Monday, August 22, 2011

సేవే సత్యం - ఈ యుగం సాయి యుగం! ఈ జగం సాయి మయం.

ఆంధ్రభూమి దిన పత్రిక - ఆదివారం అనుబంధంలో వ్రాసింది...

సేవే సత్యం

-వి.వి.వెంకటరమణ

May 1st, 2011


ఈ యుగం సాయి యుగం! ఈ జగం సాయి మయం. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధులు. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి-ఈ జగమే నా ఇల్లు- అని శిరిడీలో ఆయన ఒకసారి భావ గర్భితంగా ప్రకటిస్తూ తానెవరో చెప్పకనే చెప్పారు. శిరిడీ వంటి చిన్న వాడను ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందించాడాయన. సాక్షాత్తు దత్త స్వరూపుడైన శిరిడీసాయి 1918లో విజయదశమి (అక్టోబర్ 15)నాడు మహాసమాధి చెందారు.

శిరిడీలో స్వామి సమాధి చెందడానికి ఒక సంవత్సరం ముందు, అంటే 1917లో ఆ సాయికి అత్యంత భక్తురాలైన శ్రీమతి గాలి శారదాదేవి, స్వామి చివరి దర్శనం చేసుకున్నప్పుడు ‘‘బాబా! ఆధ్యాత్మికంగా నా జీవితం సార్ధకం చేసుకోవడానికి మంత్రం ఉపదేశించి నన్ను మంచి మార్గంలో పెట్టు’’ అని వేడింది. మొదట స్వామి ‘‘నన్ను విసిగించవద్దు!’’ అన్నా ఆ తర్వాత బిడ్డా! నీకొక రహస్యం చెబుతాను. ఎవరికీ చెప్పనని ప్రమాణం చెయ్యి! నేను ఆంధ్రదేశంలో సాయిబాబా పేరుతో తిరిగి అవతారమెత్తుతాను. అప్పుడు నీవు నా దగ్గరికి వస్తావు. నన్ను సేవించుకునే భాగ్యం కలగ చేస్తానుఅని చెప్పారు. ఆ తర్వాత ఏడాదే శిరిడీసాయి అవతారాన్ని విడిచిపెట్టారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత శారదాదేవికి సాయి, సత్యసాయిగా దర్శనమిచ్చాడు. నీవు పుట్టపర్తికి రా! నీకు అంతా చెబుతానక్కడఅని చెప్పారు సత్యసాయి. ఆమె పెద్దబొట్టుగా పిలువబడుతూ తన జీవితమంతా ప్రశాంతి నిలయంలో గడిపింది.
ఈ కథ ఒక్కటి చాలు! శిరిడీసాయి, సత్యసాయి ఒక్కరనడానికి!
తానే శిరిడీ సాయినని సత్యసాయిబాబా ప్రకటించడమే కాదు. శిరిడీసాయి జననం గురించి కూడా సత్యసాయి ఒక శుభ ముహుర్తాన పుట్టపర్తిలో జనులందరికీ తెలియజేశాడు. శిరిడీసాయి నాటి నైజాం రాష్ట్రంలోని పత్రి గ్రామంలో జన్మించాడు. జననాతీతుడే అయినా మానవరూపం ధరించాడు. గంగాభవాడ్య (్భవాడియా), దేవగిరమ్మ దంపతులకు జన్మించిన సాయి శివస్వరూపుడు. దేవగిరమ్మకు శివుడు ఇచ్చిన వరమది. 1835 సంవత్సరంలో సెప్టెంబర్ 28న దేవగిరమ్మకు జన్మించిన పిల్లవాడే జగద్రక్షకుడు. పుట్టిన బిడ్డను అడవిలో వదిలి దీక్షాపరుడైన గంగాభవాడ్యుని వెంట వెళ్లిపోయింది. ఆ పిల్లవాడిని వెంకూసా దగ్గరికి ఒక ఫకీరు తెచ్చి వదిలాడు. వెంకూసా గురువుకు 12 ఏళ్ల శిష్యరికం చేసిన ఆ బాలుడే శిరిడీలో సాయిబాబాగా వెలిసాడు.
