Monday, October 24, 2011

అమావాస్య వెన్నెల - దీపావళి శుభాకాంక్షలు...

రమణ పేరుతో వచ్చిన ఆదివారం అనుబంధం కథనం., నాదే...
ఆంధ్రభూమి ఆదివారం 22-10-2011




దీపావళి- అంటే దీపాల వరుస. ఎంత అందంగా ఉంటుందో చూడ్డానికి! కదూ! దీపాల కాంతులు నలుదిక్కులా వెదజల్లుతూంటే, చీకటి పరుగోపరుగు! ఒక్కో దీపాన్ని వెలిగించి, చీకటిని పారద్రోలండి అనడమే దీపావళి’. చీకటి- అంధకారం- చెడు అనే అర్థంలో తీసుకొంటే, చెడుని పారద్రోలేది దీపావళి. భారతదేశం యావత్తూ అందరూ జరుపుకునే ఏకైక పండగే దీపావళి. దేశమంతా విద్యుత్ కాంతులమించి అంబరాన్నంటే రీతిన వివిధ రకాల బాణాసంచాలను కాల్చి ఆనందంగా గడిపే రోజు ఈ దీపావళి. ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాడు జరుపుకొంటారు. అంటే, అపుడప్పుడే వానలు తగ్గుముఖం పట్టేస్తాయి గనక, ఇంటి చుట్టూ, మన పరిసరాల్లో వుండే పురుగూపుట్రా నించి మనల్ని మనం రక్షించుకోమని చెప్పేదే దీపావళి. చీకటిని తిడుతూ కూచోవద్దు. ఒక్క దీపం వెలిగించుఅని ఒక సామెత ఉంది. ఇదీ దీపావళి అంతరార్థం. నేడు మానసిక వత్తిడితో కుంగిపోతున్న యువత ఈ విషయాన్ని గుర్తించాలి.
దీపావళి చీకటి పడగానే మొదలయ్యే పండగ. మిగిలిన పండగలన్నీ సూర్యోదయం తర్వాత మొదలైతే, దీపావళి సూర్యాస్తమయంతోటే మొదలౌతుంది.
దీపావళి గురించిన కథలు/గాథలు
దీపావళి పండుగ గురించి రకరకాల పురాణ గాథలు ఉన్నాయి. సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసురుడనే భయంకర రాక్షసుని చంపి, ప్రజలందరినీ కాపాడాడు. దానికి గుర్తుగా ప్రజలంతా ఆనందంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ జరుపుకొనే పండుగే దీపావళి. ఇది ద్వాపరయుగంనాటి గాథ.
పదునాలుగేళ్ళ వనవాసం పూర్తిచేసుకొని ఈరోజునే శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి, పట్ట్భాషిక్తుడైనాడనీ ఉత్తర భారతదేశంలో ప్రజలు విశ్వసిస్తారు. అంటే, దీపావళి అనేది త్రేతాయుగకాలంనించీ జరుపుకొంటున్నారన్నది అర్థమవుతోంది.
ఇంకో పురాణగాథ ప్రకారం, బలిచక్రవర్తి వామనుడికి తన యావత్తు రాజ్యాన్నీ ధారపోసిన రోజే దీపావళి. కొన్ని కథల్లో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినదీ ఈరోజేనని విశ్వసించి, దానికి గుర్తుగా దీపాలతో అలకరించడం ఆనవాయితీగా మారిందని చెబుతున్నారు.
దీపావళినాడు సాక్షాత్తూ లక్ష్మీదేవి భూలోకంలో విహరిస్తుందనీ, ఇళ్ళన్నీ చక్కగా శుభ్రంగా ఉంచి దీపాలతో అలంకరించిన ఇళ్ళలోకి మాత్రమే ఆమె వస్తుందనీ ఆస్తిక లోకంలో ఒక నమ్మకం ఉంది. ఆ తల్లిని ఆహ్వానించడానికే దీపాలంకరణతో, అగరొత్తులు, పరిమళ ధూపాలతో భక్తులు తమ భక్తికొద్దీ తమ ఇళ్ళలో ఏర్పాట్లుచేసుకొంటారనీ అంటారు. ఇదే కాలక్రమంలో దీపావళి అయ్యిందంటారు. అందుకే గుజరాత్‌లాటి రాష్ట్రాల్లో వ్యాపారస్తులు దీపావళినాడే పూజలు చేసి కొత్తగా లెక్కలు ఆరంభిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే, దీపావళి వ్యాపార లోకానికి నూతన సంవత్సరపు మొదటిరోజు.
సామాజికపరమైన కథల్లో విక్రమార్కుడు ఈరోజే పట్ట్భాషిక్తుడయ్యాడనీ, ఆ సంతోషానికి గుర్తుగా దీపాలతో దేశమంతా అలంకరించేవారనీ, అదే దీపావళి అయ్యిందనీ ప్రస్తావించారు. నరకమంటే భయమున్న ప్రతివారికీ, ఆ నరక బాధనుంచి విముక్తినిమ్మని యముని గురించి ప్రార్థించడమే నరక చతుర్దశి అనీ, ఆ తర్వాతిరోజే దీపావళి అమావాస్యయనీ మరో కథ ప్రచారంలో ఉంది.
