Tuesday, November 29, 2011

‘మొక్క’వోని వైద్యం Andhra Bhoomi Sunday Suppliment November 6th, 2011 Story


పంచభూతాత్మకమైన మన దేహం మనస్సు, బుద్ధి, అహంకారాలనే వాటితో చైతన్యాన్ని పొందుతోంది. అందువల్ల అలాటి దేహం ప్రకృతి ధర్మాలను అనుసరించి జీవిస్తూంటూంటే శారీరిక, మానసిక ఆరోగ్యాలు కలుగుతాయి. సక్రమంగా ఆహారాది విహారాదులను కలిగి ఉంటే, పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది సుఖంగా ఉండవచ్చు.

అసలు మానవ జాతి మనుగడకోసమే ప్రకృతిలో పలురకాల మొక్కలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు 80వేల మొక్కలు ఔషధ గుణాలను కల్గి ఉన్నాయని ఒక అంచనా. నిజానికి ప్రాచీనకాలం నించీ మానవుడు సహజంగా లభించే పదార్థాల ఔషధ గుణాలను వాడుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ వస్తున్నాడు. అదే సనాతన విజ్ఞానమైన ఆయుర్వేద రహస్యం. శారీరిక, మానసిక స్వస్థత గురించి ఆయుర్వేదం విపులీకరించింది. వ్యాధి, చికిత్సలే కాదు, ఆ వ్యాధి రాకుండా ఎలా ఉండాలో కూడా చెబుతోంది. మర్రిచెట్టు ఊడ, కొయ్యలతో గానీ, కానుగ, వేప పుల్లలతో గానీ ప్రతి రోజూ పళ్ళు తోముకొంటూంటే చిగుళ్ళు గట్టిగా, ఆరోగ్యంగా ఉండటమే కాదు దంతాలూ శుభ్రంగా ఉంటాయి. మర్రి చెట్టు పుల్లలు వాడడంవల్ల మెదడు చురుగ్గా ఉంటుందంటారు మన ఆయుర్వేద నిపుణులు. ప్రతిరోజూ పొద్దునే్న సీమబాదం పప్పులు చక్కగా నమిలి తింటూ వస్తేఅది మెదడుకు ఎంతో బలాన్నిస్తుంది.

అరకప్పు వేడి పాలల్లో చిటికెడు పసుపు పొడి వేసి సేవిస్తే జలుబు, పడిశం కాస్త మాయమైపోతుంది. అతిగా తుమ్ములు వస్తూంటే కొత్తిమీర వాసన చూస్తే తగ్గిపోతుంది. అల్లం ముక్కను కొంచెం కొంచెంగా నములుతూ, దాని రసం మింగితే టాన్సిల్స్సమస్య నెమ్మదిగా తగ్గిపోతుంది. లవంగాల చూర్ణం గానీ తైలంగానీ పిప్పిపన్నుసమస్యను తగ్గిస్తుంది. జాపత్రిని నోట్లో వేసుకొని కాస్త నమిలితే, నోటి దుర్వాసన పోతుంది. నోటిలో పాచి చేరడం, పగుళ్ళు ఇవన్నీ నివారింపబడతాయి. గోరువెచ్చని ఆవుపాలతో (లేదా గేదె పాలతో) కొద్దిగా సీమబాదం నూనెను ఒక స్పూను కలుపుకొని రాత్రి నిద్రపోయే దానికి ముందు తాగితే మరుసటిరోజు మలబద్ధక సమస్య అనేది ఉండదు. బఠాణీల పొడి (లేదా పిండి)ని ముఖానికి నలుగు పెట్టుకొంటే ముఖమీది మొటిమలు కాస్త మాయమైపోతాయి.

