Saturday, November 2, 2013


దివ్వెల దీపావళి 
ముందు మాట -  ఈ కవర్ స్టోరీ  ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం (నవంబరు 3,2013)  కోసం వ్రాశాను. ఐతే, చివరి క్షణంలో ఆ అనుబంధం కవర్ స్టోరీ కాస్త్ నవంబరు2, 2013 నాటి భూమికలో షార్టు స్టోరీగా వచ్చింది.
అసలు స్టోరీ ఇదీ ...... చదవండిక....  వివివిరమణ
 


మన జాతి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. 

 

ఆనంద ఉత్సాహాలతో  చిన్నా, పెద్దా తేడాలేకుండా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. 

 

"చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి... "  అనే ప్రసిద్ధమైన తెలుగు సినిమా పాట మీకు గుర్తుండే టుంది.

 

నిజమే. మన జీవితం చీకటి వెలుగల రంగేళే. అలాటి మన జీవితంలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. అందరినీ  జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.  అందరం కలిసి మెలిసి ఉండాలి. సంతోషంగా ఉండాలి.  చెడు ఎక్కవ కాలం నిలవదు. మంచి ఎన్నడూ నశించదు.

 

చీకటిని తిడుతూ కూచోకు. ఒక దీపం వెలిగించు, చీకట్లను పారద్రోలు అంటూ జగతిని జాగృతం చేసే చైతన్య  శోభావళి ఈ దివ్య దీపావళి.

 

అంటే, ఇక్కడ చీకటి అనేది అజ్ఞానం. దాన్ని జ్ఞానదీపంతో తొలగించుకో  అని అర్థం చేసుకోవాలి.

ఈ దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా అంటారు. దీపాలను వెలిగించినపుడు  మనకు నీలం, పసుపు, తెలుపు - ఈ మూడు రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు మానవునిలో ఉండే  సత్త్వరజస్తమోగుణాలకు ప్రతీక.  వీటిని జగత్తును పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం  అని,   దీపాలను వెలిగించడం ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లు, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతంగా  భారతీయులంతా నమ్ముతారు.

మానవుడు శక్తి ఆరాధకుడు కాబట్టే, ప్రతి పండగలోనూ శక్తి పూజ అంతర్లీనమై ఉంది. దసరా తొమ్మిది రోజులూ  దుర్గాదేవిగా  ఆరాధించి, దీపావళినాటికి లక్ష్మీదేవిని  పూజిస్తారు.  దుష్ట రాక్షసాది శక్తులను సంహరించాలంటే ఆది పరాశక్తియే సమర్థురాలు. అందుకే, మహిషాసురుని చంపడానికి దుర్గగా, నరకాసురుని చంపడానికి సత్యభామగా అవతరించాల్సి వచ్చింది.  కామ, క్రోధ, లోభ, మోహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలనీ  వాటిపై విజయం సాధించడం ఎంతో కష్టమనీ చెబుతూ, సరైన జ్ఞానం పెంపొందించుకుంటే విజయం మనదే అని చెప్పడమే దీపావళి పండగలోని అంతరార్థం. 

దీపం – పరబ్రహ్మ స్వరూపమే

దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకో లేదు అన్నది సత్యమే. కానీ, చెంత దీపం లేనిదే చీకటి సమసి పోదు. జ్ఞానం కలగనిదే  సమస్య తొలగదు. అందువల్ల  అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే ప్రకాశాన్ని ఇమ్మని ఆ దేవదేవుని వేడుకోవడమే దీపావళినాడు దీపం వెలిగంచడం. ఆ దీపం ఎలా ఉండాలంటే,   మట్టితో రూపొందిన  మన దేహం లాంటి  ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తిని జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి.

దీపం జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.  అందుకే   ప్రతి రోజూ మనం దీపాన్ని వెలిగించే వేళ విధిగా కింది శ్లోకం పఠించాలని పెద్దలు చెబుతారు.

దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ||          

 

దీపావళినాడు నూనెలో (ముఖ్యంగా నువ్వులనూనెలో) లక్ష్మీదేవీ, నదులూ, బావులూ, చెరువులూ - వంటి వాటిల్లో   గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారట.  ఈ శ్లోకం చూడండి.

 

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్ !

అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే ! !

 

అందుకే  దీపావళి నాడు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందే   అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల దారిద్ర్యం తొలగుతుందనీ, గంగానదీ స్నాన ఫలం లభిస్తుందనీ, నరక భయం ఉండదనీ  పురాణాలు చెపుతున్నాయి.  సాధారణంగా  త్రయోదశి నాటి సాయంకాలం నాడు యింటి వెలువల యముడి కోసం  దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుందంటారు.  దానికే యమదీపం అని పేరు. పూర్వ కాలంలో ఇంటిల్లిపాదీ తలొక్క ప్రమిదలో దీపం వెలిగించి, కింది శ్లోకాలు చదువుతూ

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!

ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే ! !

 

వైవస్వతాయ కాలాయ సర్వ భూత క్షయాయ చ!

వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః ! !

ఆ దీపాలను ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చేవారు. మారుతున్న  ఈ కాలంలో ఎవరూ ఇళా  చేస్తున్నట్టు లేదు.

అన్నట్టు, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోష సమయాన దీపాన్ని దానం చేస్తే, మానవుడు యమ మార్గాధికారంనుండి విముక్తుడవుతాడని ఆస్తిక లోక విశ్వాసం. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో వివరించినట్లు   చెప్తారు.

 

దీపావళి కథలూ, నమ్మకాలూ

వేద ధర్మమే మన ధర్మం. దాన్ని బట్టే పండగలూ వచ్చాయి. వాటి వెనక కథలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆరీతిలో దీపావళి పండగకు సంబంధించి ఎన్నోకథలు వాడుకలో ఉన్నాయి.  వాటిల్లో ప్రధానమైనవి:  నరకాసుర వధ,  బలిచక్రవర్తిరాజ్య దానం, శ్రీరాముడు రావణసంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమవటం (భరత్ మిలాప్), విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకం జరిగిన రోజు. 

 

శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు.

 

అన్ని కథల్లో నీతి ఒకటే. చీకటిని పారద్రోలి వెలుగులు తెచ్చే పండుగ దీపావళి.  విజయానికి ప్రతీక  దీపావళి పండుగ.  అంతే.

 

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత . 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ   మూడుసార్లు జలతర్పణం విడుస్తారు. దానివల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం.  

 

అది పక్కనబెడితే, మనం ఒక విషయం గమనించాలి.  శరదృతువులో దీపావళి పండగ రావడంలో ఒక విశిష్టత కూడా ఉంది.  మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది.  వానలు తగ్గి చలికాలం ఆరంభమయ్యే ఈ సమయంలో  పురుగూ, పుట్రా కాస్త ఎక్కువగానే ఉంటి. వాటినించి రాత్రుళ్లు మనల్ని మనం కాపాడుకోడానికి  పండగ రూపంలో దీపాలను వెలిగిస్తే,   సాధ్యమైనంత వరకూ అవి మనదరిచేర నీయకుండా ఉంటాయి. అదీ  దీపావళి వెనక అసలు పరమార్థం.

 

ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున దీపావళి వస్తుంది. పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి నాడు నరక చతుర్థశిగా జరుపుకుంటారు. భారతదేశమంతటా మూడు రోజుల పండగగా దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. మొదటి రోజు నరక చతుర్దశి, రెండవ రోజు దీపావళి అమావాస్య, మూడవ రోజు బలి పాడ్యమి.  దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి, అంతకు ముందు కొందరు ధనత్రయోదశి అని ఆచరిస్తారు. ఈ ధన త్రయోదశి అనేది అక్షయతృతీయకన్నా బలమైన రోజు. అమావాస్యకు తర్వాతి రోజును కొన్నిచోట్ల బలిపాడ్యమి(కార్తీక శుద్ధ పాడ్యమి)గా జరుపుకుంటారు. 

