Saturday, August 27, 2011

హ్యాకింగ్ అంత ఈజీ కాదు

సాయి అయితిక
Andhrabhoomi daily
April 20th, 2011

 
నేడు అంతా ఆన్‌లైన్. చిటికెలో సమాచారాన్ని వెలిదీయాలన్నా, చిటికెలో సందేశం పంపాలన్నా, టికెట్ కొనాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ఆఖరికి మోసపోవాలన్నా కూడా? ‘ఇంట్లో ఇంటర్నెట్టూ, అరచేతిలో మొబైలు పట్టూఅనుకోవడం ఓకె! కానీ! ఏమరుపాటులో మనకు తెలీకుండా మన జేబుకు చిల్లు పడటం గ్యారంటీ! ఎందుకంటే అంటే ఎనీ టైమ్ మనీఅనీ ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్అనీ వ్యవహారంలో ఉన్నా -నేడు పేట్రేగిపోతున్న దోపిడీలూ, మోసాలూ, ‘ఎనిబడీ కెన్ టేక్ యువర్ మనీఅనే కొత్త అర్థం వస్తోంది. మన వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. వెబ్ ప్రపంచంలో ఏది రైటు, ఏది రాంగూ! ఓ మహాత్మా!అనుకోక తప్పదు. వెబ్అంటేనే గుండె లబ్మంటోంది. మనకు తెలీకుండా, మన వ్యక్తిగత సమాచారాన్నీ, మన ఖాతాలోని ధనాన్నీ దొంగలించడం -హ్యాకింగ్‌కు మరింత ఊతాన్నిస్తున్నాయి. నిత్యం ప్రతివారి జీవితంలో ఇదొక జఠిల సమస్యగా మారింది. టెక్నాలజీ మన జీవితాలను ఎంతో ప్రభావితం చేసింది, చేస్తోంది కూడా. కానీ అవి మన జీవితాలతో ఆడుకుంటోంది. కాస్త ఏమరుపాటుగా ఉన్నామా, మనలను మోసం చేసేస్తుంది. అయతే ఆన్‌లైన్ పనులు, హ్యాకింగ్ వీటి గురించి జనాలకు కొన్ని అపోహలున్నాయి. వాటిపై సరైన అవగాహన కలిగించేందుకే ఈ వ్యాసం.

అపోహ-1:
హ్యాకింగ్ అందరూ చేసేయగలరు!:
చాలా హాలీవుడ్ చిత్రాల్లో మనం ఒక సన్నివేశం చూస్తుంటాం. కేవలం ఒక్క వౌస్ క్లిక్‌తో అదేదో దేశపు బ్యాంకింగ్ వ్యవస్థనే కుప్పకూలిపోయేలా చేసేస్తారు విలన్లు. అది అబద్ధం కాదు. అలాగని అసాధ్యమూ కాదు. కానీ సిన్మాలో వాళ్ళు చూపించినంత ఈజీ మాత్రం అస్సలు కాదు. కంప్యూటర్లనీ, కంప్యూటర్ నెట్ వర్క్‌లను మరీ ఇట్టే చేసేలా వారు చూపేంత దారుణంగా మాత్రం కాదు. అదంత ఈజీ కాదు. ఇంటర్నెట్‌లో హ్యాకింగ్ చేయడానికి ఎనె్నన్నో సాఫ్ట్‌వేర్‌లు లభిస్తున్నాయి. వాటిని వాడేసి నెట్‌వర్క్‌లోకి జొరబడి హ్యాకింగ్ చేసేయడం సులభం అనుకుంటే -తప్పులో కాలేసినట్టే. ఒక సిస్టమ్‌ను హ్యాక్ చేయాలీ అంటే విండోస్ యునిక్స్, లినిక్స్ ఇలా పలు ఆపరేటింగ్ సిస్టమ్‌ల గురించి కూలంకషంగా తెలియాలి. నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది, వాటి సిద్ధాంతాల గురించి తెలియాలి. అంతేకాదు క్రిమినల్మైండ్ వాటికి తోడైతేనే హ్యాకింగ్ సాధ్యం. పైగా ఒక సిస్టమ్‌లోకి జొరబడాలీ అంటే కొన్ని వందల గంటల సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఎంతో అనుభవం ఉంటేనే సాధ్యం అవుతుంది. ఏదోఒక సాఫ్ట్‌వేర్‌ను వాడి హేక్ బటన్‌మీద క్లిక్ మన్నంత మాత్రాన నెట్‌వర్క్ గానీ, సిస్టమ్ గానీ హ్యాకింగ్ జరగదు.