దీపావళి అనేది ఆనందానికి ప్రతీక. ఈ లోకంలో అధర్మం, అరాచకం పెట్రేగిపోయినప్పుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, భక్త సంరక్షణ చేయడంకోసం దైవం భువికేతెంచి దుష్టసంహారం చేయడం జరుగుతుంది. అదే చెడుమీద మంచిచేసిన యుద్ధపు విజయం. విజయాన్ని సంబరంగా జరుపుకోవడమే పండగ’. అంధకారాన్ని తొలగించి వెలుతురు వైపు నడిపించేదే పండగ. అదే దీపావళి పండగ గురించి చెప్పే నరకాసుర వధ కథ.
నరకాసుర వధ కథ మన ఆంధ్ర దేశమంతా, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా దీపావళికి ముఖ్య కారణంగా అందరూ భావించడం జరుగుతోంది. కాబట్టే ఈ చతుర్దశికి నరక చతుర్దశి అని పేరొచ్చింది.
నరకాసుర వధ గురించిన కథ భాగవతంలోనూ, హరివంశంలోనూ ఉంది. నరకాసురుడు లోక కంటకుడుగా మారిపోవడంతో ప్రజలంతా శ్రీకృష్ణుని శరణుజొచ్చారు. నరకాసురుని చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో వెళ్ళాడు. మొదట మురఅనే రాక్షసుడినీ, అతని పుత్రులను వధించాడు. దాన్ని చూసిన నరకాసురుడు కోపోద్దీపితుడై శ్రీకృష్ణునిపై యుద్ధానికి వచ్చాడు. ఈ నరకాసురుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తి భువిని హిరణ్యాక్షుని కోరల చెర విడిపించిన సమయంలో పుట్టాడు. తర్వాతి కాలంలో ప్రాగ్జోతిషపురాన్ని పాలించే రాజుగా, లోక కంటకుడుగా తయారయ్యాడు. యజ్ఞయాగాదులేవీ చేయకూడదనీ, ఏంచేసినా అది తనకే చెందేలా చేయాలని మునులను, ఋషులనూ హింసించాడు. ఆఖరుకి తన రాజ్య ప్రజలకే కంటకప్రాయుడైనాడు. ఇతనిని సంహరించడానికి కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే రాలేదు. ఆయన భార్యయైన సత్యభామ వెంట వచ్చింది. సత్యభామను ఆమె తండ్రి సత్రాజిత్తు ఎంతో గొప్ప వీరనారిగా తీర్చిదిద్దాడు. అరువది నాలుగు కళలలోనూ ఆమె ప్రావీణ్యురాలు. యుద్ధంలో నరకాసురుని ధాటికి శ్రీకృష్ణుడు మూర్ఛిల్లాడు. అపుడు ఆ సకల కళాప్రావీణురాలైన సత్యభామాదేవి విల్లంబులను చేతపట్టి యుద్ధాన్ని కొనసాగించింది. ఆ మహాశక్తి స్వరూపిణి ధాటికి తట్టుకోలేకపోయాడు. చివరికి ఆమె చేతిలో సంహరించబడ్డాడు. నరకాసురుడు, నరకుడు లోక కంటకుడు, అతనిని వధించిన విజయమాత సత్యభామ. ఆ విజయోత్సవానికి గుర్తుగా అప్పటినించీ దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, నరకాసురుడు అంటే వేరెవరో గాదు, మన దేహాన్ని ఆవహించి వున్న దుర్గుణాల ప్రతిరూపం. దానిని సంహరించడమే జ్ఞానదీపాలను వెలిగించడం. అంటే మనలోని దుర్గుణాలను గుర్తించి, జ్ఞానంతో తొలగించుకోవాలన్నదే దీపావళి పరమార్థం!

బలి చక్రవర్తి కథ కూడా దీపావళి పండుగతో ముడిపడి వుంది. ఈ బలి చక్రవర్తి గురించి భాగవతం ఎంతో విపులంగా చెప్పింది. బలిచక్రవర్తి చేతికి ఎముకలేనివాడు. ఎవరు ఏమడిగినా లేదనకుండా అన్నీ ఇచ్చేసేవాడు. అయినా అతనివల్ల తమకెప్పటికైనా ముప్పుతప్పదని ఇంద్రాది దేవతలు బలినించి అందరినీ రక్షించమని వేడగా, శ్రీ మహావిష్ణువు వామనావతారంఎత్తి, బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని కోరాడు. బలి సంతోషంగా దానమిచ్చాడు. ఇంకేం? వామనుడు- ఇంతై ఇంతింతై- భూమ్యాకాశాలలో రెండు పాదాలు పెట్టి, ‘మహాచక్రవర్తీ! మూడో పాదం ఎక్కడ పెట్టమంటావూ?’ అనేసరికి, బలిచక్రవర్తి ఎంతో నమ్రతతో నా తలపై ఉంచు తండ్రీ!అనడం, వామనావతారుడైన మహావిష్ణువు అట్లే మూడో పాదాన్ని బలి తలపై ఉంచి, అతనిని పాతాళానికి పంపేశాడు. ఇందువల్లనే ఈ చతుర్దశి అందరికీ పుణ్య దినంగా మారిపోయింది.
