Thursday, March 15, 2012

మంచు సొరంగం

             11/03/2012     ఆదివారం ఆంధ్రభూమి అనుబంధంలో  వి.వి.వి.రమణ పేరుతో వచ్చిన   కవర్ స్టోరీ
మంచు సొరంగం
   
హిమాలయ పర్వతాలు భారతీయ ఆధ్యాత్మికతకి ఆలవాలం. భారతదేశానికి ఉత్తరంగా వెలసిన హిమాలయాలు శత్రు దేశాల నుంచి రక్షించడంలో కూడా ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అలాంటి హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రమాదకరమైన దారులెన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని మన దేశ పరిరక్షణకు ఎంతో కీలకం. అలాటి వాటిల్లో రోహ్‌తంగ్ పాస్‌ను ప్రముఖంగా చెప్పాలి. చలికాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడిపోవడం వల్ల సైన్యానికీ, సాధారణ జన జీవనానికీ ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. రాకపోకలే ఉండవు. అందుకే ఈ రోహ్‌తంగ్ పాస్ కింద ఒక సొరంగాన్ని నిర్మిస్తున్నారు.

ఇంతకీ ఏమిటా సొరంగం? ఏమా కత?

హిమగిరి సొగసులూ...హిమగిరి సొగసులూ, మురిపించునూ మనసులూ..అని ఒక సినీ కవి అంటే, మరో కవి అహో! హిమవన్నగమూ, భరతావనికే తలమానికమూ..అని మరో సినీ కవి కొనియాడాడు. నిజమే. హిమాలయాల సొగసు అల్లాటిది. భారతీయుల మదిలో హిమాలయాలకు పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకంటే, భారతీయ ఆధ్యాత్మికతకు హిమాలయాలే ఆలవాలం. మన పురాణాల్లో, జానపదాల్లో, చారిత్రక కథనాల్లో సైతం హిమాలయాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ హిమాలయ పర్వత శ్రేణుల ప్రభావం ఇటు భారతదేశంపైనే కాదు అటు ఆఫ్గనిస్తాన్, భూటాన్, బర్మా, చైనా, నేపాల్, పాకిస్తాన్ దేశాలపైనా ఉన్నది. ప్రపంచంలోకెల్లా ఎతె్తైన శిఖరాలు ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి. వీటిలో ఎవరెస్టు శిఖరం అన్నిటికన్నా ఎతె్తైనదని మళ్లీ వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ శ్రేణుల్లో కొన్ని వందల కొండల దాకా ఉన్నాయి. వాటిలో దాదాపు వంద కొండల శిఖరాలు 7200 మీటర్ల పైఎత్తులోనే ఉన్నాయి. ప్రధాన హిమాలయ పర్వత శ్రేణులు పశ్చిమ దిక్కు నించీ తూర్పు దిక్కు వైపు వ్యాపించి ఉన్నాయి. అంటే ఇటు సింధూ నదీ లోయ ప్రాంతం నించీ అటు బ్రహ్మపుత్రా నదీ లోయ ప్రాంతం దాకా 2400 కి.మీ. పొడవున ఒక ఛాపం (ఆర్క్) లాగా వ్యాపించి ఉన్నదన్నమాట. వీటి వెడల్పు 400 కి.మీ నించి 150 కి.మీ. దాకా మారుతూ ఉంటుంది. అంటే, పశ్చిమ కాశ్మీర్ - క్సింజియాంగ్ ప్రాంతంలో 400 కి.మీ. వెడల్పుతో అంటే, టిబెట్ - అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతంలో 150 కి.మీ. వెడల్పులో ఉంది. ప్రపంచంలో ముఖ్యమైన నదీ వ్యవస్థలు హిమాలయాల్లోనే పుట్టడం మనకు తెలిసిన విషయమే. దక్షిణాసియా సంస్కృతుల్లో హిమాలయాలనేవి విడదీయరాని అంశంగా కలిసిపోయింది.