Friday, October 21, 2011

‘ఐ గాడ్’ - వంశీకృష్ణ పేరుతో అచ్చయిన ముఖ పత్ర కథనం - ఇదీ నా రచనే....

ఆంధ్రభూమి    October 16th, 2011  ఆదివారం అనుబంధం.....


ఆపిల్పేరు వింటూనే మనకు మూడు కథలు మదిలో మెదలక మానవు.
సృష్టి స్వరూపానే్న మార్చేసిందని కొందరు భావించే ఆడమ్, ఈవ్‌ల రొమాంటిక్ స్టోరీ మొదటిదైతే, రెండోది సైన్సుకు సంబంధించింది.
అదే, న్యూటన్ సిద్ధాంతం అనే గురుత్వాకర్షణ సిద్ధాంతం.
ఇక మూడో కథేంటంటారా? మన నిత్య జీవన శైలినే మార్చేసిన ఆపిల్’. ఈ గడచిన మూడు దశాబ్దాలుగా మన నిత్య జీవితంలో అనూహ్యమైన మార్పులను తెచ్చిందీ ఆపిలే.

ఆపిల్ కంప్యూటర్. ఆపిల్ ఐమాక్. అక్కడితో ఆగలేదు. సంగీత ప్రపంచానే్న మార్చేసింది ఐపోడ్. ఎవరి నోటవిన్నా ఆపిల్ ఐపోడ్ మాటే. ఎవరి చెవిలో చూసినా ఐపోడ్ కనెక్టయిన స్పీకర్సే. ఇంతలో మొబైల్ విప్లవం ముంచుకొచ్చింది ఐఫోన్‌తో. ప్రపంచ మొబైల్ మార్కెట్నే ఆక్రమించేసిన ఐఫోన్ ప్రభంజనం అక్కడితో ఆగలేదు. తాజాగా ఐప్యాడ్ కూడా వచ్చేసింది. ప్రజలకు అసలు నిత్య నూతన పరిజ్ఞానంఅందుబాటులోకి తెచ్చింది ఆపిల్అనే పేరు.

మనకు డిటిపిలో కూడా ముందు ఆపిల్ కంప్యూటర్లే అందుబాటులోకొచ్చాయి. ఇంతకీ ఈ ఆపిల్ సంస్థ వెనుక, దాని విజయగాథల వెనక ఎవరున్నారో తెల్సా? స్టీవ్ జాబ్స్. అతనొక దార్శనికుడు. కాల్పనికుడు. శాస్తవ్రేత్త. ఆపిల్ సంస్థ అతని సామ్రాజ్యం. ఎపుడూ ఏదో ఒక వినూత్నతను ప్రజలకు అందించి, వారిని ఉర్రూతలూగించి, తన వేపే చూస్తూ కొత్తగా మళ్ళీ ఏ ఆవిష్కారాన్ని తమముందు ఉంచుతాడా అని ఆత్రంగా అందరూ ఎదురుచూసేలా చూసిన వ్యక్తి స్టీవ్‌జాబ్స్. అతని ఆలోచనా విధానమే ఒక రకమైన పద్య గాథ.

