Friday, February 17, 2012

భూమి అడుగు లోకం

22-02-2012 ఆదివారం ఆంధ్రభూమిలో కవర్ స్టోరీ....

మంచు కురిసే వేళలో, మనసు మురిసేనెందుకో.. అంటూ అద్భుతమైన దృశ్యాన్ని గీత రూపంలో ఆవిష్కరించారు సినీ కవి ఆచార్య ఆత్రేయ. అలా మంచు కురుస్తూ ఉంటే, ఆ చల్లని వేళలో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఐతే కొన్ని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేరకు ఎపుడూ మంచుతో కప్పబడితే? మంచు కురుస్తూ ఉంటే? ఈ భూగ్రహం మీద అలాంటి ప్రదేశం ఎక్కడుందంటారా? దక్షిణ ధృవాన అలాటి ప్రత్యేక ప్రదేశం ఉంది. అదే అంటార్కిటికా.
దాదాపు 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అంటార్కిటికా ప్రపంచ వాతావరణ, శీతోష్ణస్థితి గతుల మీద గొప్ప ప్రభావం చూపుతుంది. ఏ మాత్రం చెక్కుచెదరని అక్కడి పరిసరాలు, వాతావరణం పరిశోధకులకు ఎనె్నన్నో సంగతులను చెబుతున్నాయి. అంటార్కిటికా గురించి ఎన్నో దేశాలు పరిశోధనలు చేశాయి, చేస్తున్నాయి. అంటార్కిటికా నియంత్రణకై అంటార్కిటిక్ ట్రీటీ వ్యవస్థ ఉంది. మానవుడు తొలిసారిగా 1821 సం.లో ఈ అంటార్కిటికాపై అడుగెట్టినా, తొలిసారిగా దక్షిణ ధృవాన్ని చేరింది 1911లో, అంటే వందేళ్ల క్రిందటన్నమాట. సరిగ్గా మొన్న 14 డిసెంబర్ 2011 నాటికి వందేళ్లు పూర్తయింది.
ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే..
ప్రాచీన గ్రీకు శాస్తవ్రేత్తలు ఉత్తర ధృవాన్ని పోలిన మరో పెద్ద ప్రదేశం దక్షిణ భాగాన దక్షిణ ధృవంగా ఉండి ఉంటుందనీ, కాబట్టే భూగోళం బాలెన్స్ తప్పకుండా ఉందనీ భావించారు. ఎందుకంటే, దక్షిణ ధృవంకన్నా ముందే ఉత్తర ధృవాన్ని కనుగొన్నారు. అదే ఆర్కిటికా. ఇది ఉత్తర ధృవాన్ని చుట్టి ఉండే ప్రదేశం. ఐతే, దక్షిణ ధృవాన్ని కనుగొన్న వారు ఎవరూ లేరు. దక్షిణ ధృవం అనేదొక భావనగా మాత్రమే మిగిలిపోయింది. కెప్టెన్ జేమ్స్ కుక్ (1728-79) గొప్ప నాయకుడు. ఇతని గురించి తెలీనివారుండరు. ఇతడు పసిఫిక్, అంటార్కిటిక్ ప్రదేశాలను శోధించినవారు. అంటార్కిటికా లేదా దక్షిణ ధృవాన్ని తొలిసారిగా చుట్టి వచ్చాడు. ఆ సమయంలో అతను చూచిన అంటార్కిటికా ప్రదేశాల సీల్స్, వేల్స్ హెచ్చు సంఖ్యలో ఉన్నాయని తన రికార్డుల్లో రాశాడు. అదే సీల్స్, వేల్స్ చేపలను వేటాడే వారికి దక్షిణ ధృవం వైపు వెళ్లేందుకు పురిగొల్పింది. అనేక దేశాల వారు దక్షిణ మహాసముద్రం చుట్టూ తిరుగనారంభించారు. 1820 సం.లో కెప్టెన్ బెల్లింగ్ షాసెన్ అనే నావికునితో పాటు మరో రెండొందల మంది నావికులతో అంటార్కిటికా వేపు పంపింది నాటి సోవియట్ రష్యా ప్రభుత్వం. 1820 జనవరి 27నాడు, తొలిసారిగా అంటార్కిటికా పైని దూరపు కొండలు మానవుడి కంటపడింది. అలా బెల్లింగ్ షాసెన్ అంటార్కిటికాను చూసిన తొలి మానవుడిగా నిలిచిపోయాడు. (ఇది జరిగి నేటికి 191 సంవత్సరాలైంది). ఆ తర్వాత కెప్టెన్ జేమ్స్ వెడ్డెల్ అనే బ్రిటీష్ నావికుడు 1820, 21, 22 సంవత్సరాల్లో దక్షిణ ధృవం తాలూకు పరిశోధనల్లో గణనీయమైన అనుభవాన్ని సంపాదించాడు. 1823లో ఫిబ్రవరి 20న అంతకు ముందు దక్షిణంగా ఏ మానవుడూ వెళ్లలేనంత దూరం వెళ్లగలిగాడు. 1840 ప్రాంతాల్లో బ్రిటీష్, ఫ్రెంచ్, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాలు అంటార్కిటికా పరిశోధనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఫ్రాన్స్ దేశం కెప్టెన్ జూల్స్ సెబాస్టియన్ డ్యువౌంట్ డి ఉర్విల్లి నాయకత్వాన ఒక ఓడను పంపింది. అమెరికా కెప్టెన్ ఛార్లెస్ విల్క్స్ నాయకత్వాన ఒక ఓడను పంపితే, బ్రిటీష్ కెప్టెన్ జేమ్స్ క్లార్క్ రాస్ సారథ్యంలో ఒక ఓడను పంపింది. ఈ ముగ్గురూ అంటార్కిటికాలోని మూడు వేర్వేరు భాగాల వేపు కేంద్రీకరించారు. చివరికి అదొక పెద్ద ఖండంగా నిర్ధారించగలిగారు.
