Tuesday, October 26, 2021

అనుకున్న విధంగా బ్లాగ్ ను తాజా చేయాలనుకొన్నాను. కానీ  ఎడమకంటి కి ఇన్ ఫెక్షన్ సోకడంతో వారం, పది రోజులుగా ఏమీ చేయలేకపోయాను. అపుడెపుడో నేను సైన్సు ఎందుకు రాస్తున్నాను అని ఒక వ్యాసం రాశాను. దానిని ఈ మధ్యే ఒక దిన పత్రికలో ప్రచురించారు కూడా. పూర్తి వ్యాసం మీ కోసం...

నేను చదివిన రచనలే నన్ను సైన్సు రచనలు చేయడానికి పురిగొల్పాయి

-డా. వి.వి. వేంకటరమణ  9441234429

 

నేను పుట్టిందీ పెరిగిందీ తిరుపతిలో. మానాన్నగారు స్వర్గీయ శ్రీ వి.ఎస్‌. వేంకటనారాయణ. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు.   అనేక కారణాలవల్ల నేను ఎంఎస్సీ చేసి సాఫ్ట్‌ వేర్‌ రంగంలో స్థిరపడాల్సి వచ్చింది. మా  రోజుల్లో మేం చదివిన మునిసిపల్‌ స్కూళ్లలో సైతం జీవ, భౌతిక, రసాయనశాస్త్ర పరిశోధనాలయాలంటూ ఉండేవి. పాఠం చెప్పేటపుడు పలురకాల నమూనాలను ప్రదర్శించేవారు.  పాఠశాల గ్రంథాలయంలో   తెలుగు భాషకు సంబంధించి, నీతిని బోధించే కథలతో, విజ్ఞానదాయకమైన కథలతో, ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రణతో - ఇలా పలురకాల పుస్తకాలు ఉండేవి. ప్రతివారం అందరికీ గ్రంథాలయంలో ఒక పీరియడ్‌ గడిపే అవకాశం ఉండేది.    


1976 ప్రాంతాల్లో  ఉక్కుపిడి మాయావి, సర్ప ద్వీపం వంటి పుస్తకాలు వచ్చాయి. అందులో హీరో క్లిష్టమైన పరిస్థితుల్లో మాయమైపోతాడు. అతని ఉక్కు చెయ్యి మాత్రం కనిపిస్తుంది. సరదాగా ఉండేది. అది ఫిక్షనని తెలుసు. కానీ, అది అసాధ్యం కాదేమోనని కూడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంది.  

 

1978లో  బిఎస్సీలో చేరడం, అందులో భౌతిక, రసాయన శాస్త్రాలను చదవడం, తరచూ ప్రాక్టికల్స్‌ చేయడంతో కొంత సైన్స్‌ పట్ల అవగాహన వచ్చింది. అప్పట్లో,   శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్ర విభాగాలు ఎంతో చురుగ్గా పనిచేసేవి. ఆయా విభాగాల వారు   ఏడాదికొకసారో, రెండేళ్లకొకసారో సైన్సు ప్రదర్శనలు జరిపేవారు.  ఎమ్మెస్సీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు పోటీపడి రకరకాల నమూనాలను రూపొందించి ప్రదర్శించేవారు.   నీటితో కాగితంపై రాసిన అక్షరాలను దీపకాంతిలో చూపడం, విబూది రాల్బడం, నిప్పులేకుండా పొగను తెప్పించడం - ఇలాంటి గమ్మత్తులెన్నో    స్వయంగా లాబొరెటరీలలో చేయడం  చూశాను. వాటి వెనకాల ఉండే రహస్యాలేంటి, వాటిని గురించి చెప్పమని అడిగినపుడు మా రెండో అన్న, వారి  మాకేమీ చెప్పకుండా దాటేసేవారు.       

 

1981లో ఆపరేషన్స్‌ రిసెర్చి రంగంలో కర్నూలు పీజీసెంటరులో ఎంఎస్సీ  చేసి, తిరుపతిలో ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంఫిల్‌ చేశాను.   ఎంటెక్‌ విద్యార్థులకు సంవత్సరం పాటు బోధించాను. ఎంఫిల్‌ పూర్తి చేశాను.  ఇంతలో ఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థయిన నేషనల్‌ ఇన్ఫార్మటిక్స్‌ సెంటర్‌లో కంప్యూటర్‌ రంగంలో ఉద్యోగావకాశం వచ్చింది. చేరిపోయాను.  ఆ తర్వాత 1998 నాటికి పిహెచ్‌ డి పూర్తి చేశాను. ఢిల్లీలో ఉండినపుడు, నేను ఖాళీ దొరికినపుడెల్లా, పలు సైన్సు సంబంధమైన కార్యక్రమాలు హాజరయ్యాను. పలు పరిశోధనాలయాలు చూశాను. మ్యూజియంలు చూశాను. ఐఐటికి వెళ్లే వాడిని కూడా. ఐఐటిలో చదివేవారు ఎందుకు ఇండియాలో ఉండటం లేదనే ఆలోచన నా బుర్రలో అలాగే తొలుస్తూ ఉండేది. మా అన్నతోటి మిత్రులతో కలిగిన పరిచయం కూడా నాకు బాగా వినియోగించింది. వారు చేస్తున్న పరిశోధనలను స్వయంగా చూశాక, అవకాశం ఇస్తే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మన మేధస్సుకెంతో అవకాశం ఉంది.  భారతదేశంలో విజ్ఞానశాస్త్ర రంగంలో జరుగుతున్న విశేషాలను అందరికీ తెలియజేయాలనిపించేది. మెయిన్ ఫ్రేం కంప్యూటర్లనుంచి, నేటి పామ్ టాప్ కంప్యూటర్ల దాకా సాంకేతికాభివృద్ధిని స్వయంగా చూశాను.  అటు రచయితల కుటుంబ నేపథ్యం, ఇటు విజ్ఞానరంగం పరిచయం, అనుభవం -- ఈ రెండూ సైన్సు రచనలు చేయడానికి నాకు సహజంగా అబ్బినాయి. 1998 దాకా అవకాశాలు రాలేదు.

