Monday, September 19, 2011

ప్రాచీన భారతీయ చతురతకి ప్రతీక - జంతర్‌మంతర్


జంతర్‌మంతర్

- డా.సాయి అయితిక, September 18th, 2011, Andhra Bhoomi Daily


ఎన్నైనా చెప్పండి! మనకు స్పృహతక్కువే. సంస్కృతి గురించి, సాహిత్యం గురించి, సమాజం గురించి ఆట్టే పట్టించుకోం. మన భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైందో అందరికీ తెలుసు. ఎనె్నన్నో అద్భుతాలను నాటి శాస్తజ్ఞ్రులు ఆవిష్కరించారు. రాజులూ ప్రజలూ వాటినీ, వారినీ ఆదరించారు కూడా! భారతీయ ఖగోళ శాస్త్రంలో అలాటి ప్రాచీన ఖగోళ శాస్తజ్ఞ్రుల కృషి ఎంతో కనిపిస్తుంది. వాటిలో ఆర్యభట్టీయం, సిద్ధాంత శిరోమణి, బృహత్ సంహిత, సూర్యసిద్ధాంత, బ్రహ్మస్సుట, సిద్ధాంత, శిష్యాధివృధిడ వంటివెన్నో ఉన్నాయి. నేడు ఆధునిక ఖగోళ శాస్త్రంలో చెప్పే ఎన్నో సిద్ధాంతాలూ, అవీ వీటిలో కనిపించడం గమనార్హం. ఖగోళ రహస్యాలూ అవీ తెల్సుకోవాలీ అంటే, వాటికి తగినట్టు ప్రత్యేక సాధనాలు కావాలి. మరి భారతదేశం అంత ప్రాచీనం అంటారే? ఆ కాలంలో లేవా? ఉంటే ఏమయ్యాయి? ఆ సాధనాలూ, పనిముట్లూ, ఉపకరణాలూ ఏమైపోయాయి? అంటే ఉన్నారుూఅన్నదే సమాధానం!
అంటే అంతరిక్షం అనీ గోళఅంటే గోళాకారం అనీ అర్థం. రెండూ కలిసి ఖగోళమైంది. దానికి సంబంధించిందే ఖగోళ శాస్త్రం. ఆస్ట్రానమీ, అసలు ఖగోళఅనే పేరు అలనాడు ఆర్యభట్ట నెలకొల్పిన పరిశోధనశాల (అబ్జర్వేటరీ) పేరునుంచి వచ్చిందని కొందరి అభిప్రాయం. లల్లాఅనే అలనాటి ప్రఖ్యాత ఖగోళ శాస్తవ్రేత్త వ్రాసిన శిష్యాధివృధిడలో 12 ఖగోళ యంత్రాల గురించిన ప్రస్తావన ఉంది. అవే ‘‘గోళయంత్ర, భగఁయంత్ర, చక్రయంత్ర, ధనుష్‌యంత్ర, గతియంత్ర, శంఖుయంత్ర, శతక యంత్ర, కర్తరీయంత్ర, పితయంత్ర, కపాల యంత్ర, శలక యంత్ర, యష్థియంత్ర’’- అనేవి.
భాస్కరాచార్య అనే మరో శాస్తజ్ఞ్రుడు వ్రాసిన సిద్ధాంత శిరోమేయిఅనేది నాడీ వలయ యంత్ర, తదితర యంత్రాల గురించి చెబుతుంది. ఇవి గ్రహాల కదలికను లెక్కవేయడానికి, సమయాన్ని లెక్కగట్టడానికి పనికొచ్చేవి.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకూ? అంటారా? వీటి తర్వాత ఇప్పటికీ మనవాళ్ళందరూ చెప్పేది జంతర్‌మంతర్గురించి. దీని నిర్మాణం వెనక నాటి జైపూర్ మహారాజైన సవాయ్ యాన్‌సింగ్ -నిని కృషి ఎంతో ఉంది. 1724-27 ప్రాంతాల్లో దీనికి రూపకల్పన జరిగింది. ఈ జంతర్‌మంతర్ అనేది ఢిల్లీ, జైపూర్, మథుర, ఉజ్జయిని, వారణాసి నగరాల్లో 1728-34 సంవత్సరాల మధ్య ఏర్పాటైంది. వీటిలో మథురతప్ప మిగిలిన నగరాల్లో జంతర్‌మంతర్ ఇప్పటికీ సజీవంగా ఉంది. అన్నిటిలోకి జైపూర్‌లోని జంతర్‌మంతర్ ఇంకా పనిచేస్తూండేదశలోనే ఉండటం మన అదృష్టం.