హిమాలయాల్లో కొన్ని శ్రేణులు శాశ్వతంగా ఎప్పుడూ మంచుతోనే కప్పబడి ఉంటే, మరి కొన్నిచోట్ల మంచు తీవ్రత ఎండాకాలం, చలికాలం, వానాకాలాలను బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉండటం గమనార్హం.లోతట్టు అటవీ ప్రాంతంలో, అంటే గంగానదీ ప్రాంతంలో ఒకలా ఉంటే, పంజాబ్, పాకిస్తాన్ ప్రాంతాల్లో మరోలా ఉంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో ఇంకోలా ఉంటుంది. శివాలిక్ పర్వత ప్రాంతాల్లో మరోలా ఉంటుంది.హిమాలయాల్లో దాదాపు 15 వేల హిమనదాలు (గ్లేషియర్లు) ఉన్నాయి. మంచుతో కప్పబడిన ఈ హిమనదాల్లో దాదాపు 12 వేల కి.మీ.3 తాజా నీరు ఉంది. 70 కి.మీ. పొడవైన సియాచిన్ గ్లేషియర్ పోలార్ ప్రాంతం బయట ప్రపంచంలో అతి పెద్దదైన రెండో గ్లేషియర్‌గా పేరు పొందింది. ఈ సియాచిన్ గ్లేషియర్ భారతదేశానికీ, పాకిస్తాన్‌కీ మధ్య సరిహద్దుల్లో ఉంది.హిమాలయాల్లో వందల కొద్దీ సరస్సులున్నాయి. పాంగోంగ్‌ల్సో అనేది భారత్‌కీ చైనాకీ మధ్య ఉన్న సరస్సు. యమద్రోక్‌త్సో అనే సరస్సు మధ్య టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇవిగాక గురుదోగ్మర్ సరస్సు, త్సాంగ్మో సరస్సు, లిచో సరస్సు అనేవీ చెప్పుకోదగ్గ సరస్సులే. అన్నట్టు భారతదేశ ఉష్ణోగ్రతల మీద హిమాలయాల ప్రభావం ఎంతో ఉంది కూడా.మన దేశ ఉత్తర సరిహద్దుల్ల దాదాపు 7 లక్షల మంది సైనికులు సదా కాపలా కాస్తున్నారు.హిమాలయాల్లో దారులు హిమాలయాల్లో పయనించడం అంత సులభం ఏమీ కాదు. హిమాలయాల్లో దాదాపు ఏడు మార్గాలు ప్రయాణానికి అనువుగా ఉన్నాయి. వీటిలో బనిహాల్ అనేది ముఖ్యమైంది. బనిహాల్ పాస్ అంటారు దీన్ని. ఇది జమ్మూలోని వివిధ కొండ ప్రాంతాలని కాశ్మీరు లోయతో కలుపుతుంది. అందుకే ముఖ్యమైంది.జోజిలా పాస్ అనేది కార్గిల్ జిల్లాలో ఉంది. కార్గిల్ జిల్లాకు కాశ్మీర్ లోయకూ సంబంధాన్ని ఏర్పరచేది జోజిలాపాసే. లడఖ్ ప్రాంతాలకు పశ్చిమాన్నుంచి ఉండే ఏకైక దారి ఇది. శివాలిక్ కొండల్లో ఉండే ముఖ్యమైన దారి మోహన్ పాస్’. సిక్కింలోని ప్రధాన హిమాలయ పాదాల పక్కనే వెళ్తూంది దారి. నథూలా పాస్, జెలెప్లా పాస్‌లనేవి సిక్కింలోని గాంగ్‌టాక్‌కీ టిబెట్‌లోని ల్హాసాకీ మధ్య ఉన్నాయి.నేపాల్‌లోని ఖాట్మండూ నించి టిబెట్‌ను కొడారి, ఝాంగ్మూ దగ్గర తగిలి ఆనక న్యాలమ్ దగ్గరకు తీసికెళ్లే అర్నికో రాజమార్గ్ (ఫ్రెండ్‌షిప్ హైవే)లో లాలుంగ్‌లా పాస్, తింగరి, క్సెగర్, లక్పలాపాస్, ల్హాత్సె పాస్ (బ్రహ్మపుత్ర నది దగ్గర) ఉన్నాయి. నేపాల్ - టిబెట్ సరిహద్దులో ముస్తంగ్‌పై చివర 4594 మీటర్ల ఎత్తులో కోరాలా పాస్ అనేది ఉంది. ఈ కోరాలా పాస్ అనేది ఎవరెస్టు, కె2 శ్రేణుల మధ్య వుండే లోతట్టు దారి. నాథూలా పాస్, జెలెప్లా పాస్‌లకన్నా 300 మీటర్ల అధిక ఎత్తులో ఉంది. ఈ నాథూలా పాస్, జెలెప్లా పాస్‌లనేవి సిక్కిం, టిబెట్‌ల మధ్య ఉంది.