 

ఢిల్లీలో మహీధర నళినీమోహనరావుగారిని ఎన్నోసార్లు కలిశాను.  సైన్సు వ్యాసాలు రాయడంలో నాకు ఎన్నో విషయాలు చెప్పేవారయన.   మా కార్యాలయంలోని గ్రంథాలయంలో కూడా సైన్సు పత్రికలూ, పుస్తకాలూ చాలా ఉండేవి. వాటితో రోజు కనీసం ఒక గంట గడిపేవాడిని.   నిజానికి ఢిల్లీనుంచి హైదరాబాదుకు వచ్చినపుడు రచనలపై నాకంత ఆసక్తి లేదు. కానీ, నాకు సైన్సెనా, సాంఘికమైనా సూటిగా, సులభంగా ఎవరూ చెప్పట్లేదేంటనే వేదన ఉండేది. అందరికీసులభంగా అర్ధమయ్యేలా సైన్సు కబుర్లు ఎవరూ ఎదుకు రాయట్లేదూ అని అనుకుంటూ ఉండే  నాకు 1998లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో  రాసే  చక్కని అవకాశం వచ్చింది. 1998-99లో రెండేళ్ల కాలంపాటు రాసి, విజయవంతంగా  నేనూ సైన్సు రచయితనే అనిపించింది నా కంప్యూటర్‌ క్లాస్‌ శీర్షిక వ్యాసాలు. దానికి తోడుగా నాకు కార్టూనిస్ట్‌ గా సహజంగా ఉన్న హాస్య గుణం తోడవడంతో వారంవారం కంప్యూటర్‌ పూర్వాపరాలూ, ప్రాథమిక విజ్ఞానంపై అవగాహనా కల్పిస్తూ చాలా సరదాగా రూపొందింది. ప్రతి వారం ఒక వ్యాసం, ఒక జోకు, ఒక కార్టూన్‌, ఒక సామెత, ఒక తాజా వార్త -- అన్నీ కంప్యూటర్‌ సైన్సు పరమైనవే అందించాను. అదే సమయంలో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ఎడిటరు ప్రోత్సాహంతో సైన్స్‌ పరమైన ప్రత్యేక కథనాలు, సైన్స్‌ క్లబ్‌ అనే శీర్షికన ఏడాదిపైనే వివిధ సైన్సు వ్యాసాలూ అందించాను.  1999 ప్రాంతాల్లో, నాకు శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్‌, శ్రీ బి.మల్లిక్‌, శ్రీపాండయ్య గారలు  కంప్యూటర్‌ అక్షరాస్యతా కేంద్రం అనే దాన్ని ప్రారంభించినపుడు వారు ప్రోత్సాహించగా, నేను ట్రైనర్స్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చాను. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టంలతో పనిచేయడం గురించి నోట్సు కూడా తెలుగులో రాసి ఇచ్చాను.   అలా వారితో కలిగిన పరిచయం, నాతో తెలుగు అకాడమీకి 5 పుస్తకాలను రాయించింది. అన్నీ కంప్యూటర్‌ సైన్సు సంబంధించినవే.  ఆ తర్వాత కంప్యూటర్‌ శాస్త్ర నిఘంటువును ఒంటికాలిమీద నిలబడి పూర్తి చేశాను.

 

ఆ సమయంలో ఆంధ్రప్రభ ప్రత్యేక సంపుటాలు తెచ్చింది. వాటికోసం ఐటి ఉద్యోగాలు, ఇంటర్నెట్‌ వాడటానికి మార్గాలు - ఇలా రకరకాల వ్యాసాలు రాసి ఇచ్చాను. ఒక ఏడాది పాటు విండోస్‌ ఎలా వాడుకోవచ్చో, ఆదివారం అనుబంధంలో రాశాను.   రెండేళ్లపాటు నాకు వారంవారం ఒక పేజీ అరచేతిలో ఐటీ ప్రపంచాన్ని చూపించేలా కంప్యూటర్‌ వ్యాసాలు రాశాను.  2003లో కంప్యూటర్‌ విజ్ఞానం అనే మాసపత్రికలో  వివిధ కంప్యూటర్‌ అంశాలపైకవర్‌ స్టోరీలను  అందిస్తూ,  మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాల పాటు వారికి రాశాను.   తరవాత ఆంధ్రభూమి డైలీలో యువ  టాబ్లాయిడ్‌ లో రెండేళ్లు నేను ఐటి పేజీ నిర్వహించాను. ఎన్నో సైన్సు అంశాలపై కవర్‌ స్టోరీలనూ రాశాను.   పెద్దల కోసం నేను రాసిన కంప్యూటర్‌ కబుర్లు కూడా బాగా పాపులరైంది.

 

ఈ రచనా వ్యాసాంగంతో పాటు నేను ఆకాశవాణిలో కంప్యూటర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సైన్స్ అంశాలకు సంబంధించి అనేక ప్రసంగాలు చేశాను. అప్పటికే కొన్ని వందల సైన్సు వ్యాసాలు రాయడం వల్ల, నాకంటూ ఒక ప్రత్యేక పద్ధతిని ఏర్పర్చుకున్నాను. 2001ప్రాంతాల్లో  స్మార్ట్‌హోం అనే నా ప్రసంగం ఎన్నోసార్లు   ప్రసారమైంది.   