అపోహ-2:
మా సైటు ఫూల్‌ఫ్రూఫ్
ఇలాగని ఎవరైనా అంటే.. దాన్ని మీరు నమ్మితే.. మళ్లీ తప్పులో కాలేసినంత మాటే! ఇప్పటిదాకా నెట్‌వర్క్ గానీ, దానిలో వాడే సాఫ్ట్‌వేర్ గానీ, సిస్టమ్స్ గానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ గానీ -దేనికీ నూరుశాతం రక్షణ లేదు. సాధ్యమైనంత ఎక్కువ రక్షణనివ్వడానికి అందరూ కృషి చేస్తున్నారంతే. తగిన సమయమూ, సాఫ్ట్‌వేర్‌లూ దొరికితే దేన్నైనా హ్యాకింగ్ చేయవచ్చు. అంతెందుకు? ఇళ్ళకు, ఆఫీసులకు వేసే తాళాలు పూర్తిగా రక్షణ నిస్తున్నాయా? లేదే! ఇక వెబ్‌సైట్లకెక్కడుంటాయి. ఆ మధ్య అమెరికా పెంటగన్, సిఐఎ, నాసాలకు సంబంధించిన కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు వార్తలొచ్చాయి కదా! ఇక మనబోటి సామాన్యుల సంగతి చెప్పేదేముంది? ఎందుకంటారా? మన జీవితంలో నిత్యమూ వాడే మన కార్డ్, క్రెడిట్ కార్డ్, ఐప్యాడ్, ఎక్స్‌బాక్స్, వైఫీనెట్ వర్క్, జిపిఎస్ నేవిగేషన్, బ్లూటూత్‌తో పనే్జసే ఉపరణాలు, ఫేస్‌బుక్ ఎక్కౌంట్, బ్యాంకు మెయిలు తాలూకు ఎకౌంట్లూ -ఏవీ సురక్షితం కాదు. అన్నీ హ్యాకింగ్ కి గురి కావచ్చు.

అపోహ-3:
అంతా కూల్అనుకోండి!
హ్యాకింగ్ అంటే చాలా ఈజీ అనీ, ఆ రంగంలో బాగా డబ్బులు సంపాదించుకోవచ్చనీ కొందరు యువకులు అనుకుంటుంటారు. ఎథికల్ హ్యాకింగ్రంగం ఈమధ్య ఆ రకం గ్లామర్‌నీ, ఉత్సుకతనీ కల్గిస్తోంది. కానీ పైన చెప్పుకొన్నట్లు, ఎన్నో వందల గంటల సమయం వెచ్చించాలి. నెట్‌వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్‌ల గురించి బాగా కూలంకషంగా తెలుసుకోవాలి. అన్నీ ట్రయిల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో నడుస్తాయి. ఎంతో డబ్బూ, సమయమూ వెచ్చించాల్సిందే, తప్పదు. కంప్యూటర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా పనే్జయాలంటే ఎంతో వ్యవహార దక్షత కావాలి. అన్నింటి గురించిన పరిజ్ఞానం, అవగాహన, సమయస్ఫూర్తి కావాలి. ఎంతో బాధ్యత కల్గిన ఉద్యోగరంగం అది. సైబర్ ఎటాక్ ఎప్పుడైనా జరగొచ్చు. కాబట్టి 247365 ఆన్ డిమాండ్ పని చేయగల్గితేనే ఈ రంగంలో ఉద్యోగాలకు రాణింపు ఉంటుంది.

