Wednesday, July 16, 2014

గురుపూర్ణిమ గురించి మీకు తెలీదని కాదు. ఇది పోయిన ఆదివారం ఆంధ్రభూమి వీక్లీలో వచ్చిన నా వ్యాసం.


గురుపూర్ణిమ

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః"

గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. సాక్షాత్తూ  పరబ్రహ్మ ఆయనే. అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను.

"గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం

నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః"

 

భవ రోగాలను తొలగించేవాడు, సకల విద్యానిధీ, సకల లోకాలకూ గురువు దక్షిణామూర్తి. ఆయనకు న నమస్కారం.

ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లీ తండ్రీ దైవం - అన్నీ తామే అయ్యేవారు గురువులు.  విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఆచార్యులవారిని అంటే గురుదేవుని త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలి. ఇది ఋషివచనం.

"మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" అన్నది ఆర్యోక్తి.  తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు. తల్లి తరువాతే తండ్రి.  అదీ మన సంస్కృతి.

తెలిసో తెలియకో దైవానికి అపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం తెప్పిస్తే ముల్లోకాలలో ఆ త్రిమూర్తులతో సహా ఎవరూ రక్షించలేరు. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొందాలి.  అదే గురు పూర్ణిమ సందేశం.

"గురువునూ, గోవిందుడిని పక్క పక్కన నిలబెట్టి, ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే,  గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్త కబీరు.  

అసలు "గురు"వు అనే పదంలో   "గు" అంటే "తమస్సు" లేదా "చీకటి" లేదా "అజ్ఞానం",  "రు" అంటే "  తొలగించు" అని అర్థం.  మనలోని అజ్ఞానాన్ని తొలగించి తన జ్ఞానజ్యోతి తో వెలుగును నింపేవాడు "గురువు".  బ్రహ్మలాగా మనలో జ్ఞాన బీజాన్ని సృష్టించి, విష్ణువులాగా దాని స్థితిని కొనసాగించి, మహేశ్వరుడిలాగా  అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. 

పూర్వకాలంలో శిష్యులూ, గురువులు కూడా ఈ నాలుగుమాసాలూ వర్షాకాలం కావడంతో, వ్యాధులు ప్రబలే కాలం కాబట్టి, ఎలాటి  దేశసంచారమూ చేయకుండా ఒకేచోటే తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకునేవారు. ఆషాడ పూర్ణిమ నుండి నాలుగు మాసాలు(చాతుర్మాసం) ఒక వ్రతంగా పాటించేవారు. అదే చాతుర్మాస్య వ్రతంగా పేరు పొందింది. ఆ సమయంలో శిష్యులు గురువు దగ్గర జ్ఞాన సముపార్జన చేసేవారు. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు  గురువును ఆరాధించడానికి కేటాయించేవారు. ఆ సంప్రదాయమే కాలక్రమేణా " గురుపూర్ణిమ " గా మారిందని  అంటారు.  ఈ వ్యాస పూర్ణిమను వాడుకలోకి తెచ్చింది ఆదిశంకరులని కొందరంటారు.   

వసిష్ఠమహామునికి మునిమనుమడూ, శక్తి మహామునికి మనుమడూ, పరాశరమునికి పుత్రుడూ, శుకమహర్షికి జనకుడూ, నిర్మలుడూ ఐనట్టి,   శ్రీ వ్యాస మహర్షి  ఆదిగురువు. వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు. ఈ వ్యాసుడు  పుట్టినరోజునే గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ  అంటారు. ప్రతి ఏడూ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ ఉత్సవంగా జరుపుకుంటారు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించి   గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలూ బహుమతులూ సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకొంటారు.  శ్రీమన్నారాయణుని స్వరూపమే వేదవ్యాసుడు.  అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదాలను విభజించి లోకానికి అందించిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలూ, భారత భాగవతాలూ లభించాయి. వ్యాసుడు  శ్రీమహావిష్ణుతేజంతో జన్మించినవాడు. కాబట్టే,    శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో "వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే" అని తలుచుకుంటాం.

"వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్

వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మ నిధయే వాశిష్ఠాయ నమోనమః"

 

శ్రీమన్నారాయణుని నాభియందు జన్మించినవాడు బ్రహ్మ. అతని మానస పుత్రుడు వశిష్ఠుడు. అతని సంతానమే శక్తి మహర్షి. శక్తి పుత్రుడే పరాశరుడు.   అంటే, వశిష్టుని మునిమనుమడైన, కల్మషరహితుడైన శక్తికి మనుమడైన, పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రియైన ఓ! వ్యాస మహర్షీ! నీకు వందనం.  

 

ప్రతి వ్యక్తికీ గురువు అవసరం ఉంది.  శిష్యులు లేని గురువులుండొచ్చు. కాని గురువు లేని శిష్యులుండరు.  పరిపూర్ణావతారుడై, జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడ  సాందీపని మహర్షి వద్ద శిష్యుడై  శుశ్రూష చేశాడు.  నిజమైన శిష్యుడెలా ఉండాలో లోకానికి చాటాడు. అదే కృష్ణుడు తిరిగి అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అందుకే "కృష్ణం వందే జగద్గురుమ్" అంటాం.