ఇదీ క్లుప్తంగా శిరిడీసాయి జన్మరహస్యం. సత్యసాయి ఈ రహస్యాన్ని భక్తులందరికీ అందచేశాడు. అంతేకాదు ప్రేమసాయిఅనేది తన తదుపరి అవతారనీ కూడా వెల్లడి చేశాడు సాయినాధుడు.
శిరిడీసాయిగా బుగ్గ గిల్లితే భక్తులు, ఇలా కసిరి, గిల్లే సాయి మాకొద్దు, మమ్మల్ని లాలించి, పాలించి, బుజ్జగించే సాయి కావాలి అని కోరుకున్నారా అనిపించే రీతిలో, శిరిడీసాయి తన తరువాతి అవతారమైన సత్యసాయి రూపంలో అందరినీ, తన చిరునవ్వుతో, అవ్యాజ్యమైన ప్రేమానురాగాలతో, ‘బంగారూ’, ‘బంగారూఅంటూ ఆకట్టుకుని, తమ తమ హృదయాలలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. భక్తులను నిత్యమూ పరీక్షలకు గురి చేసినా, వాళ్లు ఆయా పరీక్షల్లో నెగ్గేలా చూడడం కూడా సాయి వంతే అయ్యింది. ప్రేమ స్వరూపులారా! ఆత్మ స్వరూపులారా! అని భక్తులనుద్దేశించి, వారేం చేయాలో ఏం చేయకూడదో, నిత్యమూ వారిని కనిపెట్టుకుంటూ తప్పుదోవలో పోకుండా, సన్మార్గ వర్తనులుగా చూసుకునే బాధ్యతను తనపై వేసుకున్నాడు.
మిగిలిన ఆధ్యాత్మిక క్షేత్రాలతో పోలిస్తే పుట్టపర్తికీ ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ప్రపంచ నలుమూలలనుంచీ భక్తులు, వివిధ సంప్రదాయాలకూ, మతాలకూ చెందిన వారైనా హిందూ మతానికి చెందిన ముఖ్య పండగలే కాకుండా, క్రిస్‌మస్ లాంటి వేడుకలనీ జరుపుకోవడానికి పుట్టపర్తిలో చేరుతారు. సాయి సన్నిధిలో ఒక ప్రత్యేక అనుభూతిని పొందుతారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించే ఈ వేడుకలు సాయి భక్తులకు కనువిందచేస్తాయి. సాయి ఆశీస్సులనందిస్తాయి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అదే పుట్టపర్తిలోనూ జరిగేది. సాయి ఆజ్ఞ లేనిదే ఎవరూ ఏమీ చేయలేరు. సాయి సంకల్పమే అన్నిటా. సాయి దివ్య శక్తే అందరిలోనూ!
అసలు దైవమంటే ఎవరు? అదృశ్య రూపంలో ఉండి అద్భుతాలు సృష్టించేనవాడు. ప్రేమపూర్ణమైన ప్రతి హృదయ స్పందనకు మూలం దైవం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, ఇవే దైవానికి ప్రతిరూపాలు!
నీలో ఉండేదీ, నాలో ఉండేదీ ఆ దైవమే! ఆ విషయం తెలుసుకో! అన్నారు సాయి!
ఆధ్యాత్మిక వేత్త అంటే ఎవరు? స్వార్ధ కాంక్షలు లేకుండా, పవిత్ర భావంతో సర్వలోక శ్రేయస్సుకే నిరంతరం పాటుపడేదే దైవం.