మధుమేహం తగ్గడానికి మారేడాకు రసం ఎంతో వినియోగిస్తుంది. అలాగే నేరేడు చెక్క కషాయం కూడా. అరకప్పు మేకపాలలో ఒక చెంచాడు తేనె నిత్యమూ సేవిస్తే, రక్తశుద్ధి అవుతుంది. అసలు పొద్దునే నోరు కడుక్కోగానే ఒక చెంచాడు తేనె రక్తశుద్ధిని కలిగిస్తుంది. నీరుల్లి రసం చెంచాడు త్రాగుతూ వస్తే, కడుపులో క్రిములు మాయమైపోతాయి. ఆకలి పెరగాలీ అంటే, ఎండు ద్రాక్ష, కరక్కాయ, కలకండ- మూడూ కలిపి పొడి చేసి రోజూ రెండుసార్లు తీసుకోవడం మంచిది. కరివేపాకు ఎంత గుణాన్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఆయుర్వేదం మన జీవరాగంగా అనాదిగా విరాజాల్లుతోంది.

మనకు తెలీకుండా మన వంటింట్లోనే ఎన్నో రకాల దినుసులున్నాయి. అవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి కూడా. ఆయుర్వేదం మన వేద విజ్ఞానసారం. ఆ సంగతి మనం దాదాపుగా మర్చిపోయాం. మనం సహజంగా ప్రకృతిలో దొరికే వాటిని విస్మరించి, టీవీ ప్రకటనల ఆకర్షణకు లోనై రసాయనాలపై ఆధారపడ్డాం. వేప పుల్ల అనాగరికతకు చిహ్నంగా భావించి, అదేదో పేస్టు తెస్తాం. దాన్ని వాడటం మొదలెట్టాక ఆ కంపెనీవాడు మరో ప్రకటన వేస్తాడు. మీ పేస్టులో ఉప్పుందా? పప్పుందా? అంటూ! ఇదంతా మాయ అని మనకూ తెలుసు. ప్రకటనలు గుప్పించే వారికీ తెలుసు. కానీ, మనం మోసపోడానికే రెడీ అయిపోతాం. నువ్వుల నూనె వాడటం, శీకాయ పొడి వాడటం మానేశాం. అవి వాడుతూన్నంత కాలం అసలు చుండ్రు సమస్యే లేదు.

మరి ఇప్పుడో? షాంపులు వాడుతున్నాం. అవి వాడి మానేస్తే చుండ్రు అధికవౌతోంది. కాబట్టి వాటిని వాడుతూనే ఉంటాం. మన ఆహారపు అలవాట్లూ మారిపోతున్నాయి. చక్కని పౌష్టికాహారాన్ని మానేసి, పిజ్జాలూ, బర్గర్లూ తినడం మొదలెట్టారు జనం. నిజానికి మన వంటిల్లే ఒక వైద్యశాల. మనం నిత్యం ఆహారంలో వాడే ధనియాలు, మిరియాలు, పసుపుపొడి, వెల్లుల్లి నీరుల్లి, అల్లం, నిమ్మ, ఉసిరిక- ఇవన్నీ ఎంతో ఘనమైన వైద్య పరంపర కల్గినవే.
మనం మర్చిపోతున్నా, నిర్లక్ష్యం చేస్తున్నా, విదేశాల్లో నెమ్మది నెమ్మదిగా ఆయుర్వేదం ప్రాముఖ్యాన్ని గుర్తించారు. టాప్ 10 ఆయుర్వేద మూలికలంటూ విస్తృతంగా ప్రచారమూ చేస్తున్నారు. ఈ ఆయుర్వేద మూలికలు ప్రాచీన భారతీయ సంస్కృతి నించే వచ్చాయి. మనకు సంక్రమిస్తూన్న పలు రుగ్మతల నివారణలో మూలికా వైద్యం విశిష్టస్థానాన్ని సంపాదించుకొంది. మనం తినే వంటల్లో ఆయుర్వేద మూలికలను మనకు తెలీకుండానే అంతో ఇంతో వాడుతున్నాం. కాబట్టీ మనం ఈ మాత్రం ఉన్నాం. మనం తరచూ వినేవే ఇవన్నీ. ఈ టాప్ 10 ఆయుర్వేద గుణాలున్న వాటిలో పసుపు, వెల్లుల్లి, అల్లం, ఉసిరి, ధనియాలు ప్రధానమైనవి.