జేమ్స్ రాస్‌కు దక్షిణ ధృవంకనుక్కొనే పనిని అప్పగించారు. ఎందుకంటే, 1831లోనే అతను ఉత్తర ధృవాన్ని కనుక్కొన్నాడు. ఆ అనుభవం, నమ్మకం, విజయం అతనిని దక్షిణ ధృవాన్ని కనుగొనే పనికి పురమాయించాయని చెప్పాలి. దక్షిణ ధృవాన్ని కనుక్కొనే దిశగా అతడు తన అనే్వషణలో ఒక మంచు షెల్ఫ్ వల్ల ముందుకు సాగలేక పోయాడు. (దానే్న తొలుత విక్టోరియా బ్యారియర్అన్నారు. కానీ ఆ తర్వాత రాస్ పేరున పునర్నామకరణం చేశారు.) ఐతే దక్షిణ ధృవం చేరడం ఒక ఛాలెంజ్‌గానే మిగిలిపోయింది. 1902 సం.లో టెర్రానోవాఅనే పేరుతో ఒక ఓడను తీసుకొని బ్రిటీష్ నావికుడు కెప్టెన్ ఆర్.ఎఫ్.స్కాట్ (రాబర్ట్ ఫాల్కన్ స్కాట్) బయల్దేరాడు. విజయపుటంచుల్లో కేవలం 800 కి.మీ.ల దూరం ఉండగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎందుకంటే, ఆయన బృందంలోని వారంతా విటమిన్ సిలోపంతో బాధపడటం ఆరంభించారు. ఆయన వెంట తీసుకెళ్లిన కుక్కలకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. టీంలో ప్రధాన సభ్యులు ముగ్గురు షాకెల్‌టన్, విల్సన్, స్కాట్. ముగ్గురూ దాదాపు చనిపోయే స్థితికి వెళ్లారు. అది నిజంగా వారి దురదృష్టమనే చెప్పాలి.
ఐతే, షాకెల్‌టన్ తన స్వదేశానికి తిరిగి వచ్చాక, తిరిగి దక్షిణ ధృవ ప్రయాణానికి సన్నాహాలు చేయనారంభించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత, అంటే 1908 సం.లో టెర్రానోవాకన్నా మెరుగైన ఓడలో బయల్దేరాడు. ఐతే, షాకెల్‌టన్‌ని దురదృష్టం వదల్లేదు. దక్షిణ ధృవానికి కేవలం 180 కి.మీ. దూరంలో ఉండగా తానూ, తన సభ్యులూ తీవ్ర అనారోగ్యం పాలవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. రాబర్ట్ స్కాట్ నవంబర్ 1910లో తిరిగి దక్షిణ ధృవ యాత్ర ఆరంభించాడు. అయితే, అంతకన్నా ముందే నార్వే దేశానికి చెందిన నావికుడైన రోల్డ్ అముండ్సేన్ తన జట్టుతో పటిష్టమైన ప్రణాళికతో బయల్దేరాడు. 1911 డిసెంబర్ 14వ తేదీనాడు దక్షిణ ధృవం చేరాడు.
దక్షిణ ధృవాన్ని చేరినందుకు గుర్తుగా నార్వీజియన్ పతాకం ఎగురవేశారు. ఇంతలో రాబర్ట్ స్కాట్ తన జట్టుతో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని దక్షిణ ధృవం చేరాడు. ఐతే, వారు జనవరి 17, 1912 నాడు చేరారక్కడికి. అప్పటికే అక్కడ నార్వీజియన్ పతాకం ఎగరడం వారి కంట పడటంతో, విజయోత్సాహం చప్పగా చల్లారిపోయింది. తన నిరాశా నిస్పృహలను తన డైరీలో ఇలా రాసుకున్నాడు స్కాట్:
"This told us the whole story. The Norwegians have forestalled us and are first at the pole. It is a terrible disappointment and I am very sorry for my loyal companions...'

ఐతే, అప్పటికే వారు తమతో తీసుకెళ్లిన ఆహార పదార్థాల్లో కొరతను గుర్తించారు. అది 21 మార్చి 1911. తినడానికి ఏమీ లేదు. 29 మార్చి నాటి డైరీలో స్కాట్ ఇలా రాసుకొన్నాడు:There havebeen nothing to eat for the past 3 days. Now, I am not even able to write. End is not far. For God's sake, take care of our families.'