2007లో ఒక రోజు ఆకాశవాణికి  2 సైన్సు రూపకాలను రాయాలని కబురందింది. ముఖ్యంగా చంద్రుడిమీద జరిగినన్ని ప్రయోగాలు వేరే ఏ గ్రహం మీద జరగలేదు. కమ్యూనికేషన్స్‌ రంగంలో విప్లవాత్మకమార్చులు వచ్చాయి. సైన్సు ఎలాంటి విజయాలను సాధించిందో తెలపడం కూడా ముఖ్యం. అలాగే, అంతరిక్షయాత్రలు ఎన్నో జరిగాయి.  భారతదేశం కూడా ఏమాత్రం తీసిపోని విధంగా వైజ్ఞానిక జైత్రయాత్రలు చేసింది. వీటన్నిటినీ చేయాలంటే 2 రూపకాలు కాదు. కనీసం 5,6 రూపకాలు అవుతాయి అంటూ చెప్పేసరికి అంగీకరించి ౩౦ నిమిషాలనిడివి గల 5 రూపకాలు చేయమని చెప్పారు.  ఐఐటి బ్రెయిన్‌ డ్రైన్‌ లాంటి అంశాలనీ వాటిలో జొప్పించాను. విదేశాలనుంచి ఇండియాకు వచ్చిన పరిశోధక విద్యార్థి పాత్రను ఒక రూపకంలో పెట్టాను.  ఈ రూపకాలు రాయడంలో   దాదాపు మూడునెలలపాటు విషయసేకరణపైనే దృష్టి పెట్టాను. ఎందరెందరో శాస్త్రవేత్తలతో, ఇంజనీర్లతో మాట్లాడాను.  ఎందుకంటే,  సమాచారం పోగేయడం ఒక ఎత్తు దానిని చదివి అర్థం చేసుకోవడం మరో ఎత్తు. అందుకే, సైన్సు రాసే రచయితలకి చాలా ఓపిక కావాలి. ఆమూలాగ్రం చదివి, ఎంత వరకు పాఠకులకు, శ్రోతలకు అర్ధమవుతుందో అంత మటుకే ఇవ్వాలి. అలాగే, మనం రాసే మాధ్యమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  

 

సైన్సు రచనలు చేయగలిగినవాడు ఏ రకమైన రచనలైనా చేయగలడనేది కొందరికే తెలుసు. అలాగే,  సైన్సు, ఆధ్యాత్మికతనుంచే వచ్చిందని నానమ్మకం. ఎందుకు, ఏమిటి, ఎలా - అని పరిప్రశ్న చేయడం ఆధ్యాత్మికతే నేర్పుతుంది. దానికి రీజనింగ్‌ తో, సరైన ఆధారాలతో సరైన సమాధానాన్ని సైన్సు అందిస్తుంది. అందువల్ల మనం చెప్పదలుచుకుంది క్లుప్తంగానైనా సరే, వివరంగానైనా సరే, సూటిగా చెప్పాలి. జనం కోరేది మనం చెప్పగలగాలి. మనం చెప్పేదే జనం వింటారపుడు. దానికి సరైన భాష వాడాలి. మన వ్యక్తీకరణలో స్పష్టత ఉండాలి. అపుడు పాఠకుడే మన రచనల కోసం ఎదురుచూస్తాడు.

 

ప్రాచీన కాలం నాటికే మన భారత దేశంలో సైన్సు ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలియజెప్పాలని ఉంది. దానికి ముందుగా, మనం నేడు ఆధునికత పేరుతో చూసే సైన్సుకు మూలాలు ఆధ్యాత్మికతలోనే ఉందని తెలుసుకున్నాను. అందుకే ఆధ్యాత్మిక రచనలూ చేస్తున్నాను. ఆధార, ప్రణాళికబద్ధమైన, ప్రామాణికమైన ఆధ్యాత్మికతే సైన్సు. దీనిని మానవాళి సంక్షేమానికే వాడాలి అని మనం అందరూ తెలుసుకోవాలి. అలాగే, మన ప్రాచీనమైన భారతీయ పరిజ్ఞానం, విజ్ఞానం అపారం. వాటిని నేటి కాలానికి అనుగుణంగా చెప్పాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఎందుకంటే, నేడు సైన్సు పేరిట ప్రయోగాలు చేస్తూ ప్రకృతితో మనిషి ఆడుకొంటున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు చేస్తున్నాడు. అందువల్లే ప్రకృతి కూడా మనుషులతో ఆడుకొంటూంది. అందరూ ఇది తెలిసి మసలుకోవాలి. ఏం చేస్తే మానవాళి సంక్షేమంగా ఉంటుందో అందరికీ తెలియజెప్పే రచనలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది.

***


Friday, October 15, 2021

 ముందస్తుగా.....


మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.....


2018 నుంచి మీకు నేను నా నిశ్శబ్ద సంగీతాన్ని వినిపించాను.  కారణాలు ఎన్నో.... కర్ణుడి  మరణానికి కారణాలెన్నో అన్నట్టు....  

2021 జూలై 31 నుంచి నరకాసుర చెర నుంచీ,  నరకసంస్థానపు కాకాసురుల కబంధహస్తాలనించీ విడుదల కావడంతో కొంత ఊరట కలిగింది.

ఎండిపోయిన కళ్లు, ఖాళీ అయిన మెదడు, నిస్సారంగా ఉండే జీవనయానం - ఇవీ నా నిశ్సబ్దాన్ని నియంత్రిస్తున్నాయింకా. ఈ విజయదశమి రోజున కనీసం బ్లాగ్ ను చురుకుగా ఉంచుదామని నిర్ణయం తీసుకొన్నాను,

చూద్దాం మళ్లీ రాయగలనేమో....


Tuesday, March 13, 2018

 శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం

శ్రీ దేవీ ప్రార్థన
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||
అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ |
 
ధ్యానమ్
తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||
ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||
 
లమిత్యాదిపంచ పూజామ్ కుర్యాత్, యథాశక్తి మూలమంత్రమ్ జపేత్ |
లం పృథివీతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః - గంధం పరికల్పయామి  
హం ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః - పుష్పం పరికల్పయామి
యం వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః -  ధూపం పరికల్పయామి
రం తేజస్తత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః  - దీపం పరికల్పయామి  
వం అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి నమః
సం సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి నమః
 
ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ, హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ, కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ,  షష్ఠీశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ, కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకళానాథమయీ, విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కల్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,
 
శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,
శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతర యోగినీ,
శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,
శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,
శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామినీ, నిగర్భయోగినీ,
శ్రీచక్ర సప్తమావరణదేవతాః
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్య యోగినీ,
శ్రీచక్ర అష్టమావరణదేవతాః
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,
శ్రీచక్ర నవమావరణదేవతాః
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,  మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః |
ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ||
లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||
అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ||
మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ||
సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||
ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్ |
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ||
ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||
లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||
అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ |
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||
మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ||
తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||
 
|| ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ||

Wednesday, July 16, 2014

గురుపూర్ణిమ గురించి మీకు తెలీదని కాదు. ఇది పోయిన ఆదివారం ఆంధ్రభూమి వీక్లీలో వచ్చిన నా వ్యాసం.