మిగిలిన ఐదూ ఏమిటంటే, అశ్వగంధ, షల్లకి, బిభితకి, హరితకి, శరదున్నిక గుర్మార్ అనేవి అన్నీ సులభంగా దొరికేవే. ఈ పదింటి గురించీ కాస్త తెల్సుకొందాం.
పసుపు. సౌభాగ్యాన్ని చాటిచెప్పేదిగా మనందరికీ తెలుసు. ఇది సర్వజన ఉపయోగకారి. దీనికే క్రిమిఘ్ని అనే పేరుంది. అంటే క్రిములను చంపుతుందన్నమాట. ఇది స్ర్తిలకు ఆరోగ్య భూషణంగా చెప్పుకొంటారంతా. రక్తశుద్ధికి పసుపును మించిన ఔషధం వేరే లేదు గనకే స్ర్తిలు నిత్యమూ వాడుతూంటారు. ఋతుస్రావ సమయంలో పసుపు ముద్దలను మింగడంవల్లా పసుపు నీటిని త్రాగడంవల్లా రక్తశుద్ధి కల్గడం జరుగుతుంది. ఐతే ఆధునిక కాలంలో ఈ అలవాటు దాదాపు ఎవరికీ లేకుండా పోయింది. కాళ్ళకు, ముఖానికి రాసుకోవడంవల్ల అది యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. తడి కాళ్ళలో క్రిములు చేరకుండా చూస్తుంది కూడా. భారతదేశ శీతోష్ణస్థితిగతుల దృష్ట్యా పసుపు చక్కని ఆరోగ్యకారి. పసుపును స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా స్ర్తిలు వాడి స్నానంచేస్తే చర్మరోగాలు రాకుండా చూస్తుంది. చర్మం శుభ్రపడుతుంది కూడా.

మంచిరుచికరంగా ఉండదు. నిజమే. పసుపు కూడా ప్రధానంగా రుచికరంగా ఉండదు. చేదుగా ఉంటుంది. కొంత కారపు రుచీ ఉంటుంది. ఇది జలుబును తొలగిస్తుంది. శరీరానికి కాంతినిస్తుంది. పుండ్లను మాన్పుతుంది. క్రిమి సంహారి. అతిసార వ్యాధిని అరికడుతుంది. కుష్ఠు, పాండు రోగాలను తగ్గించడంలో పసుపు పాత్ర ప్రశంసనీయం. పాము కరిచిన విష నివారణకు పసుపు ఉపకరిస్తుంది. జలుబు, దగ్గు, ఉబ్బస వ్యాధులకు కరక్కాయ, మిరియాలతో తగురీతిన వాడితే ఉపశమనాన్నిస్తుంది పసుపు. హరిద్రలేదా పసుపు అనేది మనం చేసే వంటలకు బంగారు కాంతినిస్తుంది. ఇది యాంటీసెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌గా మహత్తరంగా పనిచేస్తుంది. శరీరంలో నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది.

ఇటీవల హార్వార్డ్ మెడికల్ స్కూల్ చేసిన సర్వేలో అల్లోపతి వైద్యానికి తోడుగా జనాలు ప్రకృతిసిద్ధమైన ఆయుర్వేద విధానాన్ని వాడటానికీ మొగ్గు చూపుతున్నారని తేలింది. జాయింట్ పెయిన్స్ తొలగించడంలో పసుపు కీలకపాత్ర పోషిస్తుందన్న సంగతి ఈమధ్యే ఒక డాక్టరు వెల్లడించింది కూడా. రోజుకు కనీసం వెయ్యి మిల్లీగ్రాముల పసుపు పొడి మన దేహంలోకి వెళ్ళడం చాలా మంచిదని ఆ డాక్టర్ సెలవిచ్చారు. తమ తండ్రి గారికి జాయింట్ఆపరేషన్ అయ్యాక ఆయన నొప్పిని భరించలేకపోవడమే కాదు, కడుపులో కూడా సమస్యలు ఎక్కువయ్యాయట.