అలా వీరోచితమైన స్కాట్ యాత్ర విజయపతాకాన్ని ఎగురవేసినా విషాదాన్ని మిగిల్చింది. ఈ వీరోచిత అంటార్కిటిక్ గాథ అక్కడితో ముగిసిపోలేదు. 1914 ఆగస్టు 8న ఎర్నెస్ట్ షాకిల్‌టన్ వెడ్డెల్ సముద్రం వేపు నించి అంటార్కిటికా చేరాలని మరో యాత్ర ఆరంభించాడు. ఐతే, వెడ్డెల్ సముద్రంలో మంచులో ఇరుక్కుపోయాడు. అతను తీసుకెళ్లిన ఎండ్యూరెన్స్ఓడ 1915 నవంబర్ 21నాడు సముద్రంలో మునిగిపోయింది. షాకిల్‌టన్ ప్రభృతులు లైఫ్ బోట్స్‌తో ఎలాగో చివరికి బైటపడ్డారు. అంటార్కిటికా యాత్రలకు అక్కడితో కొంత విరామం కలిగింది.
కాలక్రమంలో టెక్నాలజీ తోడవడంవల్లా, శక్తివంతమైన ఇంజన్లూ, రేడియో, ఏరోప్లేన్, శాటిలైట్ సౌకర్యాలూ రావడం వల్ల అంటార్కిటికా యాత్రలపై ఆశలు చిగురించాయి. సర్ హబెర్ట్ విల్కిన్స్ తొలిసారిగా విమానంలో 16 నవంబర్ 1928 నాడు అంటార్కిటికా చేరాడు. గ్రాహంల్యాండ్ మీదుగా వెళ్లి అంటార్కిటికా చేరాడు. దీని తర్వాత అంటార్కిటికా పరిశోధకులకూ, నావికులకూ నిరాశ కలగలేదు.
ఇంతకీ అంటార్కిటికా ఎవరిది?
19
వ శతాబ్దం ముందు దాకా ఏ దేశం వాళ్లు కొత్తగా ఒక ఖండాన్ని గానీ, ప్రదేశాన్ని గానీ చూస్తే, వారి దేశం జెండా పాతేసి, దానిని తమ దేశపు ఆస్తిగానే ప్రకటించేవారు. 1908లో బ్రిటిష్ వాళ్లు చేసిందీ అదే. ఐతే 1923లో కొంత భాగాన్ని న్యూజిలాండ్‌కు (Ross dependencies) దక్కేలా చేసింది బ్రిటన్. 1924లో టెర్రెఎడ్లీమీద ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని ప్రకటించింది. 1933లో ఆస్ట్రేలియా కూడా తన వంతు ప్రదేశాన్ని చాటింది. 1931 జనవరిలో నార్వే డ్రోన్నింగ్ మాడ్‌ల్యాండ్ (Dronning Maud Land) మీధ తన ఆధిపత్యాన్ని చాటింది. ఇలా ఆ మంచు ఖండాన్ని ముక్కలు ముక్కలుగా పలు దేశాలు తమదంటే తమదని ప్రకటించుకొన్నాయి. 1940లో చిలీ దేశం కూడా తన వంతు స్థలం తనకివ్వాలని చెప్పింది. ఈ స్థలమే బ్రిటన్, అర్జెంటీనా దేశాలూ తమదంటూ చెప్పాయి. మనుష్యులే లేని ఆ ఖండం కోసం దేశాలు కొట్లాడుకొంటున్నాయా? అనిపిస్తుంది. నిజానికి అమెరికా దేశానికి అంటార్కిటికా మీద ఎలాటి క్లెయిమూ లేకపోయినా, ఇలా వివిధ దేశాలు నాదంటే నాదని వాదులాడుకోవడంతో 1939లోనే యుఎస్ అంటార్కిటిక్ సర్వీస్‌ను ఏర్పాటు చేసి, అంటార్కిటికా అనే్వషణ ఆరంభించింది. దాంతో మిగిలిన దేశాలూ అమెరికాను అనుసరించాయి.1955వ సంవత్సరం. అంతర్జాతీయ భూ భౌతిక సంవత్సరం ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆ ఏడు 13 ఓడలు అంటార్కిటికా పరిశోధనలకై బయల్దేరి వెళ్లాయి. 1956 సంవత్సరం చలికాలం పూర్తయ్యేసరికి మొత్తం 29 బృందాలు అంటార్కిటికాపై చేరాయి. ఈ బృందాలు బ్రిటన్, చిలీ, అర్జెంటీనా, ఫ్రెంచ్, అమెరికా, ఆస్ట్రేలియా, సోవియట్ రష్యాలకు చెందినవి. మొత్తం మీద 508 మంది ఆ సుదీర్ఘమైన చలికాలంలో అక్కడ ఉండటానికి ప్రణాళికలు వేసుకొన్నారు. 1956-57 దాకా ఈ కార్యక్రమ సన్నాహాలు సాగాయి. మరో 13 స్టేషన్లు అక్కడ ఏర్పాటయ్యాయి. మొత్తానికి 42 స్థావరాలు అంటార్కిటికాలో వెలిశాయి. ఇవి 12 ప్రపంచ దేశాలకు (బెల్జియం, నార్వే, న్యూజిలాండ్, జపాన్, సౌత్ ఆఫ్రికా దేశాలు చేరాయి) చెందినవి. మరో 21 ఐలాండ్ స్థావరాలు ఏర్పాటయ్యాయి. 1956057 వేసవి నాటికి 42 స్థావరాలూ దాదాపు 6167 మందికి ఆశ్రయాన్నిచ్చాయి. 1957-58లో 44 కాంటినెంటల్ స్థావరాలు, 21 ఐలాండ్ స్థావరాలు దాదాపు 5362 మందికి ఆశ్రయాన్నిచ్చి పరిశోధనలు సాగించే సౌకర్యాలు కలిగించాయి. జూన్ 1957 నుంచి డిసెంబర్ 1958 దాకా ఉండే కాలాన్ని అంతర్జాతీయ భూ భౌతిక సంవత్సరంగా నిర్ణయించారు. దానిని ప్రతిపాదించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్స్ (ఐసిఎస్‌యు), ఆ అంతర్జాతీయ భూ భౌతిక సంవత్సరంలో చవి చూసిన విజయాలను చూసి, అంటార్కిటిక్ పరిశోధనలకై అంతర్జాతీయంగా ఒక శాస్ర్తియ బృందాన్ని సైంటిఫిక్ కమిటీ ఆన్ అంటార్కిటిక్ రీసెర్చ్ (ఎస్‌సిఎఆర్) అనే పేరుతో ఏర్పాటు చేసింది. 1959లో అలా వివిధ దేశాలు సంతకాలు చేసి అంటార్కిటిక్ ఒప్పందాన్ని (అంటార్కిటిక్ ట్రీట్స్) ఏర్పాటు చేసింది. దాని ప్రకారం అంటార్కిటికా మంచు ఖండం మీద అన్ని దేశాలూ సమానంగా పరిశోధనలు చేసే వీలు ఏర్పడింది.