18 ఏళ్ళ వయస్సులో మన దేశానికి వచ్చాడు. నీమ్ కయిరోలీ బాబాను కలిసాడు, తోడుగా తన కాలేజీ మిత్రుడైన ధన్‌కొట్ట్కె తెచ్చుకొన్నాడు. ఇద్దరూ కాలేజీ చదువును మానేసినవాళ్ళే. ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాలని బౌద్ధమతస్థుని అవతారం ఎత్తాడు. భారతీయతతో కూడిన వేషధారణను సాగించాడు కొన్నాళ్ళు. కంప్యూటర్లు రూపొందించి అమ్మినా, ఐపోడ్ మ్యూజిక్ ప్లేయర్లు అమ్మినా, ఐఫోన్, ఐప్యాడ్‌లతో వెర్రెక్కించినా విధి వ్రాతను మాత్రం తప్పించుకోలేక పోయాడు. ఎవీయల్ అన్నట్టు
కన్ను తెరిస్తే జననం! కన్నుమూస్తే మరణం! రెప్పపాటే కదా! పయనంఅన్నది నిజమేనని స్టీవ్‌జాబ్స్ జీవితమే చెబుతుంది. నిజానికి ఎవరి జీవితమైనా అంతేకదా?
ఆమధ్య ఓ సమావేశంలో ఐపాడ్‌ను ఆవిష్కరిస్తూ, స్టీవ్‌జాబ్స్ ఒక మాటన్నాడు. ‘‘టెక్నాలజీ ఒక్కటే చాలదు. టెక్నాలజీని సరళమైన కళలతో, మానవ జాతితో ముడిపెట్టితేనే ఫలితం ఉంటుంది. మన హృదయాలు కదిలి పాట పాడగల్గుతాయి.’’
కానీ అతని కదిలే హృదయం ఏకంగా పనిచేయడమే మానేసింది 5, అక్టోబర్ 2011 బుధవారంనాడు. ప్రపంచ జనుల హృదయాలను మూగగా రోదిస్తూండమని అందనంత దూరంలోకి, మబ్బుల్లోకి దూరి మాయమైపోయాడు స్టీవ్ జాబ్స్. మానవ జీవశైలిని కళాత్మకంగా, కవితాత్మకంగా

మార్చేసిన అసాధారణ వ్యక్తి అని చెప్పక తప్పదు. 2003లోనే అతనికి పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ (క్లోమ గ్రంథికి చెందిన క్యాన్సర్) అని తెలిసిన డాక్టర్లు అత్యుత్తమ శస్తచ్రికిత్స చేశారు. 2009లో అతనికి కాలేయాన్ని మార్చారు. ఇక నీకేమీ ఢోకా లేదోయ్అని డాక్టర్లు స్టీవ్‌జాబ్స్‌కు కితాబిచ్చారు. దేనికీ జాబ్స్ పొంగిపోలేదు. కుంగిపోలేదు.

ఐతే, పై లోకంలో కొత్త గాడ్జెట్ల సృష్టిచేయాల్సిన అవసరం వచ్చిందా! ఏమో! భూలోకంలో తాను సృష్టిచేస్తున్న ఐటమ్స్‌కు పై లోకంలోనూ గిరాకీ వచ్చిందా? ఏమో! - అందుకే గామోసు స్టీవ్‌జాబ్స్ అర్ధాంతరంగా తన జీవిత పయనాన్ని ఇక్కడ కొనసాగించకుండా మబ్బుల్లోకి దూరి మాయమైపోయాడు. కొంపదీసి ఇదికూడా తన చేతితో ఆవిష్కారం చేయాలనుకొన్న కొత్త గాడ్జెట్ మాయ కాదుకదా! ఎందుకంటే, ‘తల్చుకొంటే మాయమైపోవచ్చుఅని ఇటీవలే కొన్ని పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయని వార్తలొచ్చాయి. నిజానికి అలాటి ప్రయోగాల్లో స్టీవ్‌జాబ్స్ కూడా పాల్గొన్నాడా? ఏమో! అంతే అయ్యుండాలి స్మా! అంటున్నారు యువతరంలో తట్రులేకపోతున్నవారు కొందరు.