 

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపుకుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోజ్యాలతో  ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇల్లూ రంగవల్లులతో, పిండివంటల ఘుమఘుమలతో,   బంధువులూ, స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది. పండగనాడు లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది.

 

ఎలాగూ పండగ కాబట్టి, ఆ ముందు రోజు ఇంట్లో పేరుకు పోయిన చెత్తనీ, పనికిరాని వస్తువులనూ బయటపారేసి, ఇల్లంతా సున్నాలు కొట్టించుకోవడం కూడా ఈ దీపావళికి సర్వసాధారణంగా అందరూ చేసే పని. లేదంటే, సంక్రాంతికి తప్పనిసరి. ఇదంతా ఎందుకు చేయడమూ అంటే, ఇంట్లోని అజ్ఞాననే చెడు శక్తిని పారద్రోలి,  సుజ్ఞానాన్ని పొందడమే తప్ప మరొకటి కాదు.

 

పండగ స్నానంలో వైద్య రహస్యం

నరక చతుర్దశినాడు వేకుజాముననే ఇంట్లోని పెద్దలూ, పిల్లలూ కూడా  ఒంటినిండా నువ్వుల నూనెను పట్టించి, కనీసం అరగంట సేపు నునెలో నానాక శీకాయపొడి లేదా నానబెట్టిన కుంకుడుకాయల రసంతో తలార స్నానం చేయాలి.  నువ్వుల నూనె దేహంలోకి ఎంత ఇంకితే అంత మంచిదంటారు. ఎందుకంటే, ఇక వచ్చేది చలి కాలం. చర్మం  పొడిబారుతుంది. కాబట్టి చర్మానికి నూనెతనం చాలా అసరం. అది ఈ అభ్యంగన స్నానం వల్ల సులభతరం అవుతుంది.  కీళ్లకు కూడా మంచిది. సోపులు వాడకుండా సున్నిపిండి శరీరాన్ని శుభ్రం చేసుకుంటే మరీ మంచిది కూడా. షాంపూల కన్నా కుంకుడుకాయ రసం శీకాయ రసం వంటివి వాడటం వల్ల తలలో పేలున్నా, చుండ్రు ఉన్నా తొలగిపోతాయి కూడా. ఈ విషయాన్ని హైటెక్కు ఆధునికులు గుర్తించితే మంచిది.

 

తెలుగు సాహిత్యంలో దీపావళి

తెలుగు సాహిత్యంలో దీపావళికి పెద్ద పీటే వేశారు కవులూ, రచయిత(త్రు)లూ, పండితులూ.  వైజయంతీ విలాసం, వర్ణన రత్నాకరం వంటివాటిల్లో దీపావళి ప్రస్తావన ఉంది. ఆధునిక కవులెందరో ఈ దీపావళిని మనోహరంగా వర్ణించారు.   దాశరథి తన ప్రాణ దీపం అనే కవిత కూడా మనకు గుర్తొస్తుందీ సందర్భంగా.  దీప లక్ష్మి, దీప శోభ, దీపావళి – ఇలా కవితల కు పేర్లు కూడా ఎన్నో మనకు తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి.  సినిమాల్లో సరేసరి. వేరే చెప్పనక్కర్లేదు.  ఇవిగాక జానపదాల్లో కూడా దీపావళి ప్రస్తావనలతో కూడిన లక్ష్మీదేవి పాటలు ఎన్నో ఉన్నాయి.