హిమాలయాల పర్వత శ్రేణుల్లో ప్రమాదకరమైన దారులెన్నో! వీటిలో కొన్ని దారులు మన దేశ రక్షణకే కీలకమైనవి. అలాటి వాటిలో ముఖ్యమైంది రోహ్‌తంగ్ పాస్. రోహ్‌తంగ్ పాస్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ, లేహ్ మార్గంలో ఉంది. ఇది మనాలీ లోయనీ లా హూల్, స్విటి లోయలనీ కలుపుతూంది. రోహ్‌తంగ్ పాస్ అటు సామాన్యులకూ, ఇటు సైన్యానికీ కీలకమైన దారిగా మారింది.ఈ రోహ్‌తంగ్ పాస్ ద్వారా చలికాలంలో పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దేశాన్ని రక్షించడంలో ఈ దారి మన సైన్యానికి ఒక సవాలుగా మారింది. అందుకే ఏ కాలంలోనైనా పయనించేందుకు వీలుగా ఒక సొరంగాన్ని తవ్వాలని పథకం వేశారు. దానికే రోహ్‌తంగ్ టనె్నల్ - రోహ్‌తంగ్ సొరంగం అని పేరు పెట్టారు. ఇదే పూర్తయి వాడుకలోకి వస్తే 48 కి.మీ.ల దూరం తగ్గుతుంది. 4 గంటల సమయం ఆదా అవుతుంది కూడా.రోహ్‌తంగ్ పాస్ రోహ్‌తంగ్ పాస్ అనేది (సముద్ర మట్టంకన్నా) 3979 మీటర్ల ఎత్తులో ఉంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో పిర్‌పంజాల్ శ్రేణి మీద మనాలీ - లేహ్ హైవే మార్గంలో ఉంది. తూర్పు పిర్‌పంజాల్ శ్రేణి అనేది హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ నుంచి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోహ్‌తంగ్ పాస్ అనేది కులూ లోయను హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండే లహావుల్ (లేదా లాహూల్), స్పిటి లోయలను కలుపుతుంది. ఈ రోహ్‌తంగ్ పాస్ అనేది అటు భారతీయతకీ, ఇటు బౌద్ధానికీ ప్రతీకగా నిలుస్తుంది. బియాస్, చీనాబ్ నదీ పరీవాహక ప్రాంతాల్లోని రోహ్‌తంగ్ పాస్ ప్రతి ఏడూ మే నెల నుంచి నవంబర్ నెల దాకా మాత్రమే తెరచి ఉంచుతారు. మిగిలిన ఐదు (ఆరు) నెలలూ ఈ దారి ప్రయాణానికి అనువుగా ఉండదు. నడిచి పోలేరని కాదు. నిజానికి హిమాలయాల దారుల ప్రమాణాలతో పోలిస్తే ఈ దారిలో నడవడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే, మే - నవంబర్ మాసాల మధ్య కాకుండా ఇతర మాసాల్లో ఈ రోహ్‌తంగ్ పాస్ దారి ఏ క్షణాన ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఏ క్షణంలోనైనా మంచు తుఫాను ముంచుకొచ్చేయవచ్చు. కొండ చరియలు విరిగి పడొచ్చు. కన్నూమిన్నూ కానరాకుండా మంచు తుఫాను ముంచెత్తేయవచ్చు.