వ్రత రాజమువంటి వ్రత గ్రంథాల్లో దీపావళి ప్రస్తావన వచ్చినపుడు ఈ బలి చక్రవర్తి కథే ప్రముఖంగా వినవస్తుంది.
చతుర్దశీ దినే రాజ్యం బలేర స్త్వితి యాచయేత్
పురా వామనరూపదేణ ప్రార్థయిత్వా ధరామిమాం.
దదా వతిథి రింద్రాయ బలిం పాతాళ వాసినం,
కృత్వా దైత్యపతం దద్యా దహోరాత్రత్రయం హరిః
తస్మాత్సహోత్సవం చాత్ర సర్వదైవ హి కారయేత్,
మహారాత్రి స్సముత్పన్నా చతుద్దశ్యాం మునీశ్వరాః
.........................
దీపదానాది కార్యేషు గ్రౌహ్యామధ్యాహ్న కాలికాః,
తతఃప్రదోష సమయే దీపాన్ దద్యాన్మ నోరమాన్.
ఇదీ వ్రతరాజ కథనం.
మరో కథ నరక విముక్తికి సంబంధించింది. నరక చతుర్దశిఅనే పదంలో నరక అంటే నరకము, యమలోకము అని అర్థం. ఆ నరక విముక్తిని కోరి చేసే చతుర్దశీ ఉత్సవమే నరక చతుర్దశి. వ్రత చూడామణిలో దీని ప్రస్తావన ఉంది.
‘‘
యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ,’’
దీనిలో యముని పూజా విధానం వర్ణించి ఉంది. నరకంఅంటే మురికి. కార్తీక మాసంలో సూర్యుడు తులరాశి చేరడంవల్ల రాత్రుళ్ళు సుదీర్ఘంగా గడుస్తాయి. అందుచేత ఈ నరకమనే మురికిని తొలగించి పరిశుభ్రంగా కావడానికి ఇదే అదను. నరకుడు భూదేవీ కుమారుడవటంవల్ల భూమినుంచే మురికి ఉత్పన్నమైందని చెప్పడానికిదో కథ.
కొంచెం లోతుగా ఆలోచిస్తే, భూమి అంటే మన దేహం. మురికి అనేది మనలోనే ఉత్పన్నమవుతోంది. ఎట్లాటి చెత్త మాటలవల్లో, చెడు సాంగత్యంవల్లో, చెడు ఆలోచనలవల్లో మన

మనస్సు మురికిపట్టి పోతోంది. దానిని తొలగించడమే నరక చతుర్దశినాడు పూజ చేయడం. దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలడం. ఇదే దాని అర్థం.
తులా సంక్రమణంనాడే దీపావళి అనేందుకు ప్రమాణంగా ్ధర్మసింధుఇలా చెబుతుంది.
‘‘
తులా సంస్థే సహస్రాంశౌ ప్రదోషో భూతదర్శయోః
ఉల్కా హస్తానః కుర్యుః పిత్రూణాం మార్గదర్శనం
సూర్యుడు దీపావళినాడు తులారాశిలోకి వస్తాడనీ, ఆరోజు జనాలు దివిటీలతో తమ పితృదేవతలకు మార్గదర్శనం చేయాలనీ దీని అంతరార్థం. దీపావళిరోజు ఉత్తర ధృవ వాసులకు దీర్ఘరాత్రి ప్రారంభదినమనేది నిశ్చయం. అందుకే, వేరే ఏ పండగకూ లేని దీపావళినాడు అనేక దీపాలతో అలంకరించి, బాణాసంచా కాల్చే ఆచారం అనాదిగా వస్తూన్నది. ఉత్తర ధృవప్రాంతపు పండగ క్రమేపీ భారతదేశమంతా వ్యాపించింది. బాణాసంచా కాల్చడం అనేది ఆనాడు ఒక సైన్సుకు సంబంధించిన అంశమే. వానాకాలం ముగిసే సమయం. ఎక్కువగా పురుగులు, పుట్రా పెట్రేగి పోవడం, చీకటి రాత్రులు, దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిని పారద్రోలడానికే బాణాసంచా కాల్చేవారు. ఐతే ఆధునిక కాలంలో ఈ బాణాసంచా ఎక్కువగా శబ్దాలతో కూడి, చెత్త, కాలుష్యాలను వెదజల్లే రీతిలో రూపొందించడం జరుగుతోంది. నూనె దీపాల స్థానాన్ని విద్యుత్ దీపాలు ఆక్రమించాయి.
దీపావళి-దీపాల పండుగా?
దీపాన్ని వెలిగించడం అంటే, మనలో జ్ఞానజ్యోతిని వెలిగించమని దేవుని అగ్ని సాక్షిగా ప్రార్థ్థించడమే. దీపంఅనేది జ్ఞాన, ఐశ్వర్య, ఆరోగ్య సంపదలకూ, ఆనందాలకూ ప్రతీక. దీపం ఎక్కడైతే ఉంటుందో, అక్కడ జ్యోతి స్వరూపియైన దైవం సదా వాసం చేస్తుందనీ ఆస్తిక లోక నమ్మకం. చీకటిని ఆశ్రయించే దుష్టశక్తులూ, అరిష్ట కారకాలూ, ఒక్క దీప ప్రజ్వలనతో నశించిపోతాయి. అందుకే మనం నిత్యమూ సంధ్యవేళ దీపం వెలిగించగానే,
దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం జ్యోతి జనార్థన!