మిస్టరీ! మిస్టరీ!
ఈ భూగోళాన్ని అనే్వషించడంలో చివరి ఘట్టం అంటార్కిటికా’. ఆ మంచు ఖండానికి ఇంగ్లీషులో "Last wilderness of our earth' అని అంటారు వైజ్ఞానికులు. అత్యంత మందమైన మంచు దుప్పటితో కప్పిన అతి పెద్ద మంచు ఖండం ఇది. ఇది 14 మిలియన్ల చదరపు విస్తీర్ణం కలిగి ఉంటే, అందులో 5 లక్షల చ.కి.మీ. పైబడిన విస్తీర్ణం మంచుతో కప్పేసి ఉంది. ఇక్కడ శాశ్వత నివాసాలున్న దాఖలాల్లేవు. ఐతే 45 రకాల పక్షి జాతులున్నాయంటారు. ఇక్కడ అంతా విచిత్రమే. 21 సెప్టెంబర్ నుంచి 22 మార్చి దాకా మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. తిరిగి 22 మార్చి తర్వాత 21వ తేదీ సెప్టెంబర్ దాకా అంటార్కిటికా పూర్తిగా అంధకారంలో ఉంటుంది. ఎందుకంటే, ఆ సమయంలో సూర్యుడు ఈవేపు కనె్నత్తి చూడడు.
ప్రపంచ తాజా జల పరిమాణంలో 70% ఇక్కడే ఉంది. అలాగే, ప్రపంచంలోని మంచులో 90% ఇక్కడే ఉంది. ఇక్కడెనె్నన్నో సహజ వనరులున్నాయన్నది శాస్తవ్రేత్తల నమ్మకం. అందుకే ప్రపంచ శాస్తవ్రేత్తలు ఈ ఖండాన్ని తమ అనే్వషణాయుత శాస్ర్తియ ప్రయోగాలకూ, పరిశోధనలకూ కేంద్రం చేసుకున్నారు.
అంటార్కిటికా ఖండం మన భూమీద ఉండే అనేక రహస్యాలకు సంబంధించిన జఠిల ప్రశ్నలకు సమాధానాలిస్తుందని వీరంతా నమ్ముతున్నారు. ఈ గడ్డ కట్టిపోయిన మంచు ఖండం గతంలో ఖండాల మధ్య దూరం పెరగడానికి గల కారణాలనూ చెప్పగలదంటున్నారు. నేటి గ్లోబల్ వాతావరణ పరిస్థితుల తీరుతెన్నుకూ, నియంత్రణకు సమాధానం ఈ మంచు ఖండం చెప్పగలదని భావిస్తున్నారు. అసలు అంటార్కిటికా కేవలం ఒక శాస్త్ర పరిశోధనా అంశం మాత్రమే కాదు. అది భూ వ్యవస్థకే కీలకమైన అంశం. ఓజోన్ పొర గురించిన రహస్యాలే కాదు, గత చరిత్రలో జరిగిన పలు ఘటనలకి ఈ మంచుఖండం సాక్ష్యం. పెంగ్విన్‌లు, సీల్, వేల్స్ వంటి జంతువులు ఇక్కడున్నాయి. ఇవన్నీ అక్కడ ఎలా మనగల్గుతున్నాయనే రహస్యాలూ పరిశోధనాంశాలే.