కానీ, ఈ దారి అనాదిగా వ్యాపార రహదారిగా కావడంవల్ల దీనికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి దారులూ కనుక్కోలేక పోవడం వల్ల పిర్‌పంజాల్ శ్రేణికి అటూ ఇటూ ఉండే జనాభా, ఇప్పటికీ ఈ దారి మీదే ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తోంది. లాహూల్, స్పిటి ప్రాంతాల్లో కుంజంలా, బరాలా ఛాలా వగైరా పేర్లతో కొన్ని దారులున్నాయి. ఐనా రోహ్‌తంగ్ పాస్ చాలా ప్రాచీనమైన దారి కావడం, రద్దీగా ఉండటానికి ముఖ్య కారణం. కులూ మనాలీ నుంచి కీలోంగ్, లాహూల్‌లకు రోహ్‌తంగ్ పాస్ కీలకమైన దారిగా లడఖ్ దాకా విస్తరించి ఉండటం వల్ల ఎండాకాలంలో అటు యాత్రికులూ, ఇటు సామాన్య జనాభాయే కాదు, భారత సైన్యం కూడా ఈ దారిని తన ముఖ్య ప్రత్యామ్నాయ దారిగా ఎంచుకొంది. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత ఈ దారి సైన్యానికి కూడా కీలకమైంది. అందువల్ల ఈ దారిలో ట్రాఫిక్ జామ్‌లు చాలా మామూలై పోయాయి. మిలిటరీ వాహనాలూ, ట్రక్కులూ, సామాగ్రి తీసికెళ్లే లారీలు - వీటి సంఖ్య పెరిగిపోయాయి. మధ్యలో మంచు, మంచు గడ్డలతో ముంచెత్తే ప్రదేశాలు వేరే. ఇవిగాక పర్యాటక వాహనాలు చెప్పనక్కర్లేదు. అసలు మనాలీ నుంచి లెహ్ వెళ్లి, తిరిగి రావడం నిజంగా నరకమే! అంటున్నారంతా. ఒక యాత్రికుడి అనుభవం ఎలా ఉందంటే, సూర్యోదయానికన్నా ముందే మనాలీ నించి బయల్దేరి మరో 17 గంటల్లో లెహ్ చేరేస్తానని అనుకొన్నాడు. కానీ ముందు చెప్పిన రీతిన అవాంతరాలను ఎదుర్కొని లెహ్ చేరడానికి 17 కాదు 20 కాదు, 30 కాదు. ఏకంగా 40 గంటలు పట్టింది. సాధారణ ట్రాఫిక్ జామ్‌లైతే ఫర్లేదు. దారిలో మంచు చరియ విరిగి వానలు కురిసింది. దారంతా మంచుతో నిండి పోయింది. దాన్ని తొలగించడానికి దాదాపు 10 గంటల సమయమే పట్టింది. భారతీయ సైన్యం ఒక బుల్‌డోజర్‌ను అక్కడికి పంపి దారిని శుభ్రం చేయకపోయుంటే, మేం ఏం ఐపోయేవాళ్లమో? అన్నాడా యాత్రికుడు ఎంతో ఉద్వేగంతో.ఇంతకీ సొరంగం సంగతేంటి?చరిత్రలోకి తరచి చూస్తే హిమాలయ పర్వతాలను భారతదేశం ఎపుడూ ఒక రక్షణ కవచంగానే భావించింది. సరిహద్దు ప్రాంతాలను రక్షించుకోవడమే ముఖ్యం గానీ, అభివృద్ధి చేయడం మంచిది కాదని భావించింది. ఎందుకంటే, ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తే శత్రు దేశాలు చొచ్చుకురావడం సులభమన్నది నాటి భావన. కులు మనాలీ నుంచి లడఖ్ దాకా రహదారులు చాలా ప్రమాదకరం. వాటిని సరైన రీతిలో అభివృద్ధి చేసుకోలేదు. వాటికి ప్రత్యామ్నాయాలనూ ఆలోచించలేదు. లడఖ్ ప్రాంతాల్లో భారత సైన్యాలు పదివేలకు పైచిలుకే విడిది చేసింది. వారి రాకపోకలకూ తిండి చేరవేసేందుకు ప్రత్యామ్నాయ దారులు లేకపోతే? వారి భవితవ్యమేమిటి? దేశ రక్షణ మాటేమిటి? సియాచిన్ గ్లేషియర్ ప్రాంతంలో 1980 ప్రాంతాల నుంచి సరిహద్దు సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇండియాకూ పాకిస్తాన్‌కూ మధ్య స్పర్థలు పెంచుతూనే ఉన్నాయి. మన సైన్యమైనా (వారి సైన్యమైనా) ఎండాకాలంలోనే రాకపోకలు సాగించి పటిష్టంగా ఉంచుకోవాల్సి ఉంది. 