గురుపూర్ణిమ

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః"

గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. సాక్షాత్తూ  పరబ్రహ్మ ఆయనే. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను.

"గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం

నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః"

 

భవ రోగాలను తొలగించేవాడు, సకల విద్యానిధీ, సకల లోకాలకూ గురువు దక్షిణామూర్తి. ఆయనకు న నమస్కారం.

ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లీ తండ్రీ దైవం - అన్నీ తామే అయ్యేవారు గురువులు.  విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఆచార్యులవారిని అంటే గురుదేవుని త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలి. ఇది ఋషివచనం.

"మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" అన్నది ఆర్యోక్తి.  తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు. తల్లి తరువాతే తండ్రి.  అదీ మన సంస్కృతి.

తెలిసో తెలియకో దైవానికి అపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం తెప్పిస్తే ముల్లోకాలలో ఆ త్రిమూర్తులతో సహా ఎవరూ రక్షించలేరు. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొందాలి.  అదే గురు పూర్ణిమ సందేశం.

"గురువునూ, గోవిందుడిని పక్క పక్కన నిలబెట్టి, ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే,  గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్త కబీరు.  

అసలు "గురు"వు అనే పదంలో   "గు" అంటే "తమస్సు" లేదా "చీకటి" లేదా "అజ్ఞానం",  "రు" అంటే "  తొలగించు" అని అర్థం.  మనలోని అజ్ఞానాన్ని తొలగించి తన జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడు "గురువు".  బ్రహ్మలాగా మనలో జ్ఞాన బీజాన్ని సృష్టించి, విష్ణువులాగా దాని స్థితిని కొనసాగించి, మహేశ్వరుడిలాగా  అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. 

పూర్వకాలంలో శిష్యులూ, గురువులు కూడా ఈ నాలుగుమాసాలూ వర్షాకాలం కావడంతో, వ్యాధులు ప్రబలే కాలం కాబట్టి, ఎలాటి  దేశసంచారమూ చేయకుండా ఒకేచోటే తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకునేవారు. ఆషాడ పూర్ణిమ నుండి నాలుగు మాసాలు(చాతుర్మాసం) ఒక వ్రతంగా పాటించేవారు. అదే చాతుర్మాస్య వ్రతంగా పేరు పొందింది. ఆ సమయంలో శిష్యులు గురువు దగ్గర జ్ఞాన సముపార్జన చేసేవారు. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు  గురువును ఆరాధించడానికి కేటాయించేవారు. ఆ సంప్రదాయమే కాలక్రమేణా " గురుపూర్ణిమ " గా మారిందని  అంటారు.  ఈ వ్యాస పూర్ణిమను వాడుకలోకి తెచ్చింది ఆదిశంకరులని కొందరంటారు.   

వసిష్ఠమహామునికి మునిమనుమడూ, శక్తి మహామునికి మనుమడూ, పరాశరమునికి పుత్రుడూ, శుకమహర్షికి జనకుడూ, నిర్మలుడూ ఐనట్టి,   శ్రీ వ్యాస మహర్షి  ఆదిగురువు. వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు. ఈ వ్యాసుడు  పుట్టినరోజునే గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ  అంటారు. ప్రతి ఏడూ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ ఉత్సవంగా జరుపుకుంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించి   గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలూ బహుమతులూ సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకొంటారు.  శ్రీమన్నారాయణుని స్వరూపమే వేదవ్యాసుడు.  అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదాలను విభజించి లోకానికి అందించిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలూ, భారత భాగవతాలూ లభించాయి. వ్యాసుడు  శ్రీమహావిష్ణుతేజంతో జన్మించినవాడు. కాబట్టే,    శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో "వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే" అని తలుచుకుంటాం.

"వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్

వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మ నిధయే వాశిష్ఠాయ నమోనమః"

 

శ్రీమన్నారాయణుని నాభియందు జన్మించినవాడు బ్రహ్మ. అతని మానస పుత్రుడు వశిష్ఠుడు. అతని సంతానమే శక్తి మహర్షి. శక్తి పుత్రుడే పరాశరుడు.   అంటే, వశిష్టుని మునిమనుమడైన, కల్మషరహితుడైన శక్తికి మనుమడైన, పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రియైన ఓ! వ్యాస మహర్షీ! నీకు వందనం.  

 

ప్రతి వ్యక్తికీ గురువు అవసరం ఉంది.  శిష్యులు లేని గురువులుండొచ్చు. కాని గురువు లేని శిష్యులుండరు.  పరిపూర్ణావతారుడై, జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడ  సాందీపని మహర్షి వద్ద శిష్యుడై  శుశ్రూష చేశాడు.  నిజమైన శిష్యుడెలా ఉండాలో లోకానికి చాటాడు. అదే కృష్ణుడు తిరిగి అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అందుకే "కృష్ణం వందే జగద్గురుమ్" అంటాం.

 

గురువుకు కుల,మత,జాతి బేధాలుండవు. వయోబేధాలుండవు.  సాక్షాత్తూ పరమశివునికి తన పుత్రుడైన  సుబ్రహ్మణ్యుడే గురువు. లోకానికి రమణ మహర్షిని పరిచయం చేసింది గణపతిముని. ఐతే, రమణులకు అత్యంత ప్రియశిష్యుడాయన. మనకు హితం చెప్పేవారంతా మన గురువులే.