ఎటు చూసినా మంచే. ఎటు చూసినా ఐసు ముక్కలే. అసలు ఈ భూమీద ఉండే అతి పెద్దవైన ఏడు ఖండాల్లో ఐదో ఖండం అంటార్కిటికా. ఇక్కడ మంచు దుప్పటి లేదా ఐస్‌షీట్స్ వేల, వందల సంవత్సరాల నించి పోగైన మంచు ద్వారా ఏర్పడ్డవే. భౌతిక మార్పులు కలిగే కొద్దీ ఈ ఐస్ షీట్స్ కదుల్తూంటాయి. అంటార్కిటికా ఖండం కొసల్లో కదిలే ఐస్‌లతో నదులు ఉన్నాయి. వీటినే ఐస్ గ్లేషియర్స్ అంటారు. తీర ప్రాంతాల్లో ఐస్ షెల్ఫ్‌లు ఏర్పడి ఉన్నాయి. అంటే సముద్రంపై తేలే ఐస్ తెప్పల్లాటివన్నమాట. షట్భుజి రూపంలో ఉండే మంచు ముక్కలు ఇక్కడి స్పెషాలిటీగా భావిస్తారంతా. ఇక్కడ ఐస్ నీలిరంగులో కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనే్న బ్లూ ఐస్అంటారు.
మరి ఇలాంటి విచిత్రమైన మంచు ఖండంపై జంతు, పక్షు జాతులెలా బతుకుతున్నాయనేది అంతుబట్టని విషయమే. ఇక్కడ సీల్స్, వేల్స్, పెంగ్విన్స్ మాత్రమే కాదు. స్కువా, అల్‌బెట్రాస్, స్నోపెట్రెల్ వంటి పక్షులూ వెరసి 45 రకాలున్నాయి.
పెంగ్విన్‌లలో కూడా ఎంపెరర్ పెంగ్విన్, మాకరొని పెంగ్విన్, అదెల్లి పెంగ్విన్, జెంటూ పెంగ్విన్, ఛిన్‌స్ట్రాప్ పెంగ్విన్ అనే రకాలున్నాయి. సీల్స్‌లో క్రాబీటర్స్, ఫర్‌సీల్స్, లెపర్డ్ సీల్స్, వెడ్డెల్ సీల్స్, ఎలిఫెంట్ సీల్స్ అని పలు రకాలున్నాయి. మంచు ఖండంలో చెట్లూ చేమా ఆట్టే ఏమీ లేదు గానీ ఇక్కడ ప్రధానంగా రెండు పూల జాతుల మొక్కలున్నాయి. అవే అంటార్కిటికా హేర్‌గ్రాస్, పెర్ల్‌వార్ట్ అనేవి. పశ్చిమ ప్రాంతంలో దాదాపు 300 నించి 400 రకాల ఫంగై జాతులున్నాయి. అదీ కొద్దిపాటి వెచ్చని ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఓజోన్ రంధ్రం ఎక్కడుంది?
మూడు పరమాణువుల ఆక్సిజన్ వాయువు కల్గిన అణు రూపాన్ని ఓజోన్అంటారు. సాధారణ ఆక్సిజన్ అణువులో రెండు పరమాణువులే ఉంటాయి కదా. ఓజోన్ చూడటానికి నీలిరంగులో ఉంటుంది. ఐతే, దీన్ని గనక పీలిస్తే మన పని ఇంతే సంగతులు. ఇది ముఖ్యంగా ఆస్మా రోగులకు, ఊపిరితిత్తుల సమస్యలున్నవారికీ ప్రమాదకారి. ఇది రసాయన చర్యల పరంగా యమా యాక్టివ్‌గా పనే్జస్తుంది కూడా. ఓజోన్ అల్ట్రా వయొలెట్ (అతి నీలలోహిత) కిరణాలను పీల్చుకోగలదు. 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉండే మన వాతావరణంలో ఓజోన్ సహజంగానే ఏర్పడ్తుంది. 1974లో అమెరికా సైంటిస్టులు క్లోరోఫ్యూరో కార్బన్ (సిఎఫ్‌సి) అనేది ఓజోన్ పొరకు హాని కల్గిస్తోందని కనిపెట్టారు. ఓజోన్ పొరలో రంధ్రం అనేది అంటార్కిటికా ప్రాంతం పైభాగాన ఉందని 1985లో శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. దీన్ని కనుక్కోవడంలో బ్రిటీష్ శాస్తజ్ఞ్రుల పాత్ర ఎంతో ఉంది. మరి అంటార్కిటికా పైన ఓజోన్ పొర ఉన్న ప్రదేశాలలోనే ఎందుకు ఈ రంధ్రం ఏర్పడిందీ అనేది తెలీక, బహుశా అంటార్కిటికాలోని పరిశోధనా కేంద్రంలోని పనిముట్లలో లోపం కారణంగా అలాంటి పరీక్షా ఫలితాలొచ్చేయేమోనని, ఆ పనిముట్ల స్థానే కొత్తవాటిని అమర్చినా అవే ఫలితాలు వచ్చాయి. దాంతో అంటార్కిటికాలో జరిగిన పరిశోధనల ఫలితాలు కరెక్టేనని తేలాయి. ఓజోన్ రంధ్రాన్ని ఎలా పూడ్చాలనేదే ఇపుడున్న ప్రశ్న.