దీపేన హరతే పాపం
సంధ్యాదీప నమోస్తుతే!
అనే శ్లోకాన్ని తప్పక పఠించాలని శాస్త్రం చెబుతోంది. ఈ దీపాలను వెలిగించడానికి ఎవరు ఎన్ని రకాల నూనెలు, తైలాలూ చెప్పినా, నెయ్యితో వెలిగించిన దీపం అత్యుత్తమం. అలాగే నువ్వుల నూనెతోనూ వెలిగించినా చక్కని ఫలితం ఉంటుంది. ఈ దీపాలను వెలిగించేటప్పుడు, రెండు, మూడు లేదా ఐదు వత్తులను కలిపి ఒకటిగా చేసి వెలిగించడం సంప్రదాయం. ఈ దీపంనుంచి జాగ్రత్తగా పరిశీలిస్తే మూడు రంగులు వెలువడుతాయి. నీలి, పసుపు, లేత ఎరుపు రంగులు దీపాన్నించి వెలుపలి రావడం గనక చూస్తే, ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ త్రివర్ణాలూ మూడు శక్తులకు ప్రతీకలుగా చెబుతారు.
దీపావళిలోని దివ్యత్వం
తమసోమా జ్యోతిర్గమయ!అన్న పవిత్రమైన భావనతో ఈ దీపావళి పండగను అందరూ సంతోషంగా గడుపుతారు. ఎందుకంటే, మనం జీవించడానికీ, సాధనలను అనుష్ఠించి, ఎంతో ఉన్నత భావాలను సంపాదించుకొని భగవంతుని పొందడానికి ఒక సులువైనచోటే ఈ ప్రపంచం. అందరితో కలిసిమెలిసి ఉండటం, ఆనందంగా సంతోషంగా ఉండటం ఎంతో అవసరం. అందుకే, ఈ భువిమీద దుష్ట సంహారం జరిగినపుడు, ధర్మాన్ని ప్రతిష్టించినపుడు భువిలోనూ, దివిలోనూ ఆనందోత్సవాలు జరగడం అనాదికాలంనించీ పరిపాటే. దీపావళిఅనే పేరు ఎందుకు, ఎలా వచ్చిందో ఆ ఔచిత్యమేమిటో, ఆ దివ్యత్వమేమిటో ఒకసారి చూద్దాం.
రాక్షసులు జాతిరీత్యా, గుణ రీత్యా రాక్షస జాతి వారనీ, నర రూపరాక్షసులనీ రెండు రకాలుగా చెబుతారు. రామాయణంలోని రావణాసురుడు మొదలైనవారు రాక్షస జాతివారు. అదే మహాభారతంలోని దుర్యోధనుడు మొదలైనవారు నరరూపరాక్షసులు. దైవభక్తుల పట్ల ధ్వజమెత్తడమే వీరి ప్రధాన లక్ష్యం. నేటి ఆధునిక కాలంలో రావణాసురుని వంటివారు అరుదు. కానీ, ఇంటికో దుర్యోధనుడూ, వీధికో రావణాసురుడు వెలిసారు. ఆఖరుకు, ప్రసారమాధ్యమాలూ ఇలానే తయారైనాయి. సదా, దైవాన్ని హేళన చేయడం, అదనుదొరికితే దేవుళ్ళనీ, మతగురువులనీ దుమ్మెత్తిపోయడం. ఇదీ తీరు.
ఇలాటి రాక్షసులు పూర్వం తపస్సుచేసి రక్షోమంత్రాలు నేర్చి, తమపై తమను సంహరించే శక్తిగల రక్షోఘ్న మంత్రాలనుంచి తమ్ముతాము రక్షించుకొనేవారు. పెట్రేగిపోయి జనాలను బాధించేవారు. దాంతో వేదవేత్తులైన ఋషీగణాలు ఏమీ చేయలేకపోయేవి. ఫలితంగా మరింత పెట్రేగిపోయి అందర్నీ ఈ రాక్షసులు బాధించేవారు. ఇక భగవంతుని అవతరణ తప్పనిసరియైపోయేది. దీపావళిఅలాటి భగవన్నిర్మితమైన దుష్టశిక్షణా కార్యక్రమమేననేది మనం మర్చిపోకూడదు.
నరకాసురుడు తామసికుడు. స్ర్తిలెందరినో చెరపట్టి, పీడించిన దుష్టుడు, అందువల్ల అతనిని అంతంచేయడానికి స్ర్తి శక్తియే సత్యభామ రూపంలో యుద్ధంచేసి, సంహరించింది. స్ర్తిశక్తి స్వరూపిణి. ప్రకృతియే ఆమె. ప్రకృతికి భంగంకల్గితే, ఆ భంగం కల్గించినవాడికి మరణం తప్పదనేది నరకాసుర వధవృత్తాంతం చెప్పకనే చెబుతుంది. ఎవరైనాసరే, స్ర్తిని గౌరవించకపోతే పతనం తప్పదు.
అంతెందుకూ? నరకాసురుడు అనేవాడు, విష్ణువు వరాహరూపంలో భూమిని కాపాడినపుడు భూమికే పుట్టాడు. ఆ సమయం నిషిద్ధ సమయం. నిషిద్ధ సమయంలో సంగమం జరిగినందువల్ల దాని ఫలితంగా పుట్టాడు ఈ నరకాసురుడు. అందుకే, అక్రమ సమయ సంగమాలు రాక్షససంతాన ప్రాప్తికి కారణాలుగా మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.