1999 ప్రాంతాల్లో కార్గిల్‌లో చెలరేగిన యుద్ధం తర్వాత మన దేశం ప్రత్యామ్నాయ దారుల గురించి దృష్టి పెట్టింది.నిజానికి 1983లోనే రోహ్‌తంగ్ పాస్మన భారతీయ సైన్యానికి దేశ పరిరక్షణలో కీలకమైన దారిగా గుర్తించారు. అందుకే ఈ రోహ్‌తంగ్ రహదారి దాదాపు 9 కి.మీ. దూరం ఉంది. దాని కింద అన్ని రకాల వాతావరణాలకూ తట్టుకుని ఉండేలా, ఎలాటి వాతావరణంలోనైనా ప్రయాణం చేయడానికి వీలుగా ఉండేలా ఒక సొరంగాన్ని నిర్మించాలని అనుకున్నారు. దీనివల్ల సంవత్సరంలో 12 నెలలూ రాకపోకలు సుసాధ్యం అవుతాయన్నదే ఆశయం. దాని కోసం రైట్స్సంస్థ అధ్యయనం చేసి ఒక ప్రాజెక్టు రిపోర్టును రూపొందించింది. దానిని సెక్యూరిటీపై కాబినెట్ కమిటీకి సమర్పించింది. దాని ప్రకారం 9 కి.మీ. దూరమూ ఒక సొరంగాన్ని తవ్వడం సాధ్యమేననీ, రోడ్డు స్థాయిలో 10 మీటర్ల వెడల్పుతో రోడ్డునూ (మీటరు వెడల్పున ఫుట్‌పాత్‌లతో సహా) నిర్మించవచ్చనీ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును శ్రీమతి ఇందిరాగాంధీ (నాటి ప్రధాని) ప్రతిపాదించారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరో సంస్థా కలిసి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక సర్వే జరిపాయి. 1987లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండినపుడు మరింత చొరవ చూపారు. ఐతే 2000 సం. నాటికి దానికి ఆమోద ముద్ర పడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమే, 5 బిలియన్ల రూపాయల ఖర్చుతో ఏడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆశించారు, ఆదేశించారు. 2002 మే నెల 6వ తేదీన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్అనే సంస్థకు ఈ సొరంగాన్ని నిర్మించే పనిని అప్పగించడం జరిగింది. 2002 మే నెల 23వ తేదీనాడు వాజ్‌పేయి ఆ పనిని లాంఛనంగా ఆరంభిస్తున్నట్టుగా ప్రారంభోత్సవాన్నీ నిర్వహించారు. ఆ రోజుకు 13.35 బిలియన్ల బడ్జెట్‌గా నిర్ధారించడం జరిగింది. 2010 కల్లా పూర్తి అయిపోతుందని ప్రకటించారు కూడా. ఐతే ఏడాది గడిచినా, అంటే మే 2003 నాటికి కేవలం చెట్లు నరకడం తప్ప వేరే ఎలాటి పురోగతీ కనిపించలేదు.ఇలా పలు రకాల ఆలస్యాల నేపథ్యంలో డిసెంబర్ 2004 నాటికి ప్రాజెక్టు బడ్జెట్ 17 మిలియన్ రూపాయలకు చేరుకుంది. 