మొదట ఆమె పసుపు వాడమని చెప్పినా ఆయన అంత శ్రద్ధ చూపలేదు కానీ, ఆ తర్వాత వాడగా ఆశ్చర్యకరంగా ఆయన నొప్పులేకాదు, కడుపులోని సమస్యలూ మాయమైపోయాయి. రుమాటిక్ ఆర్త్రిటీస్, డయాబిటీస్‌లను తగ్గించేందుకే కాదు, క్యాన్సర్‌ని రూపుమాపే దిశలో కూడా పసుపు కీలకపాత్రను పోషిస్తుంది. అందుకే, మీ వంటల్లో పసుపు తప్పనిసరిగా ఉంచుకోండంటున్నారు డాక్టర్లు. పసుపు గుణాలు మన దేహంలో చేరి సరిగ్గా పనిచేయడానికి మనం వాడే మిరియాలు ఎంతో దోహదం చేస్తుంది. ఈ సంగతీ వైద్యపరంగా నిరూపణ అయ్యింది. అందుకే విదేశాల్లో ఇపుడు పసుపు కాప్సూల్ రూపంలో పిపెరైన్‌తో కలిపి తీసుకోమని డాక్టర్లు రెకమెండ్ చేస్తున్నారు కూడా.

అల్లం అనేది మరో ప్రధానమైన ఆయుర్వేద మందుగా చెప్పుకోవాలి. అల్లం కూడా పసుపులాగానే కొమ్ముల రూపంలో లభించే దుంప. ఎండిన అల్లాన్ని శొంఠిఅంటారు. అల్లపు రసము కుంకుమపువ్వుతో కలిపి వాడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. అల్లం అజీర్తిని తొలగిస్తుంది. అల్లం, బెల్లంతో కలిపి తింటే. అరిచేతులూ, అరికాళ్ళూ పై పొర ఊడటం తగ్గుతుంది. నాలుక శుభ్రపడుతుంది. పైత్యాన్ని పోగొడ్తుంది. వంటల్లో వాడటం కేవలం సుగంధానికే కాదు, దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. బాక్టీరియా, ఇతర క్రిములను సంహరిస్తుంది. ఉబ్బసం, కుష్ఠు, చర్మవ్యాధులు- వీటి నివారణకే కాదు. కలరా నివారణకు, కడుపు ఉబ్బరంగా ఉంటే తొలగించడానికి కూడా వాడొచ్చు. శొంఠి కషాయం దగ్గునూ, జలుబునూ తగ్గిస్తుంది. శొంఠి శోధిస్తుందిఅనే తెలుగు సామెత ఉండనే ఉంది కదా! జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాదు, కడుపులో ఎలాటి రుగ్మతలున్నా పోగొడ్తుంది. అరుచిగా ఉన్నా, అజీర్తిగా ఉన్నా, ఆకలి లేకున్నా, అన్నంలో తొలి ముద్దగా ఇంత శొంఠిపొడిని కలిపి సేవిస్తే వెంఠనే గుణం కనిపిస్తుంది. ఇది కొంత ఘాటుగా కారంగా ఉంటుంది. మలబద్ధకాన్ని పోగొడ్తుంది.
ముక్కుకు సంబంధించిన రుగ్మతలను కూడా అల్లం పోగొడ్తుంది. అల్లం మురబ్బా పైత్యాన్ని తగ్గిస్తుంది. అజీర్తిని తొలగిస్తుంది. నోట్లో నీరూరే సమస్య ఉండేవారు అల్లం మురబ్బా వాడితే గుణం కనిపిస్తుంది. అల్లం టీకూడా ఎంతో మంచిది. అల్లం టీలేదా శొంఠి కాఫీఅనేది చాలా ఆరోగ్యకారి.
వెల్లుల్లి అనేది మనం సర్వసాధారణంగా వాడే మరో ఆయుర్వేద ఔషధం అనే చెప్పాలి. ఇది తెల్లగా ఉండి, ఘాటైన వాసన కల్గి ఉంటుంది. ఇది వాతాన్ని హరిస్తుంది. గ్యాస్అంటూ బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఐతే దీని వాసన భరించడమే కష్టం. తిన్నవాడికి బాగానే ఉంటుంది గానీ పక్కన వాళ్ళకి ఇబ్బందే. ఇది రక్తాన్ని శుద్ధిచేస్తుంది. వీర్యవృద్ధికి దోహదం చేస్తుంది. బుర్రను చురుగ్గా ఉంచుతుంది. ఎముకలు విరిగినపుడు, అవి త్వరగా అతుక్కోవడానికి వెల్లుల్లి చక్కని మందుగా పనిచేస్తుంది. గుండె జబ్బులకూ, జీర్ణజ్వరాలకూ నివారణలో ఉపకరించే వెల్లుల్లి క్రిమిసంహారిగా పనిచేస్తుంది కూడా. దగ్గునూ, శ్వాస సంబంధ సమస్యలనూ పరిష్కరించడంలో కీలక పాత్రను పోషిస్తుంది.