జాబ్స్ నిజానికి కంప్యూటర్ఆవిష్కారాలకన్నా, కొత్తతరం సంగీతం, చిత్రాలు, వీడియోలు - అన్నీ మన జేబులోనే ఇమిడిపోయి, ఎపుడు కావాలంటే అపుడు చూసుకోవడం, వినడం, ఎక్కువ మాట్లాడితే సుదూర మిత్రులకు పంపుకోవడం, వారి నించి అందుకోవడం- ఇలాటి సౌకర్యాలనిచ్చే గాడ్జెట్స్, రూపకల్పన మీదే ఆసక్తి కనబరిచాడు. ఐనా కంప్యూటర్‌ను మర్చిపోకుండా, ఈ సాధనాలన్నిటినీ కంప్యూటర్‌కు కనెక్టు చేసి వాడుకొనేలా చూశాడు. థింక్ డిఫరెంట్లీ- అన్నదే అతని బాట. అందుకే ఐ మ్యూజిక్ అంటూ, ఐ ట్యూన్స్ స్టోర్, ‘డిజిటల్ హబ్అంటూ వైవిధ్య భరితమైన అంశాలతో, పేర్లతో ప్రపంచ వినియోగదారులందరినీ ఇట్టే ఆకట్టుకొన్నాడు.

కంప్యూటర్ రంగం అయినా, సినిమా రంగం అయినా, మరే విషయంలోనైనా స్టీవ్‌జాబ్స్ రూటే వేరు. థింక్ డిఫరెంట్లీఅనేది స్టీవ్‌జాబ్ పంథా. అతను ఏ ఉపకరణాన్ని రూపొందించినా కవిత్వాన్ని వొలికించినట్టే. విభిన్నంగా ఉంటుంది. అది అతని నైజం. అలా డిఫరెంట్‌గా ఆలోచించి, తెగింపుతో కొత్త ఆవిష్కారాలను రూపొందించి ప్రవేశపెట్టగలిగే లక్షణాలే ఆయన్ను గత 33 సంవత్సరాలుగా కంప్యూటర్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ రంగాల్లో విశిష్ట వ్యక్తిగా నిలబెట్టాయి. ఆయనా, ఆయన నెలకొల్పిన ఆపిల్ సంస్థా ఇప్పటికీ ముందంజలోనే ఉండటం విశేషం. ఆపిల్అనేది ఆయన ఊహల్లోనించి పుట్టింది. స్టీవ్‌జాబ్స్ అనే పేరు విన్నా, ‘ఆపిల్అనే పేరు విన్నా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడటమే కాదు. వెన్నులో చలిపుట్టిస్తుంది.
అసలు ఆపిల్ సంస్థ ఒక ఉత్పత్తిని విడుదల చేస్తోంది అని ప్రకటన వెలువడిందంటే చాలు అది ఏమిటి? అది ఎలక్ట్రానిక్ రంగంలో మరో కొత్త విప్లవమా? కొత్త శకానికి నాంది పలుకుతోందా అని అటు వినియోగదారులూ, ఇటు విశే్లషకులతోబాటు పోటీ సంస్థలూ ఆదుర్దాగా ఎదురుచూస్తూంటారు.