 

గురుతత్వాన్ని వివరిస్తూ సిద్ధుడు  యదు మహారాజుకు ఒక అవధూత తన గురువుల గురించి చెప్పిన రీతిని ఇక్కడ మనం తలుచుకోవాలి.  యయాతి కొడుకైన యదు మహారాజు ఒకసారి వేటకు వెళ్లాడు. అడవిలో అతనికి ఒక సర్వసంగపరిత్యాగియైన ఒక అవధూత కనిపించాడు.  ఆయన సత్ చిత్ ఆనందునిగా చూసిన యదువు, స్వామీ మీరింత ఆనందంగా ఈ కీకారణ్యంలో ఎలా ఉండగలుగుతున్నారని అడిగితే,  దానికి ఆ అవధూత,  నేను 24మంది గురువులనుండి జ్ఞానాన్ని పొంది, అనుష్ఠించి, ఆత్మజ్ఞానం పొందాను.  అందువల్లే నాకు నిర్హేతుకంగా, శాశ్వతంగా ఉండే ఆనందం లభించింది అని చెబుతూ,  వారి వారి సద్లక్షణాలను గ్రహించి,  వారిని గురువులుగా గ్రహించాననీ చెబుతూ, ఆ  24 గురువులెవరో ఇలా చెప్పాడు -  "మొదటి గురువు భూమి, రెండో గురువు వాయువు, మూడో గురువు ఆకాశం, నాలుగో గురువు అగ్ని, ఐదో గురువు సూర్యుడు, ఆరో గురువు పావురం, ఏడో గురువు కొండ చిలువ, ఎనిమిదో గురువు సముద్రం, తొమ్మిదో గురువు మిడత, పదో గురువు ఏనుగు, పదకొండో గురువు చీమ, పన్నెండో గురువు చేప, పదమూడో గురువు పింగళ అనే వేశ్య, పద్నాలుగో గురువు వేటగాడు, పదిహేనో గురువు బాలుడు, పదహారో గురువు చంద్రుడు, పదిహేడో గురువు  తేనెటీగ, పద్నెనిమిదో గురువు లేడి, పంతొమ్మిదో గురువు గ్రద్ద, ఇరవయ్యవ గురువు కన్య, ఇరవై ఒకటో గురువు పాము, ఇరవై రెండో గురువు సాలెపురుగు, ఇరవై మూడో గురువు భ్రమర కీటకం, ఇరవైనాలుగో గురువు  నీరు".   ఈ 24 గురువుల లక్షణాలూ ఉండేవాడు సద్గురువు.

 

గురుపౌర్ణమినాడు వ్యాసుడు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది.  అలాగే, తమకు చక్కని గురువు దొరకాలనుకునే వారు ఈ గురుపూర్ణిమనాడు శ్రీగురుదత్త చరిత్ర పారాయణ చేస్తే ఆ గురుదత్తుడు సంప్రీతుడై, మార్గాన్ని నిర్దేశిస్తాడు.  గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని, సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు.  తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ ఒక్క రోజే పూజిస్తే చాలదు. ఈ రోజున ఆరంభించి గురుపాదాలను శరణువేడి, నిత్యమూ ఆయనను సేవిస్తేనే మన జన్మ ధన్యమైనట్లు. 

"ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం

మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా"

 

మన ధ్యానానికి మూలం గురువు, మనం చేసే పూజకు మూలం గురుపాదాలు, మనకు మంత్రం అంటూ ఏదైనా లభించిందీ అంటే అది మన గురుదేవుల వాక్యాలే, మనకు మోక్షం కలగాలంటే దానికి మన గురువు కృప ఉండాలి.  అందువల్ల, గురువే మన సర్వస్వం అని  సేవిస్తేనే మనకు మోక్ష మార్గం సుగమమవుతుంది.

 

వేదవ్యాసుడు   - 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు' అని రెండు చేతూలూ ఎత్తి నమస్కరిస్తూ చెప్పాడు. నిజమైన గురువు బోధించేది అదే. దత్తావతార తత్వం కూడా అదే.  దత్తుడు శిరిడీసాయిగా, పర్తి సాయిగా ఈ భువిలో అవతరించి  సకల జనులూ ఐకమత్యంగా, సుఖ సంతోషాలతోఉండాలనే చెప్పారు.  శిరిడీసాయి తన శిష్యులకు  పూజ చేసుకొమ్మని  చెప్పింది ఒక్క గురుపూజ మాత్రమే.  గురువే మూల స్థంభం. అదుగో, ఆ స్థంభానికి పూజ చేయండి!” అన్నాడాయన. ఆయన ఆ మాట అన్నది ఆషాడ పూర్ణిమ నాడే.   పర్తిసాయిగా ఆయనే ప్రేమే మార్గం, సేవే సత్యం!” అని బోధించాడు. సదా ఇతరులకు సాయంచేయి. పక్కవారిని కష్టపెట్టకు!” అని జాగ్రత్తలు చెప్పాడు.  నిజంగా  పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ   విషయాన్ని మనమంతా త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.  

 

----

Saturday, November 2, 2013


దివ్వెల దీపావళి 
ముందు మాట -  ఈ కవర్ స్టోరీ  ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం (నవంబరు 3,2013)  కోసం వ్రాశాను. ఐతే, చివరి క్షణంలో ఆ అనుబంధం కవర్ స్టోరీ కాస్త్ నవంబరు2, 2013 నాటి భూమికలో షార్టు స్టోరీగా వచ్చింది.
అసలు స్టోరీ ఇదీ ...... చదవండిక....  వివివిరమణ
 


మన జాతి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. 

 

ఆనంద ఉత్సాహాలతో  చిన్నా, పెద్దా తేడాలేకుండా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. 

 

"చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి... "  అనే ప్రసిద్ధమైన తెలుగు సినిమా పాట మీకు గుర్తుండే టుంది.

 

నిజమే. మన జీవితం చీకటి వెలుగల రంగేళే. అలాటి మన జీవితంలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. అందరినీ  జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.  అందరం కలిసి మెలిసి ఉండాలి. సంతోషంగా ఉండాలి.  చెడు ఎక్కవ కాలం నిలవదు. మంచి ఎన్నడూ నశించదు.