తమస్సు అనేది అజ్ఞానానికి చిహ్నం. వెలుగు అనేది జ్ఞాన ప్రతీక. జీవి అనేవాడు తాను జీవించే ప్రదేశమంతా దీపాలు వెలిగించి, చీకటిని పారద్రోలడంవల్ల, తన మనస్సు లేదా హృదయంలోని జ్ఞానదీపాన్ని వెలిగించి అరిషడ్వర్గాలనే రాక్షసప్రవృత్తులను రూపుమాపాలి. ఇదే దీపావళిలోని దివ్య సందేశం. జ్ఞాన దీపం ఆద్యంతాల్లో నిండిన దీపావళి పండగ అందరికీ విజ్ఞానాన్నీ, సంతోషాన్నీ, ఆనందాన్నీ కల్గజేస్తుంది.
మూడురోజుల పండగ ఈ దీపావళి
భారతదేశమంతటా ఏటా సంబరంగా, వేడుకగా జరుపుకొనే ఈ దీపావళి త్రయోదశి నించి ద్వితీయ వరకు అంటే, ఐదురోజులపాటు జరుపుకొనేవారు. ఐతే నేడు అందరూ రెండ్రోజులపాటు, అంటే నరక చతుర్దశి, దీపావళి అమావాస్య మాత్రమే ఈ పండగను జరుపుకొంటున్నారు. కానీ మూడురోజుల ఉత్సవంగా దీపావళి పండగను జరుపుకోవడం సబబు. తొలి రోజు త్రయోదశి. దీనినే బలి త్రయోదశి అంటారు. ఆరోజు తెల్లవారుజాముననే అందరూ అభ్యంగస్నానం చేయాలి. అభ్యంగ స్నానం అంటే, రసాయన సమ్మిళిత హానికరమైన షాంపులతో కాదు. చక్కగా నువ్వులనూనెను దేహమంతా పట్టించి, అందులో దేహం నానాక శీకాయపొడి లేదా కుంకుడుకాయపొడితో స్నానంచేయాలి. దీనివల్ల దేహంలోని అన్ని భాగాలు చక్కగా ఉంటాయి (మనం యంత్రాలకు నూనె వేసినట్లే కదా!). పూర్వ కాలంలో కాళ్ళనొప్పులనీ, కీళ్ళ నొప్పులనీ ఎవరూ అనకపోవడానికి కారణం ఈ అభ్యంగనమే.
త్రయోదశి సాయంత్రం, సూర్యాస్తమయం అయ్యేవేళ దీపాలు వెలిగించాలి. పితృదేవతలను స్మరించుకొంటూ, ఎవరివల్ల మనం ఇంతవాళ్ళమయ్యామో, వారిని పేరుపేరునా స్మరించుకొంటూ ఒక్కో దీపం వెలిగించాలి. వీటికి తోడుగా మరో దీపం వెలిగించాలి. అది పితృదేవతలను మనం స్మరిస్తూ దీపాలను వెలిగించాంఅనడానికి సాక్షి అన్నమాట. దీపాలన్నిటినీ భగవంతునికి చూపించి, సాక్షి దీపాన్ని దగ్గరలో ఉండే దేవాలయంలో ఇచ్చి రావాలి. ఊరి ప్రజలందరూ ఇలా చేయడంవల్ల దేవుని గుడిచుట్టూ దీపాలు వెలుస్తాయి. దీపాల కాంతులతో దేవాలయం కొత్త అందాలను సంతరించుకొంటుంది. అదే దీపాల సమూహంగా కనిపిస్తుంది. దీపావళి అంటే దీపాల సమూహము, దీపాల వరుస అని అందుకే అన్నది.
ఇంతటి ఉదాత్త కార్యక్రమం వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో మొదటిది జనమంతా కలిసిమెలిసి ఎలా ఉండాలో తెలిసే అవకాశం ఏర్పడుతుంది. రెండోది - పిల్లలకు మన పెద్దల గురించిన అవగాహన వారిపట్ల భక్త్భివాలు ఏర్పడతాయి. మూడోది దైవభక్తి అనేది అలవడుతుంది.