మరి ఆర్కిటికా (ఉత్తర ధృవం)లో ఎందుకు ఓజోన్ రంధ్రం ఏర్పడలేదనే సందేహం కల్గడం సహజం. అక్కడ అంటార్కిటికాలోని పరిస్థితులు లేవు. అక్కడి మేఘాలు ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడనీయడం లేదు. ఉష్ణోగ్రతల్లో తేడా మరో కారణం. ఈ ఓజోన్ పొరల్లో రంధ్రం అనేది పోలార్ రాత్రుల సమయంలో ఉష్ణోగ్రత - 100 డిగ్రీల సెల్సియస్ లేదా అంత కన్నా తక్కువకు పడిపోయినపుడే ఏర్పడే అవకాశాలు బలపడతాయి. ప్రతీ ఏడాది సెప్టెంబర్ ప్రాంతాల్లో అంటార్కిటికాపై ఐస్‌తో కూడిన మేఘాలు కదలిపోవడం, అదే సమయంలో అక్కడ సూర్యుడు రావడం దానికి ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి వెదజల్లే - సిఎఫ్‌సి తోడవడం - వీటివల్ల ఓజోన్ పొరకు ముప్పు ఏర్పడుతోంది.
భారతీయ ప్రస్థానం ఎలా మొదలైందీ?
మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశం అంటార్కిటికా యాత్రలు ఆలస్యంగానే మొదలెట్టింది. అది 1981 డిసెంబర్ నెల. తొలిసారిగా భారతదేశం తన దేశ శాస్తజ్ఞ్రుల బృందాన్ని అంటార్కిటికా యాత్రకు బయల్దేరదీసింది. దీనికి డా.ఎస్.జె.ఖాసిమ్ అనే ప్రముఖ శాస్తవ్రేత్త సారధ్యం వహించారు. వీరి బృందంలో 21 మంది ఉండగా, వారిలో 13 మంది శాస్తజ్ఞ్రులు. ఈ బృందంలో డా.పి.సి.ఓరా (గ్లేషియాలజిస్ట్), డా.హెచ్.ఎన్.సిద్దిక్ (ఓషనోగ్రఫీ) వంటి సుప్రసిద్ధులున్నారు. వీరి ఓడ ఎం.వి.పోలార్ సర్కిల్గోవా నుంచి బయల్దేరి 1982 జనవరికి అంటార్కిటికా చేరింది. 9వ తే జనవరి, 1982 నాడు భారతీయ అంటార్కిటికా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని తర్వాత వెనువెంటనే డిసెంబర్ 1982, 1వ తేదీనాడు అదే పోలార్ సర్కిల్ ఓడలో వి.కె.రైనా సారధ్యంలో 28 మంది సభ్యుల బృందం అంటార్కిటికా యాత్ర చేసింది. ఈ రెండు యాత్రలు దిగ్విజయం కావడమేకాక, భారతీయ శాస్తవ్రేత్తలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దీంతో అంటార్కిటికా ఖండం మీద భారతదేశం తన శాశ్వత ప్రాతిపదికపై ప్రయోగశాలను ఏర్పాటు చేయాలనీ, తద్వారా పరిశోధనలు కొనసాగించాలనీ నిశ్చయించింది. 1983లో డా.హర్ష్‌గుప్తా (హెచ్.కె.గుప్త) అనే ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్ర సైంటిస్ట్ ఆధ్వర్యంలో 81 మంది సభ్యులు అంటార్కిటికా యాత్ర చేసి అక్కడ శాశ్వత ప్రాతిపదిక మీద ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరే దక్షిణ గంగోత్రి’. దీనిని రికార్డు టైంలో నిర్మించడం మరో విశేషం. ఐదేళ్లు నిర్విరామంగా శాస్తవ్రేత్తలకు ఆశ్రయమిచ్చిన గంగోత్రి ఉండే ప్రదేశంలోని మంచు కరిగిపోవడంతో 1988కెల్లా భారతదేశం మరో కేంద్రాన్ని నిర్మించ నారంభించింది. ఎందుకంటే, దక్షిణ గంగోత్రి కేంద్రం ఉండే ప్రదేశం క్షేమకరం కాదని భావించారు. 1989-90 ప్రాంతానికి ఈ రెండో కేంద్రం పని చేయనారంభించింది. దాని పేరే మైత్రి’. మైత్రికేంద్రాన్ని ఐస్‌లేని ప్రాంతంలో స్కిర్మచెర్ ఒయాసిస్ అనే ప్రాంతంలో నిర్మించారు. దీన్ని నిర్మించడానికి రెండు అంటార్కిటికా వేసవి కాలాలు పట్టింది. అంటార్కిటికా చలికాలంలో సూర్యుడు కనిపించడు కాబట్టి ఆ సమయంలో అంటార్కిటికా పూర్తి అంధకారంలో ఉంటుంది. అందుచేత ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలూ చేయలేరెవ్వరూ. 1989-90 నాటికి దక్షిణ గంగోత్రి నించి మైత్రికేంద్రానికి అన్ని లేబొరేటరీలనూ, సామాగ్రినీ చేరవేసి, మైత్రి కేంద్రాన్ని పూర్తిగా పనిచేసే స్థాయికి తెచ్చారు.
2005
నాటికి, మైత్రి కేంద్రానికి అతి సమీపంగా విమానాలు దిగేలాగా రన్‌వేను రూపొందించారు. దీంతో చిన్న ట్రిప్‌లు కొట్టడానికి శాస్తజ్ఞ్రులకే కాదు. మంత్రులకూ, ఇతరులకూ కూడా అవకాశం ఏర్పడింది. 2005, 2007 సంవత్సరాల్లో కేంద్ర మంత్రులు, కార్యదర్శులూ వెళ్లి వచ్చారు కూడా. అన్నట్టు అంటార్కిటికాలోని లార్స్‌మన్ హిల్స్ దగ్గర మరో స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది మన దేశం. ఈ భాగం 120 మిలియన్ సంవత్సరాల క్రితం భారత తూర్పు తీరానికి దగ్గరగా ఉండేది. ఇది మైత్రి కేంద్రం నించి 2000 కి.మీ. దూరంలో ఉంది.