ఐబిఎం సంస్థ పర్సనల్ కంప్యూటర్‌నీ, దానిమీద ఉత్పత్తులనీ పోలిన ఉత్పత్తులనే వివిధ సంస్థలు రూపొందించేందుకు ఉత్సుకతను చూపితే, ఆపిల్ సంస్థ మాత్రం ్థంక్ డిఫరెంట్లీఅంటూ ఏకంగా వేరే ప్లాట్‌ఫామ్‌నే రూపొందించి నిలదొక్కుకోవడం విశేషం. నిజానికి ఐబిఎం పర్సనల్ కంప్యూటర్ మన జీవన శైలిని మార్చేందుకు శ్రీకారం చుట్టినా, ఒక్కసారి ఆపిల్ మ్యాక్ కంప్యూటర్‌ను వాడితే మాత్రం, తిరిగి దానిని వదలడానికి ఎవరూ ఇష్టపడరు. ఆపిల్కు వీరాభిమానులుగా మారిపోవడం తథ్యం.
ఇదంతా స్టీవ్‌జాబ్స్ నవ్య ధోరణివల్లే సాకారమైంది. ఒక అనాధ బాలుడు, కాలేజీ చదువు సరిగ్గా కూడా పూర్తిచేయనివాడు, ఆకలి తీర్చుకోడానికి హరేకృష్ణ ఆశ్రమంలో అన్నదానం ద్వారా భోజనం వెదుక్కున్నవాడు, కేవలం 30 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి కోటీశ్వరుడైనాడంటే, ప్రపంచంలో తనకూ, తన సంస్థకూ, తన ఉత్పత్తులకూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకొన్నాడంటే అది సామాన్య విషయం కాదు. నేడు ఉద్యోగాలు దొరక్క కొందరు, చదువులో రాణించలేక ఇంకొందరూ బాధపడుతూ, ఆత్మన్యూనతాభావంతో కుంగిపోతూ, కుమిలిపోయేవారు స్టీవ్‌జాబ్స్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం ఎంతైనా సబబు. 24 ఫిబ్రవరి 1955నాడు జన్మించిన స్టీవ్‌జాబ్స్ ఎక్కని ఎత్తుల్లేవు, సాగని దూరాల్లేవు. ఎన్నో కష్టనష్టాలను అధిగమించాడు. కానీ క్యాన్సర్ కారణంగా 5 అక్టోబర్ 2011 నాడు మరణించాడు. తను బతికున్న కాల వ్యవధి తక్కువే అయినా, డిఫరెంట్‌గా జీవించాడు. బతికింది 56 ఏళ్ళే అయినా, కొన్ని వందల ఏళ్ళు పరిశ్రమిస్తే గానీ రానంత పేరూ, డబ్బూ సంపాదించాడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ స్టీవ్‌జాబ్స్‌తో సంబంధం ఉందిఅనేంత పరిస్థితిని నెలకొల్పాడు. ఎందుకంటే, ప్రపంచ జనాభా ప్రతి ఒక్కరివద్దా స్టీవ్ సృష్టించిన ఉపకరణాల్లో కనీసం ఒకటి ఉండే ఉంటోంది.

స్టీవ్‌జాబ్స్‌ను కొన్ని తరాల దాకా ఎవరూ మర్చిపోలేరు.
స్టీవ్‌జాబ్స్ బయోడేటా ఇదీ:
అసలు పేరు: స్టీవ్ పాలిస్
పుట్టిన తేది: 24 ఫిబ్రవరి 1955
తల్లిదండ్రులు: అబ్దుల్‌ఫత్తాజాన్ జాందలి, జోనె్నస్కీబిల్ (వీరికి పెళ్ళికాకుండానే)
పెరిగింది: అనాధ ఆశ్రమంలో
దత్తత తీసుకొన్నది: పాల్‌జాబ్స్, క్లారా
దత్తుపోయినతర్వాత పేరు: స్టీవ్‌పాల్ జాబ్స్
వాడుకలో పేరు: స్టీవ్ జాబ్స్
హైస్కూలు విద్య: 1972లో పూర్తిఅయ్యింది.
కాలేజీలో చేరడం: 1972లో పోర్ట్‌లాండ్ రీడ్ కాలేజి. చదివింది కేవలం 1 సెమిస్టరే.