నిజం చెప్పాలంటే, నాటి జైసింగ్ మహారాజు జైపూర్ నగరానే్న మహా అద్భుతంగా - అటు శిల్పశాస్త్రాన్నీ ఇటు ఖగోళ శాస్త్రాన్నీ కలబోసి నిర్మింపజేశాడు. ఆరోజుల్లో వుండిన కుల ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని నగరాన్ని దీర్ఘచతురస్రాకారంలో ఏడు పొరలుగా, ఒకదాని చుట్టూ, మరోటి ఉండేలాగా రూపొందించాడు. దీనిలో మధ్య ప్రదేశం నగరానికి నడిబొడ్డుగా నేటికీ నిలిచి ఉంది. ఇక్కడే రాజభవనాన్నీ, ఒక దేవాలయాన్నీ నిర్మింపజేశాడు.
అల్లాటప్పాగా ఏదో గుడి కట్టించడం కాదు. ఖగోళ శాస్త్రానుసారం గ్రహాల కదలికలను పట్టిచ్చే యంత్రాలతో ఒక సజీవ నక్షత్రశాలనే నిర్మింపజేశాడు. అదే జంతర్‌మంతర్అనేది. సంస్కృతంలో జంతర్‌మంతర్అంటే ఒక తమాషా సాధనంఅనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టారంటారు. ఎందరో ఖగోళ శాస్త్ర విద్యావేత్తలు, విద్యార్థులు ఇప్పటికీ జైపూర్ జంతర్‌మంతర్‌ను దర్శిస్తూంటారు. ఎందుకంటే జైపూర్ జంతర్‌మంతర్ ఇప్పటికీ పనిచేస్తూన్న ఖగోళశాస్త్రప్రయోగశాల కావడమే! ఢిల్లీ జంతర్‌మంతర్ ధర్నాలకూ, సభలకూ మారుపేరుగా చెబుతూంటారు, కానీ ఢిల్లీలో కన్నాట్ ప్లేస్‌కెళితే జంతర్‌మంతర్‌లో రామయంత్రలాటివి ఇప్పటికీ దర్శనమిస్తాయి. జంతర్‌మంతర్‌లో ఉన్న యంత్రాలను (టెలిస్కోప్ వచ్చి 130 ఏళ్ళ పైబడినా) ఇప్పటికీ వాడటం మరో విశేషం. మథురలో జంతర్‌మంతర్ అదృశ్యమైపోయింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ కుంచించుకుపోయింది. వారణాసి, ఉజ్జయినీ నగరాల్లోని జంతర్‌మంతర్ నిరుపయోగమైపోయాయి.
జైపూర్ కోటలోపలే ఉండటంవల్లా, దానిమీద మక్కువతోనైనా జంతర్‌మంతర్‌ను ప్రభుత్వాలు జాగ్రత్తగా చూసుకొనడంవల్ల మనకు ఈ నక్షత్రశాల మిగిలి ఉందని చెప్పాలి. 19వ శతాబ్దకాలంలో దీనికి మరమ్మత్తులు జరిగాయి కాబట్టే గాబోలు ఇప్పటికీ జైపూర్ జంతర్‌మంతర్ సజీవంగా ఉంది. ఇక్కడ రామయంత్రం, సామ్రాట్ యంత్రం, దక్షిణోభిట్టి యంత్రం, దిగంశ యంత్రం, రాశివలయ యంత్రం, జైప్రకాశ్ యంత్రం, షష్టాంశ యంత్రం, ఉన్నతాశ యంత్రం, నారి వలయ ఉత్తరగోళ యంత్రం అనే యంత్రాలున్నాయి. ఈ యంత్రాల పనితీరు, కొలతలు తీసుకొనే విధానం- అన్నీ వేర్వేరుగా ఉంటాయి.
వీటిలో రామ, సామ్రాట్, జైప్రకాశ యంత్రాల నిర్మాణాన్ని జైసింగ్ మహారాజే స్వయంగా దగ్గరుండి నిర్మింపజేశాడని అంటారు. షష్టాంశ యంత్ర (పుష్టమ యంత్ర అనీ అంటారు) అనేది సూర్యుడి వ్యాసాన్నికొలవడానికి వినియోగిస్తుంది. జైప్రకాశ యంత్రాన్ని వాడి రాత్రిపూట నక్షత్ర కూటమిని పరిశీలించవచ్చు. రామ యంత్రాన్ని వాడి ఖగోళ రాశుల కదలికలను కనిపెట్టొచ్చు.
