వల్ల ద్విపదియైంది. నాలుగు దిక్కులా వ్యాపించి ఉండటం వల్ల చతుష్పదిగానూ, మిగిలిన నాలుగు దిక్కులా కన్పించి అష్టపదిగానూ, ఊర్థ్వ దిశతో కలిసి నవపదిగానూ ఉంది. ఆమెనే శబ్ద బ్రహ్మమయిగా వెలుగొందుతోంది. తొలుత ఓంకారమై ప్రణవ స్వరూపిగా ఉంది. వేదవేదాంగాదుల స్వరూపాలను అందుకున్నది. వివిధ భాషా రూప పరివర్తనాలను చెంది సహస్రాక్షరిగా మారింది. అపరిమిత శక్తి కలిగింది. వాగ్దేవిగానూ, సరస్వతిగానూ విరాజిల్లిందా పరమశక్తి. అందుకే ఈ నవరాత్రుల్లో యాదేవీ సర్వభూతేషు.. అంటూ విద్యాగీత పారాయణ చేసి అశేష ఫలితాన్ని పొందవచ్చు.
ఏ స్తోత్రాలు పారాయణ చేయాలి
లోకానికి రమణ మహర్షిని పరిచయం చేసిన వాశిష్ఠ గణపతి ముని ఉమా సహస్రం, ‘ఇంద్రాణీ సప్తశతి’ వంటి మహా గ్రంథాలను మనకు అందించారు. దేశంలోని అనిశ్చితి, అల్లకల్లోల పరిస్థితులు, అశాంతి, అరాచకాల నుంచి దేశాన్ని రక్షించమని ఆ అమ్మవారిని వేడిన శ్రీ వాశిష్ఠ గణపతి ముని రాసిన ఈ ఇంద్రాణీ సప్తశతి భారతదేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా దసరాల సందర్భంగా భారతీయులందరూ పఠించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే, దసరా 9 రోజులూ నిత్యమూ దుర్గ సప్తశ్లోకి, దుర్గా సప్తశతి, విద్యా గీత, మహిషాసుర మర్దిని స్తోత్రం, సౌందర్య లహరి, అపరాజితా స్తోత్రం, అర్గళా స్తోత్రం, దేవీ ఖడ్గమాలా స్తోత్రం, అర్జున కృత రణదుర్గా స్తోత్రం, లలితా త్రిశతి, కనకధారా స్తోత్రం, అన్నపూర్ణా స్తోత్రం, దుర్గా అష్టోత్తర శతనామావళి, బాలాత్రిపుర సుందరి అష్టోత్తర శత నామావళి, సౌందర్య లహరి, రాజరాజేశ్వరీ అష్టోత్తర శత నామావళి, విద్యాగీత, లలితా సహస్ర నామం వంటి వాటిని పారాయణ చేయడం అందరికీ శ్రేయోదాయకం. వీటిలో కనీసం ఒక్కటన్నా పారాయణ చేయడం శుభాన్నిస్తుంది.
*****

No comments:
Post a Comment