ఆ తర్వాత ఎటోరీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. చిన్ననాటి మిత్రుడు స్టీవ్‌వోజ్నియాక్‌తో కలిసి అటారీ హోమ్ కంప్యూటర్‌కోసం బోలెడు గేమ్స్‌ను రూపొందించాడు. 1975లో, జాబ్స్ తన ఇంటి కారు గ్యారేజిలో పర్సనల్ కంప్యూటర్స్‌ను అసెంబిల్ చేయడం ప్రారంభించాడు. మిత్రుడు స్టీవ్ వోజ్నియాక్ కూడా తోడుగా నిలిచాడు. 1975 సంవత్సరాంతానికి బైట్ అనే వౌంటెన్‌వ్యూలోని కంప్యూటర్ అంగడి నించి వీరికి ఆర్డర్లు రానారంభించాయి. తాము అసెంబిల్ చేసిన కంప్యూటర్లకు ఆర్డర్లమీద ఆర్డర్లు రావడంతో ఆపిల్ కంప్యూటర్స్అని 1976 ఏప్రిల్ ఒక సంస్థను ఆరంభించాడు. ఎందుకో మరి, స్టీవ్‌జాబ్స్‌కు చిన్ననాటినించీ ఆపిల్అంటేనూ, ఆ పేరు అంటేనూ చాలా ఇష్టం. అందుకే ఆపిల్పేరునే ఎంచుకొని, బైట్‌ని సూచించే రీతిలో ఒకవేపు కొరికినట్లు (బైట్ అంటే కొరకడమనే ఇంగ్లీష్‌లో అర్థం) తన కంపెనీకి ఒక లోగోని రూపొందించాడు. వీరికి మైక్ మర్కుల్లా అనే ఇంటెల్ సంస్థ రిటైర్డు ఉద్యోగి ఆర్థికసాయం చేశాడు.