 

చీకటిని తిడుతూ కూచోకు. ఒక దీపం వెలిగించు, చీకట్లను పారద్రోలు అంటూ జగతిని జాగృతం చేసే చైతన్య  శోభావళి ఈ దివ్య దీపావళి.

 

అంటే, ఇక్కడ చీకటి అనేది అజ్ఞానం. దాన్ని జ్ఞానదీపంతో తొలగించుకో  అని అర్థం చేసుకోవాలి.

ఈ దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా అంటారు. దీపాలను వెలిగించినపుడు  మనకు నీలం, పసుపు, తెలుపు - ఈ మూడు రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు మానవునిలో ఉండే  సత్త్వరజస్తమోగుణాలకు ప్రతీక.  వీటిని జగత్తును పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం  అని,   దీపాలను వెలిగించడం ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లు, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతంగా  భారతీయులంతా నమ్ముతారు.

మానవుడు శక్తి ఆరాధకుడు కాబట్టే, ప్రతి పండగలోనూ శక్తి పూజ అంతర్లీనమై ఉంది. దసరా తొమ్మిది రోజులూ  దుర్గాదేవిగా  ఆరాధించి, దీపావళినాటికి లక్ష్మీదేవిని  పూజిస్తారు.  దుష్ట రాక్షసాది శక్తులను సంహరించాలంటే ఆది పరాశక్తియే సమర్థురాలు. అందుకే, మహిషాసురుని చంపడానికి దుర్గగా, నరకాసురుని చంపడానికి సత్యభామగా అవతరించాల్సి వచ్చింది.  కామ, క్రోధ, లోభ, మోహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలనీ  వాటిపై విజయం సాధించడం ఎంతో కష్టమనీ చెబుతూ, సరైన జ్ఞానం పెంపొందించుకుంటే విజయం మనదే అని చెప్పడమే దీపావళి పండగలోని అంతరార్థం. 

దీపం – పరబ్రహ్మ స్వరూపమే

దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకో లేదు అన్నది సత్యమే. కానీ, చెంత దీపం లేనిదే చీకటి సమసి పోదు. జ్ఞానం కలగనిదే  సమస్య తొలగదు. అందువల్ల  అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే ప్రకాశాన్ని ఇమ్మని ఆ దేవదేవుని వేడుకోవడమే దీపావళినాడు దీపం వెలిగంచడం. ఆ దీపం ఎలా ఉండాలంటే,   మట్టితో రూపొందిన  మన దేహం లాంటి  ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తిని జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి.

దీపం జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.  అందుకే   ప్రతి రోజూ మనం దీపాన్ని వెలిగించే వేళ విధిగా కింది శ్లోకం పఠించాలని పెద్దలు చెబుతారు.

దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ||          

 

దీపావళినాడు నూనెలో (ముఖ్యంగా నువ్వులనూనెలో) లక్ష్మీదేవీ, నదులూ, బావులూ, చెరువులూ - వంటి వాటిల్లో   గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారట.  ఈ శ్లోకం చూడండి.

 

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్ !

అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే ! !

 

అందుకే  దీపావళి నాడు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందే   అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగుతుందనీ, గంగానదీ స్నాన ఫలం లభిస్తుందనీ, నరక భయం ఉండదనీ  పురాణాలు చెపుతున్నాయి.  సాధారణంగా  త్రయోదశి నాటి సాయంకాలం నాడు యింటి వెలువల యముడి కోసం  దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుందంటారు.  దానికే యమదీపం అని పేరు. పూర్వ కాలంలో ఇంటిల్లిపాదీ తలొక్క ప్రమిదలో దీపం వెలిగించి, కింది శ్లోకాలు చదువుతూ

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!

ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే ! !

 

వైవస్వతాయ కాలాయ సర్వ భూత క్షయాయ చ!

వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః ! !

ఆ దీపాలను ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చేవారు. మారుతున్న  ఈ కాలంలో ఎవరూ ఇళా  చేస్తున్నట్టు లేదు.

అన్నట్టు, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోష సమయాన దీపాన్ని దానం చేస్తే, మానవుడు యమ మార్గాధికారంనుండి విముక్తుడవుతాడని ఆస్తిక లోక విశ్వాసం. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో వివరించినట్లు   చెప్తారు.

 

దీపావళి కథలూ, నమ్మకాలూ

వేద ధర్మమే మన ధర్మం. దాన్ని బట్టే పండగలూ వచ్చాయి. వాటి వెనక కథలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆరీతిలో దీపావళి పండగకు సంబంధించి ఎన్నోకథలు వాడుకలో ఉన్నాయి.  వాటిల్లో ప్రధానమైనవి:  నరకాసుర వధ,  బలిచక్రవర్తిరాజ్య దానం, శ్రీరాముడు రావణసంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమవటం (భరత్ మిలాప్), విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకం జరిగిన రోజు. 

 

శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు.

 

అన్ని కథల్లో నీతి ఒకటే. చీకటిని పారద్రోలి వెలుగులు తెచ్చే పండుగ దీపావళి.  విజయానికి ప్రతీక  దీపావళి పండుగ.  అంతే.

 

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత . 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ   మూడుసార్లు జలతర్పణం విడుస్తారు. దానివల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం.  

 

అది పక్కనబెడితే, మనం ఒక విషయం గమనించాలి.  శరదృతువులో దీపావళి పండగ రావడంలో ఒక విశిష్టత కూడా ఉంది.  మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది.  వానలు తగ్గి చలికాలం ఆరంభమయ్యే ఈ సమయంలో  పురుగూ, పుట్రా కాస్త ఎక్కువగానే ఉంటి. వాటినించి రాత్రుళ్లు మనల్ని మనం కాపాడుకోడానికి  పండగ రూపంలో దీపాలను వెలిగిస్తే,   సాధ్యమైనంత వరకూ అవి మనదరిచేర నీయకుండా ఉంటాయి. అదీ  దీపావళి వెనక అసలు పరమార్థం.