2007 మే నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఎస్‌ఎంఇసి (స్నోరుూ వౌంటెన్స్ ఇంజనీరింగ్ కార్పొరేషన్) ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. దీంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి గడువు కూడా 2014కు మారింది. ఈ సంస్థ కూడా ఎంతో ఆడంబరంగా ప్రాజెక్టు పనులను 2008లో ఆరంభించినప్పటికీ, 2009 నవంబర్ నాటికి ఎలాంటి పురోగతినీ చూపలేకపోయింది. దాంతో ఈ ప్రాజెక్టును ఆఫ్‌కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే భారతీయ సంస్థకీ, ఆస్ట్రియాకు చెందిన స్ట్రా బాగ్ ఏజి అనే సంస్థకీ కలిపి జాయింట్ వెంచర్కింద అప్పగించారు. దీనికి సెక్యూరిటీ కమిటీ క్లియరెన్స్ తిరిగి ఇవ్వడం జరిగింది. హిమాలయ శ్రేణుల్లో డ్రిల్లింగ్ ఆపరేషన్ ఆరంభమైంది. 2010 జూన్ 28 నాడు మనాలీకి ఉత్తరాన 30 కి.మీ. దూరంలోని సౌత్ పోర్టల్‌లో ఈ రోహ్‌తంగ్ సొరంగాన్ని తవ్వడం ఆరంభించారు. అంతా సవ్యంగా జరిగితే, 2015 నాటికి ఇది పూర్తి కావాలి. ఈ రోహ్‌తంగ్ సొరంగం పొడవు 8.8 కి.మీ. అంటే దాదాపు 9 కి.మీ. ఇందులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంటుంది. దాదాపు 400 మందికి పైగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. తాజాగా వాడే ఆస్ట్రియన్ టనె్నలింగ్ పద్ధతినే ఈ రోహ్‌తంగ్ సొరంగం తవ్వడానికీ వాడుతున్నారు. సొరంగానికి అటూ ఇటూ రోడ్డుకు కలిపే చోట కూడా కొండచరియలు విరిగి పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. భారతీయ డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ సంస్థ ఈ సురక్షిత డిజైన్లను రూపొందించింది.సొరంగం వాడకంలోకి వస్తే, రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందనేది నిర్వివాదాంశం. అందువల్ల వాహనాల నిర్వహణ, రక్షణ, కాలుష్య నివారణ, కాలుష్య నియంత్రణ - వీటిని కూడా పరిగణనలోకి తీసుకొంటున్నారు. క్రమ దూరాల్లో సిసి టీవీలను ఉంచి రవాణాను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. కాలుష్యాన్ని చెక్ చేసేందుకు ఎలక్ట్రానిక్ సెన్సారులను బిగిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సెన్సారులు సొరంగంలో కాలుష్యాన్ని అదే పనిగా గుర్తిస్తూంటాయి. నిర్ణయించిన స్థాయికన్నా ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ప్రమాణాలుంటే, తాజాగా ఆక్సిజన్‌ను వదులుతాయి. సొరంగాని కిరువైపులా చెరోపక్క పర్యవేక్షణ గదులనీ నిర్వహిస్తారు. కాలుష్యాన్ని గుర్తించిన 90 సెకన్లలోపే దాన్ని నియంత్రించడం జరుగుతుంది. సొరంగం గుర్రంనాడా ఆకారంలో ఉండటంవల్ల, ఈ సొరంగంలో పెద్ద పంఖాలను (సీలింగ్ ఫాన్స్) ఉంచబోతున్నారు. దీనివల్ల సొరంగం మొత్తం నిడివికీ వెంటిలేషన్ వ్యవస్థ ఒకే తీరులో ఉంటుంది. గాలీ సరిగ్గా ఆడుతుందన్నమాట. ఈ సొరంగంలో ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా, దాని 200 మీటర్లలోపే నియంత్రించడం జరుగుతుంది.ఎమర్జెన్సీ సమయాల్లో (రాజకీయంగా కాదు) - అంటే అత్యవసర పరిస్థితుల్లో ఈ సొరంగంలో అందరికీ సందేశాలు అందించే రీతిలో పబ్లిక్ ఎడ్రస్ సిస్టమ్‌నీ పెడుతున్నారు. సొరంగం మొత్తం 8.8 కి.