అపోహ-4:
నాకంతా తెలుసు
నాకు కంప్యూటర్ రంగంలో, సెక్యూరిటీ విషయంగా, ‘సర్వంబొచ్చుఅనుకొంటే సర్వమూ బొచ్చే! ఏదీ సమగ్రంగా తెలుసుకోలేం. రోజురోజూ టెక్నాలజీ మారుతోంది. ఈ రోజుండే టెక్నాలజీ రేపు లేదు. అందువల్ల సదా అప్‌డేట్ అవుతూనే ఉండాలి. ఇదొక నిత్య నూతన విద్యారంగం. సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ఎంచుకొనేవారు దీన్ని గమనించాలి. దానిపై పరిశోధనారంగంలో నిష్ణాతులవడానికి యువత ప్రయత్నించడం మంచిది. చెడు కోసం కాకమంచి కోసం మాత్రమే టెక్నాలజీ వాడాలి అనేదాన్ని గుర్తించడమేకాక, ‘చెడుసోకకుండా ఎలా చూడాలో తెల్సుకొని అమలులోకి తేవాలి.

అపోహ-5:
పట్టుకోండి చూద్దాం!
ఒక సైబర్ ఎటాక్ జరిగినప్పుడు పోలీస్‌శాఖ వెంటనే రంగంలోకి దిగి దుండగుల ఆట కట్టించాలని అంతా అనుకోవడం, ఆశించడం సహజమే! అయతే పోలీస్ శాఖలో సైబర్ నేరస్థులను గుర్తించడంలో, పట్టుకోవడంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కోవల్సి వస్తుంది. కారణం ఇంటర్నెట్‌కు పరిధులు లేవు. కానీ పోలీసుల నేరపరిశోధనకు ఉన్నాయి. ఎందుకంటే రష్యా లేదా చైనా దేశంలో హ్యాకర్ మరో దేశానికి చెందిన వెబ్‌పర్సన్‌ను హ్యాక్ చేయవచ్చు సులభంగా. అలాంటి వ్యక్తిని గుర్తించడమూ కష్టమే. నేరం చేసేవాడు, తన సిస్టమ్ నుంచి మరో దేశం సిస్టంలోకెళ్లి అక్కడ్నుంచి హ్యాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తాడే తప్ప తన కంప్యూటర్‌ను గుర్తుపట్టేలా చేయడు. ఒకవేళ ఆ నేరస్థుని గుర్తించినా, పట్టుకోవడానికి ఎన్నో అవస్థలూ పడాలి పోలీసుశాఖ. నిజంగా వారికిది చాలా సంక్లిష్టమైన సమస్య.

అపోహ-6:
నా రక్షణ అక్కర్లేదు
ఇంటర్నెట్ వాడే కొందరు -నా కన్నీ తెలుసు! అందుకే నేను నా సిస్టమ్ మీద కీలకమైన సమాచారాన్ని ఉంచడం లేదు. కాబట్టి సైబర్ నేరస్థుల గురించి నేను పట్టించుకోనక్కర్లే!అనుకొంటుంటారు. అది తప్పు. మీ సిస్టమ్‌లో సమాచారం లేదు సరే, మీ సిస్టమ్‌ను వాడి మరో సిస్టమ్‌ను పాడు చేయవచ్చుగా! అది కూడా ఆలోచించాలి మనం. అందువల్ల మీ కంప్యూటర్‌లో కీలకమైన సమాచారం లేకున్నా సరే దాన్ని సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మీకు న్యాయపరమైన సమస్యలు రాకుండా చేసుకొన్నవారవుతారు.

**

No comments:

Post a Comment