పులుపు తప్ప మిగిలిన ఐదు రసాలూ కల్గి ఉండటం వెల్లుల్లి ప్రత్యేకత. దుంపలో కారం ఎక్కువగా ఉంటే, వీటి ఆకుల్లో చేదు రుచీ, నాళాల్లో వగరూ ఉంటాయి. నాళపు కొసల్లో ఉప్పగా ఉంటుంది. గింజలు తియ్యగా ఉంటాయి. మొండిగా ఎంతకీ మానని పుండ్లపై పూతగా వెల్లుల్లిని మెత్తగా నూరి పూయాలి. మూర్ఛరోగాన్ని కూడా వెల్లుల్లి తగ్గించగలదు. తేలు, కందిరీగ, జెర్రి లాటివి కుట్టినపుడు, ఆ ప్రదేశంలో వెల్లుల్లి రసాన్ని రుద్ది గుడ్డ పొగవేస్తే, విషం హరించిపోతుంది. ఉబ్బసం మరీ ఎక్కువైనపుడు వెల్లుల్లి రసాన్ని 3 లేదా 4 చుక్కలు నీళ్ళలో వేసి త్రాగితే, వెంటనే ఉపశమనాన్ని కల్గజేస్తుంది కూడా.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత కూడా ఉంది. వెల్లుల్లి దివ్య ఔషధమే. ఐతే వెల్లుల్లిని మితిమీరి సేవిస్తే, పైత్యాన్ని పెంచగలదు, వీర్యాన్ని నశింపజేయగలదు, గర్భస్రావాన్నీ కల్గజేస్తుంది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి.
ధనియాలు, కొత్తిమీర- ఈ రెండు తెలీనివారూ, వాడనివారూ ఉండరంటే అతిశయోక్తికాదు. ధన్యాక కుస్తుంబురు అనేది దీనికుండే మరో పేరు. కొంచెం చేదుగా, వగరుగా, కారంగా ఉంటుంది. రుచిగా, చక్కని వాసనతో ఉంటుంది కొత్తిమీర. ఇది శ్వాసకోశ సంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. అలర్జీలను నివారిస్తుంది. జీర్ణకారిగా కూడా పనిచేస్తుంది. ఆకు కూరలలో కొత్తిమీరకుండే గుణం వేరేదేనికీ లేదు. కొత్తిమీర ఆకును ఆవునెయ్యితో వెచ్చచేసి కంటికి కడితే నేత్ర రోగాలను నివారిస్తుంది. కొత్తిమీర రసాన్ని పుక్కిలిస్తే నోటి పూతలు తగ్గుతాయి. దీని గింజలే ధనియాలు. ధనియాలు, మిరియాలు, పసుపు- ఈ మూడు మనం తయారుచేసుకొనే రసంలో ప్రధానంగా వాడతాం. వీటికితోడు జీలకర్రనూ వినియోగిస్తాం. ఇవన్నీ జీర్ణశక్తిని పెంపొందింపజేస్తాయి. పసుపు మన రక్తశుద్ధికీ, నొప్పుల నివారణకీ పనికొస్తుంది. మిరియాలు ఆ పసుపు రక్తంలో సులభంగా కలిసి పనిచేసేందుకు తోడ్పడటమే కాదు, శ్వాసకోశ వ్యాధులనీ తొలగిస్తుంది. ఇదంతా రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది మన దేహంలో.