2012
లో పూర్తి స్థాయిలో పని చేయనారంభించనుందీ కేంద్రం. దీనికి ్భరతిఅని పేరు పెట్టారు. ఈ ్భరతికేంద్రం లక్ష్యాన్ని సాధిస్తే, భారతదేశం టాప్ 9 దేశాల్లో మరొక దేశంగా చేరుతుంది. ఈ దేశాలకు 3 అంతకుమించి కేంద్రాలున్నాయి. ్భరతికేంద్రం లక్ష్యం నెరవేరితే, 120 మిలియన్ సంవత్సరాల పూర్వపు చరిత్ర, మిస్టరీ అన్నీ వెల్లడవుతాయి.
*

=====

అంటార్కిటికా విశేషాలు
*
అంటార్కిటికా విస్తీర్ణం - 1,38,29,430 చ.కి.మీ.
*
అంటార్కిటికా అమెరికాకన్నా 1.39 రెట్లు పెద్దది.
*
అంటార్కిటికాలో మంచు కప్పబడిన విస్తీర్ణం - 5,10,680 చ.కి.మీ. ఇది ఫ్రాన్స్ దేశ విస్తీర్ణంతో సమానం.
*
అతి తక్కువ ఉష్ణోగ్రత (నమోదైంది) - మైనస్ 89.2 డిగ్రీల సెల్సియస్.
*
మంచు దుప్పటి సగటు మందం 1,829 మీ. గరిష్టం 5 కి.మీ.
*
ప్రపంచ తాజా జలం మొత్తంలో 70% ఇక్కడే ఉంది.
*
ప్రపంచంలోని మంచులో 90% ఇక్కడే ఉంది.
*
మంచులేని వైశాల్యం కేవలం 2% అంటే 2,80,000 చ.కి.మీ.
*
గరిష్టంగా నమోదైన గాలి వేగం - 248.4 కి.మీ. (గంటకు)
*
తొలిసారి అంటార్కిటికాను మానవుడు తెలుసుకొంది - 1821 సం.లో
*
తొలిసారి చలికాలంలో మానవుడు చూసింది - 1898 సం.లో
*
తొలిసారి దక్షిణ ధృవాన్ని చేరింది - 1911 సం.లో
*
ఇక్కడ శాశ్వత నివాసాల్లేవు. శాశ్వత జనాభా లేదు.
*
వేసవిలో 4000 వైజ్ఞానిక బృందాలు, చలికాలంలో 1000 బృందాలు ఉంటాయి.
*
వేసవి సగటు యాత్రికుల సంఖ్య 25000.
*
అంటార్కిటికాలో ఉండే మంచును మొత్తానికి కరిగిస్తే, ప్రపంచ సముద్రాల్లో నీటి మట్టాలు 60 నుంచి 65 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
*
ఇక్కడ 21 సెప్టెంబర్ నుంచి, 22 మార్చి దాకా మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. అదే అక్కడ వేసవి.
* 22
మార్చి నుంచి 21 సెప్టెంబర్ దాకా ఈ ఖండం అంధకారంలో ఉంటుంది. అదే అక్కడ చలికాలం.
*
అంటార్కిటికా ఖండానికీ, ఇండియాకీ మధ్య దూరం ఎంతో తెలుసా?
8055.2
మైళ్లు (12963.59 కి.మీ.)
*
దక్షిణ ధృవంలో నిజంగానే ఒక స్తంభం ఉంది. ఇది ఏడాదికి 10 మీటర్ల ఐస్ చొప్పున కదుల్తుంది. ప్రతి ఏడాదీ దాన్ని తిరిగి యధాస్థానానికి తెచ్చి నిలబెట్టాల్సిందే!
*
ఏకాకిగా అంటార్కిటికాను దాటిన తొలి నావికుడు బోర్జ్ ఔస్‌లాండ్. 1997లో ఈ రికార్డుని నెలకొల్పిన ఈ ఔస్‌లాండ్ కూడా నార్వే దేశానికి చెందినవాడు కావడం విశేషం.