ఇలా తొలినాడు బలి త్రయోదశి జరుపుకొన్నాక, తెల్లవారుజామునే తలార స్నానం చేయాలి. దీనికిముందు నరకాసురుని బొమ్మను వీధుల్లో ఉంచి, దాన్ని కాల్చివేయాలి. అది కూడా గ్రామాల్లో, ఊళ్ళో వీధుల్లో వేయడంవల్ల, జనమంతా కూడి వేడుక చూస్తారు. కాబట్టి ప్రజలమధ్య మానవత్వంనిలిపి, అందరూ కలిసిమెలిసి ఉండేలా చూస్తుందీ వేడుక. ఈ దహన వేడుక ముందు పిల్లలందరికీ దీపావళి కథను చెప్పాలి. చెడుగా ఉంటే ఏమి జరుగుతుందో, మంచిగా ఉంటే ఏమి వొరుగుతుందో స్పష్టంగా చెప్పాలి. దానివల్ల పిల్లల్లో చిన్ననాడే క్రమశిక్షణ అలవడుతుంది. ఈ కార్యక్రమం అయ్యాక స్నానం చేయాలి. మళ్ళీ సాయంకాలం దీపాలు వెలిగించాలి. మొదటిరోజు చేసినట్టే దీపాలు వెలిగించి, దైవానికి నివేదించి, సాక్షి దీపాన్ని దేవాలయంలో ఉంచి రావాలి. మూడోరోజూ తిరిగి తెల్లవారుజామునే నిద్ర లేచి, తలారా స్నానం చేయాలి. అందరూ కొత్త బట్టలను దైవం దగ్గర ఉంచి, ఆ స్వామి ప్రసాదంగా భక్తితో స్వీకరించి వాటిని ధరించాలి. వాటిని తల్లిదండ్రులకు నమస్కరించి తీసుకొంటే పిల్లలకు ఎంతో మంచిది. ఇక మూడోరోజు సాయంత్రం తిరిగి దీపాలు పెట్టాలి. ఆ రాత్రి లక్ష్మీదేవిని పూజించాలి. నరక చతుర్దశినాడు తలారా స్నానం చేసే సమయంలో నీటిలో గంగాదేవి ఉంటుందని ఆస్తిక లోకనమ్మకం. ఈ మూడురోజుల దీపాలపండగ ఒక ఎత్తూ, మూడోనాటి రాత్రి చేసే లక్ష్మీదేవి పూజ మరో ఎత్తు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా శుభ్రంచేసి, ఇంటికి మధ్య ప్రదేశంలో ధాన్యంపోసి, దానిపై లక్ష్మీదేవి ప్రతిమను ఉంచి ఆమెకు షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీ సహస్ర నామ, లేదా లక్ష్మీ అష్టోత్తరం- మన వీలునుబట్టి పఠించాలి. ఇదీ సరైన దీపావళి పండుగను చేసుకొనే విధానం. బాణాసంచాను కాల్చడం అనేది ఎవరూ చెప్పలేదు. కానీ, నేడు దీపాలపండుగ అంటే, విద్యుద్దీపాలతో అలంకరణ, చెవులు బద్దలయ్యే శబ్దాలతో పేలే టపాకాయలే! ఇది ఎంతవరకూ సరైనదో ప్రజలే నిర్ణయించుకోవాలి. అమ్ముతున్నారు కాబట్టి కొనాలిఅనే ధోరణి పోవాలి. అపుడు వ్యాపారస్తులు కొంటున్నారు కాబట్టే అమ్ముతున్నాంఅనలేరు. బాణాసంచాకాల్చడం తప్పనడం లేదు కానీ, సంప్రదాయాలను త్రోసిపుచ్చడం మాత్రం నేరం. కాదంటారా?
వివిధ రాష్ట్రాల్లో దీపావళి
దీపావళిని కేవలం భారతదేశంలోనే కాదు విదేశాల్లో సైతం కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తున్నారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల గురించి వేరేగా చెప్పనక్కర్లేదు.
గోవా మొదలైన రాష్ట్రాల్లో పెద్దపెద్ద నరకాసురుడి రూపాలను చేసి, ఊరేగించి, చివరకు ఒకచోట చేర్చి పిడకలు, కట్టెలు పేర్చి వాటిని దహనం చేస్తారు. ఏడాదిపాటు తాముచేసిన (తెలిసో, తెలీకో) పాపాలను ఈ నరక దహనంతో కరిగిపోతాయని అక్కడి ప్రజల విశ్వాసం. బీహార్‌లో శ్రీరాముడు, రావణుడు, కుంభకర్ణులను సంహరించి విజయోత్సాహంతో దీపావళి వేడుకలు జరుపుకుంటారు. పిండితో చిత్ర విచిత్రమైన బొమ్మలు చేసి భద్రకాళి పూజలు చేస్తారు. కాగడాలతో ఊరేగింపు నిర్వహిస్తారు.
గుజరాత్‌లో దీపావళిని ఆరు రోజుల పండుగగా చేస్తారు. గుజరాత్‌లో జైనులకు దీపావళి ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకంటే, ఆరోజే తీర్థంకర మహావీర్ నిర్యాణం చెందాడు. ఆరోజే, జైనులకు మహావీర శకం ఆరంభ దినం. ఆరోజు వాళ్ళంతా పాత బాకీలు తీర్చివేస్తారు. కొత్త లెక్కలు ఆరంభిస్తారు. లక్ష్మీదేవి పూజ చేస్తారు. విరివిగా కాకున్నా కనీసం ఒక వెండి నాణెం కొనాలనీ, అదీ లక్ష్మీదేవి బొమ్మ ఉండే వెండి నాణెం కొంటే మరింత అదృష్టమనీ వారి నమ్మకం.
బెంగాల్‌లో నవరాత్రి వేడుకలు కడు వైభవంగా జరిగి, అంతం కావడంతోనే దీపావళి వేడుక జరుగుతుంది. ప్రమిదలలో వత్తులు వేసి ఎక్కువ దీపాలు వెలిగిస్తారు. అమావాస్యనాడు దుర్గాదేవి పూజలు జరుగుతాయి. పూజలు కాగానే బాణాసంచా కాలుస్తారు.