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మోసెస్, జీసస్ క్రీస్తు, మహ్మదు ప్రవక్త వీరంతా ఎందుకు దైవాలైనారు? మానవ జన్మ ఎత్తి ఉత్తమమైన మానవ జీవితం ఎలా ఉండాలో చెప్పడమే కాదు తాము చెప్పింది ఆచరించి చూపారు కనుక. అందరికీ ఆదర్శంగా నిలిచారుగనక! ఆ దైవ అవతార పరంపరలోని శిరిడీ సాయియే సత్యసాయిగా అవతరించాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ-ఇవే ముక్తి మార్గాలుగా చాటిచెబుతూ సమత, మమత కలవోతయైన మానవతా మూర్తిగా నిలిచి మనుషుల్లో దేవుడై నిలిచాడు. ్భగవాన్అని అందరిచేత పూజింపబడుతూ ఉన్నాడు. ఆ దైవ స్వరూపమే సత్యసాయి బాబా! శిరిడీలాంటి చిన్న వాడయే పుట్టపర్తి! ఆ పుట్టపర్తినే వైకుంఠ క్షేత్రంగా మార్చి తన అవతారాన్ని భూమిపై నిలిపి విశ్వమంతా తన లీలలు చూపుతూ బ్రహ్మ, విష్ణు, శివాత్మకమై ఆర్తులందరినీ కాపాడుతున్నాడు.
ఒకవైపు తన బోధనలతో మానవులందరినీ (వారెవరైనా సరే, దుర్మార్గులైనా, దురాత్ములైనా అజ్ఞానులైనా) సన్మార్గానికి దారి చూపి నడిపించుతూ ఆర్తులకు అండగా నిలిచాడు. ప్రభుత్వాలు చేయలేని పనులెన్నింటినో ఒంటి చేత్తో చేసాడు. 60 ఏళ్లు దాటినా గ్రామాల్లో నీళ్లు, విద్య, గూడు అందనివారికి వాటిని అందించాడు. పుట్టపర్తిలో కూచుని ఆయన సంకల్పిస్తే, ఆయన చేపట్టిన పనులన్నీ ఇట్టే పూర్తయిపోయేది. సత్యసంకల్పంఅలాటిదన్నమాట! ఆయన 1968లో మాత్రమే ఒక్కసారి విదేశీయానం చేశారు. మద్రాసు, బొంబాయి, బెంగుళూరు తప్ప అంతకు ముందు బదరీ, కేదార్ లాటి చోట్లకు తప్ప తిరిగి ఎరగడు. అలుపెరుగని ఆధ్యాత్మిక శక్తి శ్రీ సత్యసాయి. ఆయన దివ్య లీలలు విశ్వవ్యాప్తం.
హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్-సదా సాయం చేయి, ఎవరినీ నొప్పించకు, యూ లుక్ ఎట్ మీ-ఐ లుక్ ఎట్ యూ-నీవు నన్ను చూస్తే, నేను నిన్ను చూస్తా! ఇలా సాయి సందేశాలెంతో సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉండేవి. ప్రేమ తత్వమే వారి జీవిత సందేశం. విశ్వశాంతియే పరమార్ధం. లోకాస్సమస్తాఃసుఖినోభవంతుఅంటుండేవారు సాయిబాబా! కానీ, ఎందుకో సమస్త లోకాస్సుఖినోభవంతుఅని చెప్పాలని స్వామి ఆదేశించారామధ్య. ్భజన బినా సుఖశాంతి నహీ!అని చెప్పకనే చెప్పారు సాయి. ఈ కలియుగంలో దైవనామస్మరణతప్ప వేరే ఏదీ మనకు శాంతినివ్వదు. ఇదే స్వామి చెప్పినది. అందుకే సదా ్భజనమాత్రం తప్పక చేయాలి. అదీ సామూహికంగా చేయాలని స్వామి బోధించారు.
నేటి యాంత్రిక జీవనంలో ఎనె్నన్నో సమస్యలు. గుక్కెడు నీళ్లు లేవు అని అనగానే ఇరుగు పొరుగు పల్లెలకు, నగరాలకే కాదు, రాష్ట్రాలకు సైతం-ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో నీరు అందించిన పరమ శివుడాయన. దేశ, మానవ ప్రగతికి అవరోధంగా నిలిచిన నిరక్షరాస్యతను రూపుమాపడానికి ప్రాధమిక స్థాయినుంచి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి దాకా ఉచిత విద్యను అందించే విద్యా సంస్థలను ఏర్పాటు చేశారాయన. మనకు ముఖ్యమైన మరో అంశం ఆరోగ్యం. జనాలు అనారోగ్యం బారినపడి, తీవ్రమైన