 

పండగ పూట పూజలు

ధనత్రయోదశి, లక్ష్మీ పూజ, కేదారేశ్వర వ్రతం – ఇవీ దీపావళి పండగ సందర్భంగా అందరూ ఆచరించే పూజలు.  వీటన్నిటి వెనకా శక్తిపూజ ప్రాముఖ్యం ఎంతో ఉంది.  దీపావళి నాటి అర్థరాత్రి కాలంలో ఇంటినడుమ ధాన్యపురాశి పోసి, దానిపై తెల్లని వస్త్రాన్ని పరిచి, దానిపై లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుతారు.  ఆనక శ్రీ సూక్తం లేదా అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజచేసి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పాయసాన్ని నివేదిస్తారు.  నిజానికి దీపావళినాడు ప్రతి ఒక్కరూ చేయల్సిందదే.

 

పండగ నాటి తీపి వంటకాలు

 

ఈ దీపావళికి   రకరకాల తీపి వంటకాలు  చేస్తారు.  వాటి సంగతి చూద్దామా.

1. దీపావళి స్పెషల్ జిలేబి:  భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలో తప్పక కనిపించే ఈ జిలేబి దీపావళి ప్రత్యేక స్వీట్.

 2. సాంప్రదాయక పాయసం: పాయసం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. రకరకాల పాయసాలను  వండుతుంటారు. వీటిలో సేమ్యా   పాయసం చాలా ముఖ్యం.

3. గులాబ్ జామూన్: జామూన్ పేరు చెపితే చాలు.  నోరు ఊరిపోతుంది. తినటానికే కాదు చూసేటందుకు కూడా  జామూన్స్ ఎంతో బావుంటాయి.  

4. గుజియా: కొబ్బరితో చేసే గుజియా  అన్ని శుభకార్యాలకు, పండగలకు   తయారు చేసుకుంటారు

5. అరిసెలు: దీపావళి అనగానే  అరిసెలు గుర్తుకౌస్తాయి. బియ్యంపిండి, బెల్లంతో తయారు చేస్తారు. అందులో కొంచెం వెరైటీ గసగసాలు కలిపితే ఆ టేస్టే వేరు.  

 ఇక దీపావళినాడు చుర్మా లడ్డూ,సోన్ పాప్డి వంటివి ఉత్తరాది ప్రాంతాల్లో తప్పనిసరిగా చేస్తారు.  పాల పూరీ వంటివి దీపావళినాటి ప్రత్యేక ఆకర్షణలంటే అతిశయోక్తి కాదు.

 

బాణసంచాతో కాలుష్యం...

దీపావళి వేడుకల్లో అన్నింటికంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బాణసంచా కాల్చడం. ఐతే, దానివల్ల జరిగే వాతావరణ కాలుష్యం గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంత తక్కువగా టపాకాయలు కాల్చితే అంత ఎక్కువ పర్యావరణానికి మేలు చేకూరుతుంది. అంతే కాదు. మీ జేబులు కూడా అంత ఎక్కువ పదిలంగా ఉంటాయి.  బాణసంచా కాల్చడం కంటే మన జీవితాలు ముఖ్యమన్న విషయం తెలుసుకోవాలి.   కానీ   దీపావళి పండుగను పాత రోజుల్లో మట్టి దీపాలను వెలిగించి, లక్ష్మీదేవి పూజలు చేసి వేడుకలు జరుపుకునేవారు. అప్పట్లో బాణసంచాను కాల్చడం వంటివేమీ ఉండేవి కావు. అందువల్ల  వాతావరణ కాలుష్య  సమస్యే ఉండేది కాదు.  పైగా గోగు కాడలవంటి పర్యావరణ హితమైన వాటితోనే ఆనాటి బాణాసంచా తయారయ్యేది. కానీ, నేడు ఆధునికత పేరుతో పండగ పరమార్థం వ్యాపారంగా, ఫ్యాషన్ గా మారి  వెర్రి తలలు వేస్తోంది.

శబ్ద కాలుష్యంతో సమస్యలు...