వీధులు, ఇళ్ళూ తోరణాలతో దీప తోరణాలతో అత్యంత ఆహ్లాదకరంగా అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్సవాలు కూడా జరుగుతాయి. వాటిల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అమావాస్య మరునాడు విగ్రహాలను దగ్గరలో ఉండే నదుల్లో నిమజ్జనం చేస్తారు.
ఒరిస్సాలో దీపావళినాడు ఇళ్ళన్నీ చక్కగా దీపాలతో మెరిసిపోతూంటాయి. పేదా, గొప్పా తేడా లేకుండా అందరూ యథాశక్తి దీపాలంకరణ చేయడం విశేషం. ఇక్కడ నరక చతుర్దశికి ఆట్టే ప్రాముఖ్యత లేదు. దీపావళి రోజు కూడా సాయంత్రం వేళే ప్రధాన పూజా కార్యక్రమం ఆరంభిస్తారు. కుటుంబ సభ్యులు అందరూ శుచిగా, స్నానాలు చేసి, కొత్త బట్టలు కట్టుకుని లక్ష్మీదేవికి పూజ చేస్తారు. కొరియాకాఠిని వెలిగిస్తారు. ఇది మన ఆంధ్ర దేశంలో దిబ్బు దిబ్బు దీపావళిఅంటూ ఆముదపు చెట్టు కొమ్మలపై వత్తులు వెలిగించడాన్ని పోలి ఉండటం గమనార్హం. మా ఇంట చీకట్లు పారద్రోలి, మీరే దీపాలై వెలుగునీయండిఅంటూ దైవ ప్రార్థనలు చేసాక, బాణాసంచా కాలుస్తారు.
మహారాష్టల్రో దీపావళి పండుగను నాలుగురోజులు ఘనంగా జరుపుకొంటారు. నరక చతుర్దశితో ఆరంభమై, దీపావళి వెళ్ళిన మరో రెండురోజులదాకా పండగే పండగ! తొలిరోజు నరక చతుర్దశి’, రెండో రోజు దీపావళి’, మూడో రోజు పార్వ’, నాలుగోరోజు ్భవ్‌చీన్అని పిలుస్తారు. లక్ష్మీ పూజను దీపావళినాడు జరుపుతారు. ఇక్కడ ప్రమిదలను పంక్తిలంటారు. నాలుగురోజులూ బాణాసంచా కాలుస్తారు. ఇళ్ళలో అట్టతో లేదా కాగితంతో గోపురం లాటిది కట్టి దానిపై దీపం పెడతారు. దీన్ని ఆకాశీకందిల్అంటారు. ఇది కూడా పండగ నాలుగురోజులూ ఉంటుంది. దీపావళి తర్వాతిరోజు అంటే పార్వారోజున భార్య భర్త పాదాలు కడిగి హారతినివ్వడం వంటివి జరుగుతాయి. నాలుగోరోజు అన్నాచెల్లెళ్ళ రోజు. చెల్లెళ్ళూ, అక్కలూ తమ సోదరులను వారివారి ఇళ్ళకు ఆహ్వానించి, హారతులిచ్చి గౌరవిస్తారు. సోదరులు వారికి కొత్త బట్టలూ, కానుకలూ, మిఠాయిలూ ఇచ్చి ఆశీర్వదిస్తారు.
మధ్యప్రదేశ్‌లో దీపావళి అమావాస్య రాత్రివేళ కత్తి, కర్రా పట్టుకుని దరిద్ర లక్ష్మిని ఊరి పొలిమేరలదాకా తరిమేసి, శుభలక్ష్మిని మేళతాళాలతో ఆహ్వానిస్తారు. ఎంతో కన్నుల పండుగగా ఈ దీపావళి ఉత్సవం జరుగుతుంది.
ఉత్తర భారతదేశంలో సాధారణంగా దీపావళినాడు ఎలాటి వ్యాపారమూ చేయరు. అన్నం వండి రాశులుగా పోస్తారు. లక్ష్మీదేవి పూజ చేస్తారు. మేకలు, కోళ్ళూ బలి ఇస్తారు. ఆటవిక జాతివారు రాఖీని దీపావళినాడు తీసేసి, వాటిని ఆవు దూడల తోకలకు కడతారు. రాత్రి భోజనాలయ్యాక దీపాలూ వెలిగించి, కాగితాలు వెలిగించి నాట్యాలు చేస్తారు. కాగడాలు ఆరిపోయే దాకా నాట్యం చేస్తూనే ఉంటారు. లక్ష్మీ పీఠం వేసి, శుభలక్ష్మిని ఆహ్వానించడానికై పెద్ద ఊరేగింపు చేస్తారు. మధురలో గోవర్ధన పూజ దీపావళినాడే చేస్తారు.
రాజస్థాన్‌లో దీపావళి పండుగ చాలా తమాషాగా ఉంటుంది. ఇక్కడ పిల్లులకు పూజ చేసి, వాటికి మంచి విందు భోజనాలు పెడతారు. పిల్లి సంతృప్తి పడితే, ఆ సంవత్సరమంతా మంచే జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం.