బాధలు పడుతూ సకాలంలో సరైన చికిత్స అందక అల్లాడిపోతున్న సమయంలో శ్రీ సాయి, వైద్య సేవలను ప్రతివారికీ అందుబాటులో ఉండేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పారు. ధనికుడనీ, పేదవాడనీ తేడా లేకుండా అందరికీ వైద్యం అందించడంలో సాయినాధుడు వైద్యనాధులైనాడు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సాయిసేవా దళాలు తమ సేవా హస్తాన్ని అందిస్తున్నాయి.
సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీ సత్యనారాయణరాజు, సత్యసాయిగా శిరిడీసాయి తరువాతి అవతారంగా 1940లో ప్రకటించినప్పుడు ఎవరూ నమ్మకపోయి ఉండవచ్చు. నాటి చిత్రావతీ నదీ తీరాన ఉండే గొల్లపల్లి-నేడు పుట్టపర్తిగా మారి ప్రపంచపటంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అవుతుందని ఎవరూ ఊహించకపోయి ఉండవచ్చు. 1945లో ప్రశాంతి నిలయం ఏర్పడింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా శ్రీ సాయి చేసిన అద్ధుతాలెన్నో! మానస భజరే గురుచరణం!అంటూ గురువును ఎలా సేవించాలో చాటి చెప్పారు.
ప్రజలలో నైతిక విలవలు పెంపొందించడానికి తన బోధనల ద్వారా అహర్నిశలు శ్రీ సాయి కృషి చేశారు. తమ విద్యా సంస్థల ద్వారా అత్యుత్తమ పౌరులు రూపుదిద్దుకోవాలన్నదే సాయి ఆకాంక్ష!
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస-ఇవే మన జీవితాశయం కావాలని చెప్పారాయన. ఈ ఆశయ సాధనే సాయి ప్రేమావతార తత్వం. అందుకే సాయిబాబా విశ్వసాయిగా వెలుగొందుతున్నాడు. ఈ (అ)నాగరిక యుగంలో ప్రేమతత్వం పెంపొందాలి. ఇదే సర్వమత సారం అని సాయిబాబా ఎన్నోసార్లు చెప్పారు. వ్యక్తిత్వం లేని విద్య, ఉప్పులేని వంటకం లాంటిదే. మానవత్వాన్ని పెంచేదే మతం కాబట్టి ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోండి. ఎదుటివారిని, తోటివారిని ప్రేమించండి ఎప్పుడూ నొప్పించకండి.ఇతరులను గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీదేదో నీ దగ్గరుంది. వారిదేదో వారి దగ్గరుంది. వీలైనంతసేపు భగవన్మామస్మరణలో ఉండండి. ఆపదలో ఉండేవారిని ఆదుకోండి. సాయం చేయగలిగితే చేయండి. చేయలేకపోతే ఆ విషయానే్న సౌమ్యంగా చెప్పండి!-ఇదే సాయి తత్వం. అందుకే ఆయనను ఎవరు విమర్శించినా కూడా పల్లెత్తు మాట అనలేదు. పరిపూర్ణ ఆత్మజ్ఞానం కలగాలంటే ఇదే మార్గం అని చెప్పకనే చెప్పారాయన. సాయిమార్గమే ముక్తికి మార్గం! తన అవతార సమాప్తి గావించినా శ్రీ సాయి భక్తుల హృదయాల్లోనే వాసం చేస్తాడు. నన్ను సదా ఎవరైతే స్మరిస్తారో, వారి హృదయాల్లో నే నివసిస్తానని దేవదేవుడు నారదునితో చెప్పిందిదే!
మానస భజరే గురుచరణం! దుస్తర భవ సాగర తరణం!