 

ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున దీపావళి వస్తుంది. పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి నాడు నరక చతుర్థశిగా జరుపుకుంటారు. భారతదేశమంతటా మూడు రోజుల పండగగా దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. మొదటి రోజు నరక చతుర్దశి, రెండవ రోజు దీపావళి అమావాస్య, మూడవ రోజు బలి పాడ్యమి.  దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి, అంతకు ముందు కొందరు ధనత్రయోదశి అని ఆచరిస్తారు. ఈ ధన త్రయోదశి అనేది అక్షయతృతీయకన్నా బలమైన రోజు. అమావాస్యకు తర్వాతి రోజును కొన్నిచోట్ల బలిపాడ్యమి(కార్తీక శుద్ధ పాడ్యమి)గా జరుపుకుంటారు. 

 

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపుకుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోజ్యాలతో  ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇల్లూ రంగవల్లులతో, పిండివంటల ఘుమఘుమలతో,   బంధువులూ, స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది. పండగనాడు లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది.

 

ఎలాగూ పండగ కాబట్టి, ఆ ముందు రోజు ఇంట్లో పేరుకు పోయిన చెత్తనీ, పనికిరాని వస్తువులనూ బయటపారేసి, ఇల్లంతా సున్నాలు కొట్టించుకోవడం కూడా ఈ దీపావళికి సర్వసాధారణంగా అందరూ చేసే పని. లేదంటే, సంక్రాంతికి తప్పనిసరి. ఇదంతా ఎందుకు చేయడమూ అంటే, ఇంట్లోని అజ్ఞాననే చెడు శక్తిని పారద్రోలి,  సుజ్ఞానాన్ని పొందడమే తప్ప మరొకటి కాదు.

 

పండగ స్నానంలో వైద్య రహస్యం

నరక చతుర్దశినాడు వేకుజాముననే ఇంట్లోని పెద్దలూ, పిల్లలూ కూడా  ఒంటినిండా నువ్వుల నూనెను పట్టించి, కనీసం అరగంట సేపు నునెలో నానాక శీకాయపొడి లేదా నానబెట్టిన కుంకుడుకాయల రసంతో తలార స్నానం చేయాలి.  నువ్వుల నూనె దేహంలోకి ఎంత ఇంకితే అంత మంచిదంటారు. ఎందుకంటే, ఇక వచ్చేది చలి కాలం. చర్మం  పొడిబారుతుంది. కాబట్టి చర్మానికి నూనెతనం చాలా అసరం. అది ఈ అభ్యంగన స్నానం వల్ల సులభతరం అవుతుంది.  కీళ్లకు కూడా మంచిది. సోపులు వాడకుండా సున్నిపిండి శరీరాన్ని శుభ్రం చేసుకుంటే మరీ మంచిది కూడా. షాంపూల కన్నా కుంకుడుకాయ రసం శీకాయ రసం వంటివి వాడటం వల్ల తలలో పేలున్నా, చుండ్రు ఉన్నా తొలగిపోతాయి కూడా. ఈ విషయాన్ని హైటెక్కు ఆధునికులు గుర్తించితే మంచిది.

 

తెలుగు సాహిత్యంలో దీపావళి

తెలుగు సాహిత్యంలో దీపావళికి పెద్ద పీటే వేశారు కవులూ, రచయిత(త్రు)లూ, పండితులూ.  వైజయంతీ విలాసం, వర్ణన రత్నాకరం వంటివాటిల్లో దీపావళి ప్రస్తావన ఉంది. ఆధునిక కవులెందరో ఈ దీపావళిని మనోహరంగా వర్ణించారు.   దాశరథి తన ప్రాణ దీపం అనే కవిత కూడా మనకు గుర్తొస్తుందీ సందర్భంగా.  దీప లక్ష్మి, దీప శోభ, దీపావళి – ఇలా కవితల కు పేర్లు కూడా ఎన్నో మనకు తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి.  సినిమాల్లో సరేసరి. వేరే చెప్పనక్కర్లేదు.  ఇవిగాక జానపదాల్లో కూడా దీపావళి ప్రస్తావనలతో కూడిన లక్ష్మీదేవి పాటలు ఎన్నో ఉన్నాయి.

 

పండగ పూట పూజలు

ధనత్రయోదశి, లక్ష్మీ పూజ, కేదారేశ్వర వ్రతం – ఇవీ దీపావళి పండగ సందర్భంగా అందరూ ఆచరించే పూజలు.  వీటన్నిటి వెనకా శక్తిపూజ ప్రాముఖ్యం ఎంతో ఉంది.  దీపావళి నాటి అర్థరాత్రి కాలంలో ఇంటినడుమ ధాన్యపురాశి పోసి, దానిపై తెల్లని వస్త్రాన్ని పరిచి, దానిపై లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుతారు.  ఆనక శ్రీ సూక్తం లేదా అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజచేసి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పాయసాన్ని నివేదిస్తారు.  నిజానికి దీపావళినాడు ప్రతి ఒక్కరూ చేయల్సిందదే.

 

పండగ నాటి తీపి వంటకాలు

 

ఈ దీపావళికి   రకరకాల తీపి వంటకాలు  చేస్తారు.  వాటి సంగతి చూద్దామా.

1. దీపావళి స్పెషల్ జిలేబి:  భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలో తప్పక కనిపించే ఈ జిలేబి దీపావళి ప్రత్యేక స్వీట్.

 2. సాంప్రదాయక పాయసం: పాయసం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. రకరకాల పాయసాలను  వండుతుంటారు. వీటిలో సేమ్యా   పాయసం చాలా ముఖ్యం.

3. గులాబ్ జామూన్: జామూన్ పేరు చెపితే చాలు.  నోరు ఊరిపోతుంది. తినటానికే కాదు చూసేటందుకు కూడా  జామూన్స్ ఎంతో బావుంటాయి.  

4. గుజియా: కొబ్బరితో చేసే గుజియా  అన్ని శుభకార్యాలకు, పండగలకు   తయారు చేసుకుంటారు

5. అరిసెలు: దీపావళి అనగానే  అరిసెలు గుర్తుకౌస్తాయి. బియ్యంపిండి, బెల్లంతో తయారు చేస్తారు. అందులో కొంచెం వెరైటీ గసగసాలు కలిపితే ఆ టేస్టే వేరు.  