పంజాబ్‌లో నరక చతుర్దశినాడు దీపావళి పండగను చేస్తారు. ఆరోజు ఇళ్ళనూ, అంగళ్ళనూ శుభ్రం చేసి, సాయంకాలం లక్ష్మీదేవి ముందు విలువైన నగలూ, వస్తువులూ, కొత్త బట్టలూ అవీ ఉంచి పూజచేస్తారు. అక్కడే కాక ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. ఇంట్లో కనీసం ఒక్క దీపాన్ని రాత్రి పూర్తిగా వెలిగేలా చూస్తారు. శ్రీరాముడు రావణుని చంపిన విజయోత్సవానికి గుర్తుగా దీపావళి చేస్తారిక్కడ. దీపావళినాడు ఖచ్చితంగా కొత్త బట్టలు ధరించాలనే నియమమేమీ వీరికి లేదు. వ్యాపారస్తులు కొత్త లెక్కలు ప్రారంభిస్తారు. దీపావళి అమావాస్య తరువాతి రోజును భాయిదూజ్ (లేదా భయ్యా దూజ్) అనే పండగ చేస్తారు. ఆరోజు సోదరులున్న ప్రతి వనితా కూడా తమ సోదరులకు వీర తిలకం దిద్దుతుంది.
ఇక దక్షిణాదికొస్తే, కేరళలో దీపావళినాడు తెల్లారుజామునే స్నానంచేసి దేవుని ముందు కూచొని ప్రార్థనలు చేస్తారు. ప్రపంచాన్ని పీడించిన నరకాసురుని బెడద వదిలించినందుకు కృతజ్ఞతతో కూడిందే ఆ ప్రార్థన. కేరళ ప్రజలు తమ గ్రామాల్లోని దేవాలయాల్లో దీపారాధన జరిగే సమయాల్లో దైవదర్శనం చేసుకొని, ఆ తర్వాత భజనలు చేయడం, హరికథలు వినడం లాటివి చేస్తారు.
కర్ణాటకలో దీపావళిని మూడురోజులు సంబరంగా జరుపుకుంటారు. మొదటిరోజు నరక చతుర్దశి. ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలంట్లు పోసుకొని, కొత్త బట్టలు ధరించి చక్కని విందు భోజనం చేస్తారు. రెండో రోజు దీపావళి అమావాస్య. ఈ అమావాస్యకు అంత ప్రాధాన్యత లేదు కానీ మూడవ రోజైన పాడ్యమిని బలి పాడ్యమిగా జరుపుకొంటారు. ఎప్పుడో బలిచక్రవర్తి చేసిన వాగ్దానంమేరకు పాతాళంనించి భూలోకానికి వచ్చి, తన ప్రజలు ఎలా ఉన్నారో చూడటానికి వస్తాడని ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మకానికి ప్రతీకగా బలి పాడ్యమిపండగ జరుపుకొంటారు. తన ప్రజలు సంపదలతో, సుఖసంతోషాలతో ఉంటే చూసి సంతోషించి వెళ్లిపోతాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం. పంటలు సమృద్ధిగా పండితే, దానికి ప్రతీకగా బలి పాడ్యమినాడు ఒక పెద్ద పీట మీద గోమయంతో బలి కోటను అమర్చి, ఆ పేడ గోడల మీద వరి, రాగి, జొన్న వంటి వాటి మొలకలను, నువ్వుల పూవులను అమర్చి పెడతారు. బలిచక్రవర్తి ఆ కోటను చూసి, తన ప్రజలు సంతోషంగా ఉన్నారని తలచి ఆనందంగా తిరిగి వెళ్తాడని అంటారంతా. ఈ బలికోటకు మొక్కి, నైవేద్యాలు పెట్టి, పూజించాక కొత్త బట్టలు ధరిస్తారు. చతుర్దశి నించి పాడ్యమి దాకా మూడురోజులూ ఇల్లూ వాకిళ్ళంతా పూర్తిగా దీపాలతో అలంకరించి ఉంచుతారు.
తమిళనాడు విషయానికొస్తే, ఇక్కడ దీపావళికీ, సంక్రాంతికీ ఎంతో ప్రాముఖ్యాన్నిస్తారు. దీపావళికి కొత్త బట్టలు ధరించడం, బాణాసంచా పేల్చడం - తమిళనాట సర్వసాధారణంగా కనిపించే దీపావళి దృశ్యం.
ఇలా దీపావళికి పండుగ యావత్ భారతదేశంలోనూ ధర్మప్రతీకగా, సుఖసంతోషాలకు గుర్తుగా, ధర్మసంస్థాపనే ధ్యేయంగా కొనసాగే కార్యక్రమాలతో ఎంతో వైవిధ్య భరితంగా జరుగుతుంది. ఎవరూ ఎలాచేసినా, దాని వెనక ఉండే రహస్యం ఒక్కటే, ‘అజ్ఞానాన్ని తొలగించు. ఆనందంగా జీవించు.
జ్ఞాన దీప చిహ్నం ఆద్యంతాలలో నిండిన ఈ దీపావళి పండుగ అందరికీ ఆనందాన్నీ, సుఖాన్నీ, సంపదలనీ తెచ్చి ఇస్తుంది. అలాటి దీప శోభ దివ్యత్వానికి, సర్వాత్మనా ప్రణతులనిచ్చి స్వాగత సాధకులమవుదాం. అదే తరుణోపాయం మనకు.
ఓం! అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మాఅమృతంగమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