మీ దూరంలోనూ, క్రమ పద్ధతిలో స్థిరమైన దూరాల్లో స్పీకర్లూ ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సొరంగ తవ్వకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2011లో జూన్ జూలై నెలల్లో శంకుస్థాపన చేశారు కూడా. అన్నీ సవ్యంగా జరిగితే 2015 ఫిబ్రవరి నాటికి ఈ రోహ్‌తంగ్ సొరంగం తయారై తీరుతుంది. ఐతే 8.8 కి.మీ నిడివి కలిగి, గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ రోహ్‌తంగ్ (పాస్) సొరంగం కన్నా స్విట్జర్లాండ్ ఆల్ఫ్ పర్వతాల్లో 57 కి.మీ. పొడవులో వున్న గొట్టోహార్డ్ బేస్ రైల్వే సొరంగం పెద్దది. దీని నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది కూడా. చైనాలో ఇప్పటికే (2002 నాటికే) పూర్తయిన ఫెన్‌ఘౌషోన్ రైల్వే సొరంగం కంటే ఈ ఆల్ఫ్ పర్వతాల సొరంగం చిన్నదే. కాకపోతే, రోహ్‌తంగ్ సొరంగం ప్రత్యేకత దానిదే. రోహ్‌తంగ్ సొరంగం గనక పూర్తయితే, ‘అతి ఎత్తులో (సముద్రమట్టం కన్నా) నిర్మితమైన అతి పొడవైన సొరంగంగా పేరు సంపాదిస్తుంది. తొలి విడతగా రూపొందే ఈ రోహ్‌తంగ్ సొరంగంపూర్తయితే, లాహౌల్ లోయకు సదా రవాణా సౌకర్యాలు ఉండే వీలు ఏర్పడుతుంది. ఐతే లడఖ్ కూడా ఆల్ సీజన్ రోడ్డు కేవలం రోహ్‌తంగ్ సొరంగంతో వచ్చేయదు. దానికి మరిన్ని సొరంగాలు తవ్వాల్సి రావచ్చు. అలా జరిగినా లడఖ్‌కు ఏడాది పొడవునా రాదారి ఉంటుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నఅంటున్నారు విశే్లషకులు. *

రోహ్‌తంగ్ అంటే ఏమిటో తెల్సా?

రోహ్‌తంగ్పేరులోనే జయించరానిఅర్థం దాగుంది. బహుశా అందుకేనేమో! ఈ ఉత్తుంగ హిమాలయ శ్రేణులలోని దారికి రోహ్‌తంగ్ పేరు వచ్చింది. పీర్ పంజాబ్ శ్రేణులలోని ఈ దారికి రోహ్‌తంగ్అని ఎవరు పేరు పెట్టారో తెలీదు. పర్షియన్ వారై ఉంటారని అనుకోవచ్చు. ఎందుకంటే రోహ్‌తంగ్అనే పదానికి పర్షియన్ భాషలో మృత కళేబరాల దొంతరలని అర్థం చెబుతారు.

రోహ్‌తంగ్ సొరంగం విశేషాలు

 సొరంగం పొడవు: 8.8 కి.మీ. (5.5 మైళ్లు)సొరంగ స్వరూపం/ ఆకారం: గుర్రపు నాడా ఆకారం పూర్తి అయ్యాక నిడివి: 10 మీ. (32.8 అడుగులు) - రోడ్డు స్థాయికి (8 మీ. పేవ్‌మెంట్, 1 మీ. ఫుట్‌పాత్ - రెండు వేపులా)సాధారణ ఎత్తు (సముద్ర మట్టం కన్నా): 3,000 -3100 మీ.నిర్దేశిత వాహన వేగం: 80 కి.మీ. గంటకు ఉష్ణోగ్రత తేడా: 1.25 నించి 30 డిగ్రీల సెం.గ్రేడ్ (మే,జూన్‌లలో)2.-30 నించి -20 డిగ్రీల సెం.గ్రేడ్ (డిసెంబర్,జనవరి లలో)ప్రత్యేకతలు: పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వెంటిలేషన్‌కై ఫ్యాన్స్, తాజా గాలి నిర్వహణకై సెన్సార్లు రోహ్‌తంగ్ సొరంగం డిజైన్‌లో పరిగణనకు తీసుకున్న అంశాలు1.గరిష్ట పరిమితి - 150 పిపిఎం2.దృశ్యమితి (వీక్షణం) - 0.009 మీ. దూరం3.వాహనాలు - ఎ.కార్లు 3000 బి.ట్రక్కులు 1500 4.పీక్ టైంలో ట్రాఫిక్ - 337.5 పీసీయులు5.సొరంగంలో వేగ పరిమితులు - ఎ.కనీస వేగం - 30 కి.మీ. గంటకు బి.గరిష్ట వేగం - 80 కి.మీ. గంటకు