 ఇక దీపావళినాడు చుర్మా లడ్డూ,సోన్ పాప్డి వంటివి ఉత్తరాది ప్రాంతాల్లో తప్పనిసరిగా చేస్తారు.  పాల పూరీ వంటివి దీపావళినాటి ప్రత్యేక ఆకర్షణలంటే అతిశయోక్తి కాదు.

 

బాణసంచాతో కాలుష్యం...

దీపావళి వేడుకల్లో అన్నింటికంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బాణసంచా కాల్చడం. ఐతే, దానివల్ల జరిగే వాతావరణ కాలుష్యం గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంత తక్కువగా టపాకాయలు కాల్చితే అంత ఎక్కువ పర్యావరణానికి మేలు చేకూరుతుంది. అంతే కాదు. మీ జేబులు కూడా అంత ఎక్కువ పదిలంగా ఉంటాయి.  బాణసంచా కాల్చడం కంటే మన జీవితాలు ముఖ్యమన్న విషయం తెలుసుకోవాలి.   కానీ   దీపావళి పండుగను పాత రోజుల్లో మట్టి దీపాలను వెలిగించి, లక్ష్మీదేవి పూజలు చేసి వేడుకలు జరుపుకునేవారు. అప్పట్లో బాణసంచాను కాల్చడం వంటివేమీ ఉండేవి కావు. అందువల్ల  వాతావరణ కాలుష్య  సమస్యే ఉండేది కాదు.  పైగా గోగు కాడలవంటి పర్యావరణ హితమైన వాటితోనే ఆనాటి బాణాసంచా తయారయ్యేది. కానీ, నేడు ఆధునికత పేరుతో పండగ పరమార్థం వ్యాపారంగా, ఫ్యాషన్ గా మారి  వెర్రి తలలు వేస్తోంది.

శబ్ద కాలుష్యంతో సమస్యలు...

అతి పెద్దగా శబ్దం చేసే బాణసంచా మూలంగా తీవ్రమైన శబ్ద కాలుష్యం కలుగుతోంది. నిజానికి ఒక టపాకాయ  పేల్చినప్పుడు దానినంచి వచ్చే శబ్దం నాలుగుమీటర్ల దూరంలో శబ్దం  125 డెసిబెల్స్‌కు మించి ఉండకూదని చట్టం కూడా ఉంది.  ఐతే, దీన్ని ఎవరూ పాటించడం లేదు. దానివల్ల  బాణసంచా కలిగించే  శబ్ద కాలుష్యం  ప్రజలపై  తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఎలాటి అనారోగ్య సమస్యలు రావచ్చు....

నేటి కాలంలోని బాణాసంచాలన్నీ ఎక్కువగా  రసాయన పదార్థాలతో తయారవుతున్నాయి. వాటి మూలంగా మన ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది.   అంతే కాదు. మితిమీరిన శబ్ధాలు కూడా మప్పును కలిగిస్తాయి.

·        రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది.

·        పెద్ద శబ్దాల వల్ల వినికిడి సమస్య రావచ్చు. శాశ్వతంగా చెవుడు రావచ్చు.

·        రాగితో తయారైన బాణాసంచాలవల్ల   శ్యాసకోశ సమస్యలు ఏర్పడవచ్చు.

·        మెగ్నీషియం తయారైన బాణాసంచాలవల్ల   వాటిల్లోని   మెగ్నీషియం పొగ రూపంలో వాతావరణంలో కలిసిపోయి చర్మ సంబంధ సమస్యలను సృష్టిస్తుంది

·        నైట్రేట్‌ తో తయారైన బాణాసంచా వల్ల మానసిక సమస్యలకు దారితీయవచ్చు

·        క్యాడ్మియంతో తయారైన బాణాసంచాలవల్ల   అనీమియా  రావచ్చు. లేదూ కిడ్నీ దెబ్బ తిననూవచ్చు.

·        సీసంతో తయారైన బాణాసంచా  నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

·        జింక్‌  ఉండే బాణాసంచా వల్ల వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువ

నేటి మాట - ఎకో ఫ్రెండ్‌లీ టపాకాయలు...

ఎకో ఫ్రెండ్‌లీ  టపాకాయల్లో ఆకులను వాడటంవల్ల  తక్కువ శబ్దాలతో ఇవి పేలుతాయి. కేవలం ధర తక్కువ మాత్రమే కాదు.  తక్కువ కాలుష్యాన్ని కలిగించడమే కాకుండా ఆట్టే పెద్దగా శబ్దాలు చేయని ఈ టపాకాయలవల్ల పిల్లలకు ప్రమాదం తక్కువ. దీంతో అందరూ ఎకో ఫ్రెండ్లీ టపాకాయలనే వాడాలని పర్యావరణ ప్రేమికులు ప్రచారాన్ని చేపడుతున్నారు.

చివరిగా ఒక్క మాట -

బాణాసంచా వంటి వాటి సంగతిని పక్కనబెట్టి, ముందు సహజంగా దొరికే నువ్వులనూనె, కుంకుడు కాయ, శీకాయ, సున్నిపిండి – వీటిని వాడటం వల్ల కలిగే లాభాలను గుర్తుతెచ్చుకోండి. షాంపూలనూ, సబ్బులనూ మీ టీవీలకే పరిమితం చేసేయండి. పాక్డ్ తిండికీ, స్వీట్లకీ స్వస్తి చెప్పండి. సాధ్యమైనంత వరకూ మీ వంటకాలను మీరే శుచిగా వండుకోండి. ఆ అజ్ఞానం తొలగితే, మీ దీపావళి పండగ పట్ల సార్థకమైనట్లే.  ఆరోగ్య లక్ష్మిగా, విజయ లక్ష్మిగా, ధన లక్ష్మిగా లక్ష్మీదేవి సదా మీతోనే ఉంటుంది.  సందేహం లేదు.

*****