*****

నిన్ను నీవు శోధించుకో! ఆపైన నీ ఇష్ట దైవాన్ని ఆరాధించుఅన్నదే సాయి సందేశం! సాయి దివ్య సందేశాల్లో మచ్చుకు కొన్ని
*
అందరినీ సేవించు. కానీ ఎవరినుంచీ ఏమీ ఆశించకు! నీ మాటల్ని, కదలికల్ని,
ఆలోచనలనీ, ప్రవర్తననీ, హృదయాన్నీ గమనించి ప్రవర్తించు!
*
నీ నాలిక నీ వశంలో ఉంటే లోకమే నీ వశంలో ఉంటుంది
*
డబ్బు వస్తుంది, పోతుంది కానీ నైతికత మనస్సులో చోటుచేసుకుంటే
అంతకంతకూ పెరిగిపోతుంటుంది.
*
ధ్యానం కన్నా సేవ గొప్పది. సుఖం కన్నా త్యాగం గొప్పది!
*
విమర్శించడం, పొరపాట్లు చేయడం అహంనుంచి వస్తాయి.
*
నిజాయితీగా ఉండు. ఇతరులకు తోడ్పడు!
*
ప్రపంచ సంక్షేమం కోసం ప్రార్ధించడమే నీ విధి. దానికోసం
నీవు చేయాల్సింది చేయి.
*
ప్రేమ పంచు, ప్రేమను ఆస్వాదించు
*
నిత్య జీవితంలో విధులు ముగించు, విరామ సమయంలో సంఘసేవ చేయి.
నీకు శాంతి కలుగుతుంది.
*
ప్రార్ధించే పెదవులకన్నా, ఉపకారం చేసే చేతులు మిన్న.
* ‘‘
జ్ఞానానికి పరాకాష్ట ఉత్కృష్ట బుద్ధి కుశలత
సంస్కృతి అంతిమలక్ష్యం పరిపూర్ణత
విద్య పరమ ధ్యేయం సచ్ఛీలత’’
ఇలాంటి ఆణిముత్యాలెనె్నన్నో వారు నిత్యమూ బోధించేవారు. అంతేకాదు సిద్ధాంతాలు లేని రాజకీయాలు, మానవత పట్టని శాస్ర్తియత, శీలాన్ని బోధించని విద్య, నీతిలేని వాణిజ్యం-ఇవన్నీ నిరుపయోగం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైనవని సత్యసాయి బోధించేవారు.
శ్రీసాయి ఒక అంతర్లీనమైన దివ్యశక్తి. ఆయన కేవలం ఒక భౌతికంగా కనిపించే దేహం కాదు. ఆయన విశ్వరక్షకుడు. అతడే పరబ్రహ్మం. అతడే లోక నాయకుడు. అనైతికతనుంచి నైతికత వైపూ, నైతికతనుంచి ఆధ్యాత్మికత వైపూ మనలను నడిపించే చుక్కాని శ్రీ సత్యసాయి. ప్రపంచంలో మానవాళి మనుగడ సాగడానికి ప్రాతిపదిక భగవంతునిపై మానవుడికి ఉండే అచంచలమైన విశ్వాసమే! మతాలు వేరైనా దేవుడొక్కడే. ప్రజలు ఎంచుకునే రూపాలూ, మార్గాలూ వేర్వేరు కావచ్చు. కానీ అందరి లక్ష్యమూ ఒక్కటే. అదే దైవ సాన్నిధ్యం. అది అందరికీ తెలియజేయడానికే సాయి తన బోధనల ద్వారా చెబుతూ ఆచరించి దైవమైనాడు!

======

No comments:

Post a Comment