జైప్రకాశ యంత్రాన్ని వాడి సూర్యుడి స్థానాన్ని కచ్చితంగా తెల్సుకోవచ్చు. పాలరాతితో నిర్మించిన అర్ధగోళాకారంగా ఉండే ఈ యంత్రం, నేలమీద 4 మీటర్ల వ్యాసం కలిగిన సాధనం. రాత్రిళ్ళు దీపం సాయంతో చూడొచ్చు. నక్షత్రాల స్థానాలను తెల్సుకోనూ వచ్చు. ఈ దీపం ఒక ట్యూబు (గొట్టం) లైటులా ఉంటుంది. దాన్ని పట్టుకొని మనలో ఒకరు నిల్చుకొంటే, ఇంకొకరు కొలతలు తీసుకోవచ్చు. జైప్రకాశ యంత్రంలో రెండు లోహపు అర్థగోళాలు ఉంటాయి. ఒకదానికి మరోటి కాంప్లిమెంటరీగా ఉంటాయి. వీటిని గంటల తేడాతో మార్చి మార్చి వాడుకోవచ్చు- అలా మొత్తం 24గంటలూ వాడుకోవచ్చు. పనె్నండు నక్షత్ర రాశులకూ తలా ఒక యంత్రాన్ని నిర్మింపజేశాడు జైసింగ్. వీటినే రాశి వలయ యంత్రాలని అంటారు. మీది తులారాశియైతే దానికి వేరేగా ఒక యంత్రం, వృశ్చిక రాశియైతే ఇంకోటి, మీనరాశియైతే మరోటి ఇలా 12 రాశులకూ 12 యంత్రాలున్నాయి. కోటమీద నుంచి కిందకి చూస్తే ఈ యంత్రాలన్నీ ముచ్చటగొలుపుతాయి చూడటానికి. అన్నట్టు ఈ యంత్రాలను రూపొందించడంలో జైసింగ్ మహారాజు 7 రకాల లోహాలను కలిపిన మిశ్రమాన్ని వాడాడనీ, అందుకే ఎక్కడా తుప్పుపట్టలేదు అనీ అంటారు. వీటిని ఖగోళశాస్త్ర యంత్రాలుగానే కాకుండా కళాత్మక దృష్టిలో కూడా చూడటానికి ఎంతో ఆనందాన్నిస్తాయి చూపరులకు. అన్నట్టు ఈ యంత్రాల నిర్మాణంలో ఎక్కువగా రాతినే వాడటం గమనించాలి. ఈజిప్ట్, దక్షిణ అమెరికాల్లాటి కొద్దిచోట్లలో తప్ప మరెక్కడా ఇలా జైపూర్‌లో లాగా రాతితో తయారైన యంత్రాలు కనిపించవు. విదేశీ విద్యార్థులు ఇప్పటికీ జైపూర్‌కొచ్చి కొద్దిరోజులు కేవలం జంతర్‌మంతర్‌లో గడిపి వెళ్తూంటారు. కేవలం అందాలు చూడ్డానికి కాదు. ఖగోళ శాస్త్ర విశేషాలు తెల్సుకోడానికి. ఇదంతా జైసింగ్ మహారాజు ఖగోళ శాస్త్రం అంటే మక్కువ చూపడంవల్లే జరుగుతోందిప్పటికీ. జైసింగ్ ఎక్కువగా ఖగోళశాస్త్రంపైనే దృష్టిపెట్టాడు. టోలెమీ, యూక్లిడ్, ఇతర పర్షియన్ శాస్తజ్ఞ్రుల గురించి తెలుసుకోవడం, వారి పరిశోధనల గురించి అధ్యయనం చేయడం- ఇవన్నీ జైసింగ్ దినచర్యలో భాగాలైనాయి. జైసింగ్‌పై భారతీయ ఖగోళ శాస్త్రంతోబాటు పర్షియన్, అరబిక్ ఖగోళ శాస్త్రాల ప్రభావమూ ఉందంటారు. కానీ పర్షియన్, అరబిక్ ఖగోళ శాస్తజ్ఞ్రులపైనే భారతీయ ఖగోళ శాస్త్రం అలనాడు ఎంతో ప్రభావాన్ని చూపింది. ఇంకో సంగతేంటంటే, అసలు ఢిల్లీలో జంతర్‌మంతర్నిర్మాణాన్ని అలనాటి చక్రవర్తి మహ్మద్ షా కోరిక మేరకు జైసింగే చేపట్టాడనీ, తద్వారా ఖగోళ శాస్త్ర పట్టికలు తయారుచేయించాలన్నదే నాటి చక్రవర్తి ఆలోచన అనీ అంటారు. 1724లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ రూపుదిద్దుకొంది. ఆ నిర్మాణం పూర్తిఅయ్యాక జైసింగ్ ఖగోళశాస్త్ర పట్టికలు రూపొందించి వాటిని మహ్మద్ షానీ పేరున పుస్తక రూపంలో వెలువరించాడు. దీని తర్వాతే జైపూర్ జంతర్‌మంతర్ రూపకల్పన జరిగింది.