1976 అంతానికి సింగిల్ (మదర్) బోర్డ్‌ని కలిగిన ఆపిల్ ఐను రూపొందించి విడుదల చేశారు. దీనిలో పరిమిత సౌకర్యాలుండేవి. అంటే, ఆన్‌బోర్డ్ రామ్, వీడియో ఇంటర్‌ఫేస్, ఎక్స్‌టర్నల్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్- సౌకర్యాలు మాత్రమే ఉండేవి. ఐతే, మరి కొన్ని మార్పులతో 1977 ఏప్రిల్‌లో ఆపిల్ 2 అనే కంప్యూటర్‌ను విడుదల చేశారు. అత్యధికంగా అమ్ముడుపోయిన తొలి పర్సనల్ కంప్యూటర్ అది. దీనికోసం ప్రోగ్రామింగ్ చేయడానికి ఎందరో ప్రోగ్రామర్లను ఉత్సాహపరిచాడు జాబ్స్. ఆ రోజుల్లోనే 16వేల అప్లికేషన్స్ ప్రోగ్రామ్స్ దానిపై రూపొందాయంటే జాబ్స్ అందర్నీ ఎలా ప్రోత్సహించాడో తెలుస్తోంది. అదే సంవత్సరం, మార్కులా అనే ఇంటెల్ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన వ్యక్తిని తన ఆపిల్ సంస్థకు బాధ్యతలప్పగించి, తాను తరువాతి తరం పర్సనల్ కంప్యూటర్ యాకింతోష్ను రూపొందించే పనిలో నిమగ్నమైపోయాడు.
1980
లో ఆపిల్ సంస్థను పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా మార్చేశాడు. 5,6 ఏళ్ళకే ఒక చిన్న సంస్థ అలా పబ్లిక్ లిమిటెడ్‌గా మారిందంటే, అటు వినియోగదారులలో ఆపిల్‌పైన క్రేజ్, ఇటు జాబ్స్ దక్షతా- రెండు మనకు ఇట్టే తెలిసిపోతాయి. ఐతే, మధ్యలో జాబ్స్ ఆపిల్ నించి తప్పుకున్నా, ఆపిల్-2 కంప్యూటర్ విషయంలో సమస్యలు తలెత్తడంతో మైక్ మార్కులా చైర్మన్ పదవి నించి తప్పుకుని తిరిగి ఆ పదవిని స్టీవ్‌జాబ్‌కే అప్పగించాడు.
‘1983
ఏప్రిల్ను ప్రపంచ ఎలక్ట్రానిక్ విజ్ఞాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆపిల్ మాకింతోష్కంప్యూటర్ విడుదలయ్యిందీ నెలలోనే. నాటికీ, నేటికీ మాకింతోష్లేదా మాక్ అనే పేరు నూతనత్వానికీ, కొంగ్రొత్త ప్రయోగాలకీ మారుపేరుగా నిలిచిపోయింది. ఆ ఏడే సిఇఓగా జాన్‌స్కల్లీని నియమించాడు జాబ్స్. ఐతే, కొద్దిరోజులకు వీరిద్దరిమధ్య జరిగిన ఆధిపత్యపు పోరులో బోర్డు సభ్యులు సైతం జాన్నే సమర్ధించడం వల్ల, జాబ్స్ ఆపిల్‌ని వదిలేయక తప్పలేదు.
ఐతే, విభిన్న, వినూత్న ధోరణులకు మారుపేరైన జాబ్స్ ఊరుకోలేదు. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అనే సంస్థను ప్రారంభించారు. 1986లో జార్జి లూకాస్ నుంచి పిక్సార్ అనిమేషన్ స్టూడియోస్అనే సంస్థను కొనేశాడు. దాంతో ఏకంగా సినిమా నిర్మాణ రంగంలోకే ప్రవేశించాడు. టిన్‌టోయ్అనే యానిమేషన్ చిత్రాన్ని రూపొందించాడు. అది యానిమేషన్ కేటగిరీలో అత్యుత్తమ చిత్రంగా అకాడమీ అవార్డ్‌ను పొందింది. 1995లో వాల్ట్ డిస్నీ సంస్థ పిక్సార్ సంస్థ పూర్తిస్థాయిలో రూపొందించిన టోయ్ స్టోరీని విడుదల చేయడంతో పిక్సార్అనేది అత్యుత్తమ యానిమేషన్ సంస్థగా పేరుపొందింది.
1995
లో ఎ బగ్స్ లైఫ్, 1999లో టోయ్ స్టోరీ-2 అనే చిత్రాలను నిర్మించి మొత్తం మూడు సినిమాలకూ కలిపి దాదాపు 1.2 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసిందీ జాబ్స్ సంస్థ అయిన పిక్సార్. 2001లో నాలుగో చిత్రంగా మోన్‌స్టర్స్ అనే దాన్ని నిర్మించినా, అదీ విజయఢంకాని మోగించింది.
1996
లో నెక్స్ట్ సంస్థ నష్టాల్లో కూరుకుపోయి వుండగా, తిరిగి ఆపిల్ సంస్థ ద్వారా దానిని కూడా కొనుగోలు చేయించాడు. ఆపిల్‌కు తిరిగి కన్సల్టెంట్‌గా చేరాడు. 1999లో తిరిగి దానికి సిఇఓగా మారాడు. 1997లో తనకు వ్యాపారంలో శత్రువైన బిల్‌గేట్స్‌ని ఆపిల్ సంస్థలో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టేందుకు ఒప్పించాడు. విజయుడైనాడు. 1990వ దశకపు సంచలనంగా ఐమాక్కలల పీసీ అంటూ కొత్త పీసీని మార్కెట్‌లోకి తెచ్చాడు. 1991లో లారెన్స్ పావెల్‌ను పెళ్ళాడిన స్టీవ్‌జాబ్స్‌కి ముగ్గురు
పిల్లలు. వీరు కాకుండా పెళ్ళికిముందే డేటింగ్ చేస్తూండగా, (తన 23వ ఏట) పుట్టిన ఒక కూతురు కూడా ఉంది.
కంప్యూటర్ రంగం ఆరంభపురోజుల్లో నేను వ్యాపారంలోకి అడుగుపెట్టడం నిజంగా అది నా అదృష్టం అన్న జాబ్స్, చివరిదాకా పనిచేయడమే తన జీవిత ధ్యేయంగా భావించాడు అన్ని విలక్షణ లక్షణాలుండబట్టే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆపిల్ అంటే, స్టీవ్‌జాబ్స్ అంటే కొంగ్రొత్త ఆలోచనలకు ప్రతిరూపాలనిచ్చేది అనే భావన ప్రజల మనస్సులో నాటుకుపోయింది.
పెద్దపెద్ద బీరువాల పరిమాణంలోని ఎలక్ట్రానిక్ కంప్యూటర్లకు నానో టెక్నాలజీని వాడి, తక్కువ బరువు, ఎక్కువ స్టోరేజీ ఉండేలా కంప్యూటర్లనూ, స్మార్ట్ ఐఫోన్‌నూ, ఐపాడ్‌ను రూపొందించాడు జాబ్స్. టచ్‌స్క్రీన్ టెక్నాలజీని వాడి స్మార్ట్‌గా మొబైల్ ఫోన్స్‌ను రూపొందించవచ్చన్నదీ, అలాచేసి చూపిందీ స్టీవ్‌జాబ్స్, ఆపిల్ లే. త్రీజీ సౌకర్యంతో అటు ఫోన్‌గా, ఇటు పర్సనల్ కంప్యూటర్‌గా కూడా పనిచేసే సత్తాగల టాబ్లెట్ పీసీ సమకాలీన ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకొంటోందంటే అది ఎంతమాత్రమూ అబద్ధంకాదు.
ఎంపి3ప్లేయర్కు పర్యాయపదం ఐపోడ్
2001 దాకా ఎంపి3 ప్లేయర్ అనేది కొందరు మాత్రమే వాడేవారు. ఆపిల్ సంస్థ ఐపోడ్‌ను 2001లో ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడంతో సంగీత ప్రియ ప్రపంచంలో సంచలనం ఏర్పడింది. అందర్నీ ఆశ్చర్యంతో ముంచెత్తింది. కారణం ఏమిటంటే, అప్పటికి ఎంపి3 ప్లేయర్ మార్కెట్ చాలా చిన్నది.