======================

అంటార్కిటికాపై భారతీయ పరిశోధనా కార్యక్రమాలు

అంటార్కిటికాపై భారతీయ పరిశోధనా కార్యక్రమాలు ఇప్పటికి 30 జరిగాయి. వీటిలో పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రీఫీ, ఇండియన్ మెటీరలాజికల్ ఇనిస్టిట్యూట్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నౌకా దళం, వాయుసేన, డీఆర్‌డీఓ వంటి ప్రముఖ భారతీయ పరిశోధనా సంస్థల నుంచి పలువురు అధికారులు, శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బయల్దేరిన తేదీ ఓడ పేరు టీం నాయకుడు జట్టు సభ్యుల సంఖ్య

1. 6 డిసెంబర్ 1981 ఎం.వి.పోలార్ సర్కిల్ డా.ఎస్.జెడ్.ఖాసిమ్ 21 (శాస్తవ్రేత్తలు -13)
2. 1
డిసెంబర్ 1982 ఎం.వి.పోలార్ సర్కిల్ వి.కె.రైనా 28 (శాస్తవ్రేత్తలు -12)
3. 3
డిసెంబర్ 1983 ఎం.వి.్ఫన్ పోలారిస్ డా.హెచ్.కె.గుప్తా 81 (శాస్తవ్రేత్తలు -15)
4. 4
డిసెంబర్ 1984 ఎం.వి.్ఫన్ పోలారిస్ డా.బి.్భట్టాచార్య 83 (శాస్తవ్రేత్తలు -20)
5. 13
నవంబర్ 1985 ఎం.వి.్థలేలాండ్ ఎం.కె.కౌల్ 88 (శాస్తవ్రేత్తలు -24)
6. 26
నవంబర్ 1986 ఎం.వి.్థలేలాండ్ డా.ఎ.హెచ్.పరులేకర్ 90 (శాస్తవ్రేత్తలు -24)
7. 25
నవంబర్ 1987 ఎం.వి.్థలేలాండ్ డా.ఆర్.సేన్ గుప్తా 92 (శాస్తవ్రేత్తలు -25)
8. 29
నవంబర్ 1988 ఎం.వి.్థలేలాండ్ డా.ఎ.సేన్‌గుప్తా 100 (శాస్తవ్రేత్తలు -16)
9. 13
నవంబర్ 1989 ఎం.వి.్థలేలాండ్ రసిక్ రవీంద్ర 82 (శాస్తవ్రేత్తలు -28)
10. 27
నవంబర్ 1990 ఎం.వి.్థలేలాండ్ డా.ఎ.కె.హంజూరా 100 (శాస్తవ్రేత్తలు -30)
11. 27
నవంబర్ 1991 ఎం.వి.్థలేలాండ్ డా.ఎస్.ముఖర్జీ 98 (శాస్తవ్రేత్తలు -30)
12. 5
డిసెంబర్ 1992 ఎం.వి.్థలేలాండ్ వి.కె.్ధర్గల్కర్ 56 (శాస్తవ్రేత్తలు -16)
13. 8
డిసెంబర్ 1993 ఎం.వి.స్ట్ఫెన్-కృశ్నికోవ్ డా.జి.సుధాకరరావు 58 (శాస్తవ్రేత్తలు -23)
14. 17
డిసెంబర్ 1994 ఎం.వి.పోలార్ బర్డ్ డా.ఎస్.డి.శర్మ 64 (శాస్తవ్రేత్తలు -27)
15. 7
డిసెంబర్ 1995 ఎం.వి.బ్రింక్నెస్ అరుణ్ చతుర్వేది 47 (శాస్తవ్రేత్తలు -29)
16. 12
డిసెంబర్ 1996 ఎం.వి.పోలార్ బర్డ్ డా.ఎ.ఎల్.కొప్పర్ 61 (శాస్తవ్రేత్తలు -37)
17. 8
డిసెంబర్ 1997 ఎం.వి.పోలార్ బర్డ్ డా.కె.ఆర్.శివన్ 53 (శాస్తవ్రేత్తలు -33)
18. 14
డిసెంబర్ 1998 ఎం.వి.పోలార్ బర్డ్ అజయ్ ధర్ 56 (శాస్తవ్రేత్తలు -37)
19. 9
డిసెంబర్ 1999 ఎం.వి.మగ్దలీనా ఓల్డెన్ డోర్ఫ్ అరుణ్ చతుర్వేది 48 (శాస్తవ్రేత్తలు -37)
20. 30
డిసెంబర్ 2000 ఎం.వి.మగ్దలీనా ఓల్డెన్ డోర్ఫ్ ఎం.జె.డిసౌజా 51 (శాస్తవ్రేత్తలు -34)
21. 8
జనవరి 2002 ఎం.వి.మగ్దలీనా ఓల్డెన్ డోర్ఫ్ ఆర్.పి.లాల్ 53 (శాస్తవ్రేత్తలు -30)
22. 10
జనవరి 2003 ఎం.వి.మగ్దలీనా ఓల్డెన్ డోర్ఫ్ డా.అరుణ్ హంచినల్ 48
23. 19
డిసెంబర్ 2003 ఎం.వి.ఎమరాల్డ్ సీ ఎస్.జయరామ్ 55
24. 12
డిసెంబర్ 2004 ఎం.వి.ఎమరాల్డ్ సీ రాజేశ్ ఆస్థానా 54
25. 29
డిసెంబర్ 2005 ఎం.వి.పార్డీబెర్గ్ ఎల్.ప్రేంకిశోర్ 54
26. 10
జనవరి 2007 ఎం.వి.ఎమరాల్డ్ సీ డి.జైపాల్ 57
27. 6
డిసెంబర్ 2007 ఎం.వి.ఎమరాల్డ్ సీ అరుణ్ చతుర్వేది 61
28. 31
అక్టోబర్ 2008 ఎం.వి.ఎమరాల్డ్ సీ డా.ప్రదీప్ మల్హోత్రా 65
29. 6
నవంబర్ 2009 ఎం.వి.వ్లాడిమీర్ ఇగ్న తుక్,
ఎం.వి.ఐవాన్ పాపనిస్ పి.ఇలాంగో 54
30. 14
అక్టోబర్ 2010 ఎం.వి.ఐవాన్ పాపనిన్ కె.జీవా 52