ఆమ్లకం, ఆమ్లా లేదా అమలకం అనేది ఉసిరికాయకు మారుపేర్లు. దీనే్న ఇండియన్ గూస్‌బెర్రీ అంటారు. ఉసిరికాయ చూడ్డానికి పెద్ద గోళీకాయలా, గుండ్రంగా ఉంటుంది. ఆకుపచ్చని ఛాయ కలిగి, లేత పసుపు రంగులో నిలువు చారలతో ఉంటుంది. ముక్కోణంగా గట్టిగా గుండ్రని పిక్క లోపల గింజలుంటాయి. ఇందులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు అమినోయాసిడ్స్, గాలిక్ యాసిడ్, టేనిక్ యాసిడ్, కాల్షియంలతోబాటు పీచు పదార్థం కల్గి ఉంటుంది. బలహీనత నివారణకీ, వెంట్రుకలు ఊడిపోకుండా నివారించేందుకీ అజీర్ణ నివారణకీ ఎంతో తోడ్పడ్తుంది ఉసిరికాయ. ఇది విరేచనకారి కూడా. మూత్రాన్ని సులభంగా వెళ్ళేందుకూ, రక్తస్రావాన్ని అరికట్టడానికీ కూడా వాడతారు. దగ్గు, జలుబు తగ్గడానికి, పచ్చకామెర్లు (జాండీస్) తగ్గడానికి ఉసిరికాయ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎండిన కాయలను పొడిగొట్టి శీకాయ పొడి వంటి వాటితో కలిపి వాడితే జుట్టు బాగా పెరుగుతుంది.

ఉసిరికాయ విత్తనాలతో ఉబ్బసాన్నీ, శ్వాసకోశ వ్యాధులనీ తగ్గించవచ్చు. ఉసిరికాయల్లో రాచ ఉసిరి అనే రకంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ కాయలు నక్షత్రపు ఆకారంలో ఉండి, పుల్లగా ఉంటాయి. నేల ఉసిరి అనే రకపు ఉసిరికాయ చేదుగా ఉంటుంది. పచ్చకామెర్లు, చర్మరోగాలు, మూత్ర సంబంధ రోగాలూ వుంటే నేల ఉసిరిని వాడి ఉపశమనాన్ని పొందవచ్చు. దీని ఆకులు గనేరియా వ్యాధి నివారణకూ, మలబద్ధకాన్ని తొలగించడానికీ వాడతారు. మొండి జ్వరాలను తగ్గించడంలో దీనిదే పైచేయి. ఈ మొక్కనుంచి ఫిల్లాంథిన్, హైపోఫిల్లాంథిన్, ఫ్లీవనాయిడ్స్ లభించడంవల్ల ఔషధాల తయారీలో ఎంతగానో వినియోగిస్తుంది.

కరక్కాయ అనేది మరో మహత్తరమైన ఔషధ గుణాలు కల్గిన ఆయుర్వేద ఔషధంగా చెప్పుకోవాలి. దీనే్న హరీతకీ అని కూడా అంటారు. దీని ఆకులు పెళుసుగా ఉంటాయి. పూలు మామిడి పూతలా ఉంటాయి. ఈ కరక చెట్టులో విజయ, రోహిణి, పూతన, అమృత, అభయ, జీవంతి, చేతికీ అని ఏడు రకాలున్నాయి. ఏడు రకాలూ ప్రత్యేక రూపాలనీ, గుణాలనీ కలిగి ఉంటాయి. ఒక్కో రకానికి ప్రత్యేక ఉపయోగాలున్నాయి. వీటిలో విజయ అనేది ఆనపకాయ లాగా గుండ్రంగా ఉండి, దళసరి చర్మాన్ని కల్గి ఉంటాయి. రోహిణీ అనేది కూడా గుండ్రంగానే ఉంటుంది. పూతన అనే కాయ చిన్నదిగా ఉంటుంది. దీని గింజ కూడా చిన్నదిగానే ఉంటుంది. అమృత అనేది దళసరి చర్మాన్ని కల్గి ఉంటుంది. గింజ మాత్రం చిన్నదిగానే ఉంటుంది. అభయ కారక అనేది 5 రేఖలు కల్గి ఉంటుంది. జీవంతి కరక అనేది బంగారు కాంతితో మెరుస్తూంటే, చేతకి అనేది 3 రేఖలు కల్గి ఉంటుంది. వీటి ఆకార, గుణాలనుబట్టి ప్రత్యేకంగా ఇలా పేర్లు పెట్టారు.