ఐపోడ్‌లో 5జిబి మెమరీని ఉంచడమేకాకుండా, ‘మీ పాకెట్ లో వెయ్యి పాటలుఅనే స్లోగన్‌తో హిట్టయ్యింది. దీనిని మాకింతోష్ లేదా పీసీలకు కనెక్ట్ చేసుకొని, ఐట్యూన్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎంపీ3 పాటలను దానిలోకి కాపీచేసుకొనే వెసులుబాటుతోబాటు, ఆన్‌లైన్‌గా ఐట్యూన్స్ సైటుకు కనెక్టయ్యి పాటలు కొనుక్కొనే వీలు కల్పించింది ఆపిల్. ఐపోడ్ రంగప్రవేశంతో పోర్టబుల్ ఆడియో రంగం విప్లవాత్మక మార్పులకు దారితీసింది. వాక్‌మాన్, కాసెట్స్, సిడిప్లేయర్, సిడీలు- అన్నిటినీ మూలన పడేసేలా చేసింది. ఐపోడ్ యువతకొక ఐకాన్‌లా మారిపోయింది. ఐపోడ్ షఫుల్ అనేది 2005లో 512 ఎంబి నించి 1 జిబి కెపాసిటీ దాకా ఉండేలా మార్కెట్‌లోకొచ్చి విజయాన్ని సాధించింది. 2001 నించి ఇప్పటిదాకా ఐపోడ్‌లో సామర్థ్యం, పనితనం వంటి అనేక అంశాల్లో ఎన్నో మార్పు చేర్పులొచ్చాయి.