అతి పెద్దగా శబ్దం చేసే బాణసంచా మూలంగా తీవ్రమైన శబ్ద కాలుష్యం కలుగుతోంది. నిజానికి ఒక టపాకాయ  పేల్చినప్పుడు దానినంచి వచ్చే శబ్దం నాలుగుమీటర్ల దూరంలో శబ్దం  125 డెసిబెల్స్‌కు మించి ఉండకూదని చట్టం కూడా ఉంది.  ఐతే, దీన్ని ఎవరూ పాటించడం లేదు. దానివల్ల  బాణసంచా కలిగించే  శబ్ద కాలుష్యం  ప్రజలపై  తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఎలాటి అనారోగ్య సమస్యలు రావచ్చు....

నేటి కాలంలోని బాణాసంచాలన్నీ ఎక్కువగా  రసాయన పదార్థాలతో తయారవుతున్నాయి. వాటి మూలంగా మన ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది.   అంతే కాదు. మితిమీరిన శబ్ధాలు కూడా మప్పును కలిగిస్తాయి.

·        రక్తపోటు పెరగడంతో పాటు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది.

·        పెద్ద శబ్దాల వల్ల వినికిడి సమస్య రావచ్చు. శాశ్వతంగా చెవుడు రావచ్చు.

·        రాగితో తయారైన బాణాసంచాలవల్ల   శ్యాసకోశ సమస్యలు ఏర్పడవచ్చు.

·        మెగ్నీషియం తయారైన బాణాసంచాలవల్ల   వాటిల్లోని   మెగ్నీషియం పొగ రూపంలో వాతావరణంలో కలిసిపోయి చర్మ సంబంధ సమస్యలను సృష్టిస్తుంది

·        నైట్రేట్‌ తో తయారైన బాణాసంచా వల్ల మానసిక సమస్యలకు దారితీయవచ్చు

·        క్యాడ్మియంతో తయారైన బాణాసంచాలవల్ల   అనీమియా  రావచ్చు. లేదూ కిడ్నీ దెబ్బ తిననూవచ్చు.

·        సీసంతో తయారైన బాణాసంచా  నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

·        జింక్‌  ఉండే బాణాసంచా వల్ల వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువ

నేటి మాట - ఎకో ఫ్రెండ్‌లీ టపాకాయలు...

ఎకో ఫ్రెండ్‌లీ  టపాకాయల్లో ఆకులను వాడటంవల్ల  తక్కువ శబ్దాలతో ఇవి పేలుతాయి. కేవలం ధర తక్కువ మాత్రమే కాదు.  తక్కువ కాలుష్యాన్ని కలిగించడమే కాకుండా ఆట్టే పెద్దగా శబ్దాలు చేయని ఈ టపాకాయలవల్ల పిల్లలకు ప్రమాదం తక్కువ. దీంతో అందరూ ఎకో ఫ్రెండ్లీ టపాకాయలనే వాడాలని పర్యావరణ ప్రేమికులు ప్రచారాన్ని చేపడుతున్నారు.

చివరిగా ఒక్క మాట -

బాణాసంచా వంటి వాటి సంగతిని పక్కనబెట్టి, ముందు సహజంగా దొరికే నువ్వులనూనె, కుంకుడు కాయ, శీకాయ, సున్నిపిండి – వీటిని వాడటం వల్ల కలిగే లాభాలను గుర్తుతెచ్చుకోండి. షాంపూలనూ, సబ్బులనూ మీ టీవీలకే పరిమితం చేసేయండి. పాక్డ్ తిండికీ, స్వీట్లకీ స్వస్తి చెప్పండి. సాధ్యమైనంత వరకూ మీ వంటకాలను మీరే శుచిగా వండుకోండి. ఆ అజ్ఞానం తొలగితే, మీ దీపావళి పండగ పట్ల సార్థకమైనట్లే.  ఆరోగ్య లక్ష్మిగా, విజయ లక్ష్మిగా, ధన లక్ష్మిగా లక్ష్మీదేవి సదా మీతోనే ఉంటుంది.  సందేహం లేదు.

*****