కరక్కాయ షడ్రుచులలో లవణ రసం మినహా అన్ని రుచులూ కల్గి ఉంటుంది. పంచరసాత్మకమైన కరక్కాయ జీర్ణకారి. కంటికి మంచిది. బుద్ధిని వికసింపజేస్తుంది. మూల వ్యాధులకీ, కుష్ఠురోగాలకీ ఉపశమనకారి. ఎక్కిళ్ళు, పుండ్లు, వాంతులు నివారించగలదు. కంఠస్వరాన్ని బాగుచేస్తుంది. పొడి దగ్గు ఎంతకీ తగ్గకపోతే, కరక్కాయను ముక్కలు చేసి ఒక ముక్క ఒక ఉప్పు పలుకుతో కలిపి బుగ్గన పట్టి ఉంచితే, దగ్గునుంచి ఉపశమనం పొందవచ్చు. పైత్యాన్ని, వాతాన్నీ కఫాన్నీ హరింపజేస్తుంది. అందుకే కరక్కాయకు త్రిదోషహారిఅని పేరు. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోజూ రెండుపూటలా ఒక కరక్కాయ చొప్పున తింటూ వస్తే, రెండు నెలల్లో ఎలాటి ఉదర రోగమైనా నశించాల్సిందేనంటారు వైద్యులు. కరక్కాయ పొడిని తేనెతో కలిపి వాడితే వాంతులు తగ్గిపోతాయి. ప్రతిరోజూ బెల్లంతో కలిపి తీసుకొంటే, అంతర్గతంగా ఉండే పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు. కరక్కాయ కషాయం తేనెతో కలిపి తాగితే కంఠ రోగములన్నీ నశిస్తాయి. కరక పువ్వు ఎండితే గోధుమ రంగులో ఉంటుంది. దీన్ని పిల్లలకు వచ్చే కోరింత దగ్గునివారణలో వాడతారు.
తానికాయ లేదా విభీతకీ అనేది మరో మహత్తరమైన ఆయుర్వేద ఔషధం. దీనే్న బిభీతకీ, తాండ్ర అని కూడా అంటారు. దీని ఆకులు బాదం ఆకుల్లా ఉంటాయి. ఫలాలు గుండ్రంగా బూడిద రంగులో ఉండి, ఐదు కోణాలు కలిగి పొట్టికాడతో ఉంటాయి.

తానికాయ పండ్లల్లో టానిన్స్ (17%), కర్ర, బెరడుల్లో ఎల్లాజిక్ యాసిడ్, ఉత్తనపు కవచంలో గాలిక్ యాసిడ్ ఉంటాయి. దీని పువ్వులు నువ్వుల పూవుల్లా ఉంటాయి. తానికాయ విషాన్ని హరిస్తుంది. దీనిలో కూడా ఉప్ప గుణం తప్ప మిగిలిన ఐదు రుచులూ ఉన్నాయి. ఇది కూడా వాత, పిత్త, కఫాలను తొలగిస్తుంది. త్రిదోష హారిగా పేరుపొందింది.