ప్రపంచంలో కొన్ని ముఖ్య సొరంగాలు

సొరంగం పేరు సముద్ర మట్టంకన్నా ఎత్తు పొడవు1.ఆల్ఫ్ పర్వతాల్లో రైల్వే సొరంగం 3053 మీ. 57 కి.మీ.2.ఫెంఘౌషోన్ రైల్వే సొరంగం 4905 .మీ. 1.338 కి.మీ.3.అంజోబ్ రోడ్ సొరంగం, తజకిస్థాన్ 337 మీ. 5 కి.మీ.4.ఖోజక్ రైల్వే సొరంగం, (1891) పాకిస్తాన్ 3912 మీ. 3.9 కి.మీ.5.ఐసెన్‌హావర్ మెమోరియల్ సొరంగం, అమెరికా 3401 మీ. 2.731 కి.మీ.6.లా గలేరా రైల్వే సొరంగం, పెరూ 4781 మీ. 1.177 కి.మీ.వీటితో పోల్చినపుడు రోహ్‌తంగ్ సొరంగం, అటు సముద్ర మట్టంకన్నా ఎత్తు, ఇటు పొడవు - ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే, అంత ఎతె్తైన ప్రదేశంలో అంత సుదీర్ఘమైన పొడవున్న ఏకైక సొరంగంగా పేరు సంపాదించు కొంటుంది. ఈ సొరంగ నిర్మాణంలో కార్మికులు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే, ఇక్కడ ప్రాణవాయువు అంతంత మాత్రంగానే ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు

1.రష్యన్ సైబీరియన్ రోడ్డు - యకూటియాకెళ్లే ఈ రోడ్డు పొడవు 1235 కి.మీ.2.నార్వే లైసిబోట్ రోడ్డు - లైసిబోట్ అనేది ఒక చిన్న గ్రామం.3.ఈక్వడార్ కొటొపాక్సీ రోడ్డు - కొటొపాక్సీ అనేది అత్యంత ప్రమాదకరమైన అగ్ని పర్వతం. 1738 సం. నుంచీ కనీసం 50 ప్రమాదాల పైనే జరిగాయిక్కడ.4.ఇండియాలో జోజిలా పాస్ - పర్వతాల ప్రాంతంలో నేషనల్ హైవే 1డి. ఇది శ్రీనగర్, లేహ్‌ల మధ్య ఉంది. చలికాలంలో ఈ రోడ్డు మూత పడుతుంది కూడా.5.ఇండియాలో లడక్ - జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోని కున్‌లున్ పర్వత శ్రేణులూ, హిమాలయాల నించి దక్షిణానికి వెళ్లే ప్రాంతం.6.చాంగ్‌లా పాస్, ఇండియా - ఇండియాలో ఎతె్తైన పర్వత శ్రేణులలోని రోడ్డు. ఇది హిమాలయాల్లోని చాంగ్‌టాంగ్ ప్లేటోకి ముఖద్వారం.7.ఖర్దుంగా పాస్, ఇండియా- ఇదీ లడక్ ప్రాంతాల్లోనే ఉంది. నుబ్రా, షైలోక్ లోయల మధ్య ఉందీ రోడ్డు.8.సీ అండ్ స్కై హైవే 99, కెనడా - మరీ అంత కాకపోయినా కొంత ప్రమాదకరం.9.స్టెల్వియోపాస్, ఇటలీ - ఆస్ట్రియా సామ్రాజ్యవాదులు 1820-25 ప్రాంతాల్లో నిర్మించారు. లొంబార్డియాను మిగతా ఆస్ట్రియాతో కలిపే ఈ రోడ్డులో 60 హేర్‌పిన్ బెండ్స్ ఉన్నాయి. మోటరిస్టులకీ రోడ్డు ఛాలెంజే!10.నార్త్ యంగాస్ రోడ్, బొలీవియా - రోడ్ ఆఫ్ డెత్ (మరణానికి రాదారి) గా పేరు పొందిందీ రోడ్డు. కొండల్లోని 40 మైళ్ల ఈ రోడ్డు నిడివి కేవలం 10 అడుగులే. **
 

No comments:

Post a Comment