 

గురువుకు కుల,మత,జాతి బేధాలుండవు. వయోబేధాలుండవు.  సాక్షాత్తూ పరమశివునికి తన పుత్రుడైన  సుబ్రహ్మణ్యుడే గురువు. లోకానికి రమణ మహర్షిని పరిచయం చేసింది గణపతిముని. ఐతే, రమణులకు అత్యంత ప్రియశిష్యుడాయన. మనకు హితం చెప్పేవారంతా మన గురువులే.

 

గురుతత్వాన్ని వివరిస్తూ సిద్ధుడు  యదు మహారాజుకు ఒక అవధూత తన గురువుల గురించి చెప్పిన రీతిని ఇక్కడ మనం తలుచుకోవాలి.  యయాతి కొడుకైన యదు మహారాజు ఒకసారి వేటకు వెళ్లాడు. అడవిలో అతనికి ఒక సర్వసంగపరిత్యాగియైన ఒక అవధూత కనిపించాడు.  ఆయన సత్ చిత్ ఆనందునిగా చూసిన యదువు, స్వామీ మీరింత ఆనందంగా ఈ కీకారణ్యంలో ఎలా ఉండగలుగుతున్నారని అడిగితే,  దానికి ఆ అవధూత,  నేను 24మంది గురువులనుండి జ్ఞానాన్ని పొంది, అనుష్ఠించి, ఆత్మజ్ఞానం పొందాను.  అందువల్లే నాకు నిర్హేతుకంగా, శాశ్వతంగా ఉండే ఆనందం లభించింది అని చెబుతూ,  వారి వారి సద్లక్షణాలను గ్రహించి,  వారిని గురువులుగా గ్రహించాననీ చెబుతూ, ఆ  24 గురువులెవరో ఇలా చెప్పాడు -  "మొదటి గురువు భూమి, రెండో గురువు వాయువు, మూడో గురువు ఆకాశం, నాలుగో గురువు అగ్ని, ఐదో గురువు సూర్యుడు, ఆరో గురువు పావురం, ఏడో గురువు కొండ చిలువ, ఎనిమిదో గురువు సముద్రం, తొమ్మిదో గురువు మిడత, పదో గురువు ఏనుగు, పదకొండో గురువు చీమ, పన్నెండో గురువు చేప, పదమూడో గురువు పింగళ అనే వేశ్య, పద్నాలుగో గురువు వేటగాడు, పదిహేనో గురువు బాలుడు, పదహారో గురువు చంద్రుడు, పదిహేడో గురువు  తేనెటీగ, పద్నెనిమిదో గురువు లేడి, పంతొమ్మిదో గురువు గ్రద్ద, ఇరవయ్యవ గురువు కన్య, ఇరవై ఒకటో గురువు పాము, ఇరవై రెండో గురువు సాలెపురుగు, ఇరవై మూడో గురువు భ్రమర కీటకం, ఇరవైనాలుగో గురువు  నీరు".   ఈ 24 గురువుల లక్షణాలూ ఉండేవాడు సద్గురువు.

 

గురుపౌర్ణమినాడు వ్యాసుడు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది.  అలాగే, తమకు చక్కని గురువు దొరకాలనుకునే వారు ఈ గురుపూర్ణిమనాడు శ్రీగురుదత్త చరిత్ర పారాయణ చేస్తే ఆ గురుదత్తుడు సంప్రీతుడై, మార్గాన్ని నిర్దేశిస్తాడు.  గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని, సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు.  తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. ఈ ఒక్క రోజే పూజిస్తే చాలదు. ఈ రోజున ఆరంభించి గురుపాదాలను శరణువేడి, నిత్యమూ ఆయనను సేవిస్తేనే మన జన్మ ధన్యమైనట్లు. 

"ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం

మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా"

 

మన ధ్యానానికి మూలం గురువు, మనం చేసే పూజకు మూలం గురుపాదాలు, మనకు మంత్రం అంటూ ఏదైనా లభించిందీ అంటే అది మన గురుదేవుల వాక్యాలే, మనకు మోక్షం కలగాలంటే దానికి మన గురువు కృప ఉండాలి.  అందువల్ల, గురువే మన సర్వస్వం అని  సేవిస్తేనే మనకు మోక్ష మార్గం సుగమమవుతుంది.

 

వేదవ్యాసుడు   - 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు' అని రెండు చేతూలూ ఎత్తి నమస్కరిస్తూ చెప్పాడు. నిజమైన గురువు బోధించేది అదే. దత్తావతార తత్వం కూడా అదే.  దత్తుడు శిరిడీసాయిగా, పర్తి సాయిగా ఈ భువిలో అవతరించి  సకల జనులూ ఐకమత్యంగా, సుఖ సంతోషాలతోఉండాలనే చెప్పారు.  శిరిడీసాయి తన శిష్యులకు  పూజ చేసుకొమ్మని  చెప్పింది ఒక్క గురుపూజ మాత్రమే.  గురువే మూల స్థంభం. అదుగో, ఆ స్థంభానికి పూజ చేయండి!” అన్నాడాయన. ఆయన ఆ మాట అన్నది ఆషాడ పూర్ణిమ నాడే.   పర్తిసాయిగా ఆయనే ప్రేమే మార్గం, సేవే సత్యం!” అని బోధించాడు. సదా ఇతరులకు సాయంచేయి. పక్కవారిని కష్టపెట్టకు!” అని జాగ్రత్తలు చెప్పాడు.  నిజంగా  పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ   విషయాన్ని మనమంతా త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది.  

 

----