తలపై వెంట్రుకలు బాగా పెరిగేందుకు తోడ్పడే తానికాయ దప్పికను నివారిస్తుంది. దీని గింజల నుంచి తీసిన నూనెను తేనెతో కలిపి కళ్ళకు కాటుకలాగా వాడితే కళ్ళు బాగుంటాయి. కంటి సంబంధ రోగాలు పోతాయి.
ఉసిరి, కరక్కాయ, తానికాయ- ఈ మూడింటిని కలిపి త్రిఫలఅంటారు. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం ఎంతో ప్రసిద్ధికెక్కింది. మూడింటికీ ఉప్పురుచి తప్ప, తక్కిన ఐదు రుచులూ ఉండటం విశేషం. నేత్ర, దంత వ్యాధుల్లో ప్రసిద్ధి. జీర్ణకారి. దగ్గు, ఆయాసం పోగొట్టడమే కాదు మలబద్ధకాన్ని నివారించి విరేచనాలయ్యేలాగా పనిచేస్తుంది త్రిఫల చూర్ణం. బలాన్ని చేకూరుస్తుంది. వీర్యవృద్ధికి దోహదం చేస్తుంది. పైగా పుండ్లు మానడంలో తోడ్పడ్తుంది కూడా. చర్మరోగాలనూ, నేత్ర రోగాలనూ తగ్గిస్తుంది. త్రిఫల చూర్ణంతో రోజూ పళ్ళు తోముకొంటే దంత వ్యాధులు ఏమున్నా పోతాయి.

అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో ప్రముఖ స్థానాన్ని కల్గి ఉంది. దీనే్న ఇండియన్ జిన్‌సెంగ్ అనీ, అస్‌గంధ్ అనీ, పెనే్నరు గడ్డ అనీ అంటారు. దీని ఆకులు ఒకదాని తర్వాత ఒకటి కణుపునకు ఒకటి చొప్పున వస్తాయి. తెల్లని పూలు కాడలు లేకుండా గానీ, లేదా పొట్టి కాడలతో గానీ ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. విత్తనాల పొరలపై గుంతలు పడి ఉంటాయి. వీటి వేర్లలో విథాఫెరిన్- ఎ, బి అనే ఆల్కలాయిడ్స్ బాగా లభిస్తాయి. దాదాపు అన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ దీన్ని వాడుతున్నారు

మూత్ర విసర్జనలో ఎలాటి సమస్యలున్నా అశ్వగంధ వేర్లు, పండ్లు, విత్తనాలు వాడతారు. వీటి వేర్లను ఎండబెట్టి పొడిచేసి రోజూ పాలల్లో కలిపి తీసుకొంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. క్షయ, శ్వాస రోగాలూ నివారిస్తుంది. కీళ్ళ నొప్పులకు మంచి మందు. కామప్రవృద్ధికి దోహదకారిగా అశ్వగంధకు మంచి పేరుంది. దీన్ని విదేశాల్లో వింటర్ చెర్రీఅని పిలుస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది కూడా.

ఆయుర్వేదంలో షల్లకి అనేది నొప్పుల నివారణకు ఎక్కువగా వాడతారు. దీనే్న బోస్వెల్లియా అనీ అంటారు. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఎనాల్జిసిక్‌గా పనిచేస్తుంది. విదేశాల్లో దీనే్న ఫ్రాంకిన్‌సెన్స్ అని పిలుస్తారు. రుమటాయిడ్, ఓస్ట్రొయో ఆర్త్రిటీస్ వ్యాధుల్లో నివారణకు షల్లకి చక్కగా పనిచేస్తుంది. ఆర్త్రిటీస్ నొప్పులు విపరీతంగా ఉన్నవారిలో దీన్ని వాడగా 7 రోజుల్లోనే గుణం కల్గిందని ఇటీవలి వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
శరదునిక గుర్మార్ లేదా జిమ్నెయా అనేది మరో ఆయుర్వేద ఔషధం. దీనినే మధునాశిని అని కూడా అంటారు. దీనిమీద ఇప్పటికే విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఇది టైప్ 2 మధుమేహాన్ని తగ్గించడంలో గణనీయంగా తోడ్పడుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించగలదు. దీనిని స్వీటెనర్‌గా వాడవచ్చు. కాప్స్యూల్‌గానూ వాడొచ్చు.
ఇదీ టాప్‌టెన్ ఆయుర్వేద ఔషధాల కథాకమామీషూ.