***************************************
అంతా స్మార్ట్- ఫోన్‌తో సహా!
అంతా స్మార్ట్‌గా ఉండాలి. మొబైల్ ఫోన్ అంటే, పాత కాలం ఫోన్‌లా ఉండకూడదు. ఇలా తాకితే అలా పనిచేయాలోయ్! అనుకొన్నాడో ఏమో! స్టీవ్‌జాబ్స్ అనుకోడమే తరువాయి. ఐఫోన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే ఐపోడ్ ద్వారా ప్రజల నాడిని పసికట్టిన జాబ్స్ ఐఫోన్-మీ స్మార్ట్ ఫోన్ అంటూ దుమారానే్న లేపాడు. 8/16 జిబి ఫ్లాష్ మెమరీలతో, కెమెరాతో, ఇంటర్నెట్ సౌకర్యంతో, బ్రౌజింగ్‌తో టచ్ స్క్రీన్ సౌకర్యంతో విలక్షణమైన ఐఫోన్ను 2007 మే నెలలో విడుదల చేశాడు. ఈ మొబైల్ స్మార్టీకి దాదాపు 300 పేటెంట్లున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇదొక నవతరం కంప్యూటర్. 2 మెగాపిక్సెల్ కెమెరా 2008 నాటి దాకా ఒక అద్భుతం. అదీ ఒక మొబైల్‌లో, వైఫీ సౌకర్యం, ఏకధాటిగా 8 గంటలు మాట్లాడుకోగల సౌకర్యం, 6 గంటల ఏకధాటి ఇంటర్నెట్ బ్రౌజింగ్, 24 గంటలపాటు పాటలు వినే సౌలభ్యం, 7 గంటల ఏకబిగిన వీడియో వీక్షించడం- ఇన్ని సౌకర్యాలూ ఒక్కసారి ఫుల్‌గా ఛార్జిచేస్తే చాలు. ఇన్ని అద్భుతాలు వేరే ఎందులోనూ లేకపోవడంతో జనాలు వెర్రెత్తి పోయి, చకచకా కొనేశారు. దీని ఎత్తు 115 మి.మీ, వెడల్పు 61 మి.మీ, అయితే మందం 11.6 మి.మి. మాత్రమే. బరువు కూడా కేవలం 135 గ్రాములే.
స్టీవ్ జాబ్స్ తన 17 ఏటే, జీవితసారాన్ని చదివేశాడనిపిస్తుంది. ‘‘ప్రతిరోజూ, ఇదే నా ఆఖరిరోజు అని నీవు అనుకొని బతికితే, ఏదో ఒక రోజు నీవు అత్యున్నత స్థానంలో ఉంటావ్’’ అని ఒక వాక్యం ఏదో పుస్తకంలో చదివాడు. అది ఒంటపట్టించుకొన్నాడు. ‘‘ఈరోజే నా ఆఖరి రోజు అనుకొని, ఈరోజు చేయాల్సిన పనులేమున్నాయి? ఏం సాధించాలి?’’ అని తనకుతాను రోజూ ప్రశ్నించుకోబట్టే గొప్ప ద్రష్టగా ఎలక్ట్రానిక్స్ రంగంలో నిల్చిపోయాడు. మరణం మనలను నిద్రపోనీదుఅని నమ్మే స్టీవ్‌జాబ్స్‌ను 2004లో క్యాన్సర్ రూపంలో నేనున్నాను సుమా!అంటూ పలకరించింది.
‘‘
చావాలనీ, ఈ లోకంనించి వెళ్ళిపోవాలనీ ఎవరికుంటుంది చెప్పండి! కానీ, తాత్వికంగా మనం యోచిస్తే, అదో వినియుక్తమైన కానె్సప్ట్. మరణానికి భయపడ్తూ బతికాను. ఆ భయమే నన్ను

ఈరోజు ఇంత స్థాయికి తెచ్చింది. క్యాన్సర్ రూపంలో నన్ను బెదిరించింది. ఐతే, నాకు భయంలేదు. ఎందుకంటే, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నాకంటూ కొన్ని విజయాలున్నాయి. నేనంటూ ఉండేవాడినని అందరూ అనుకోడానికి బోలెడు కారణాలున్నాయి. ఆనందాలున్నాయి. ప్రేమించేవారున్నారు.’’ అన్న స్టీవ్‌జాబ్స్‌లో మనకు ఒక గొప్ప వేదాంతి కనిపిస్తాడు. అక్కడితో ఆగలేదు జాబ్స్.
‘‘
ఈ భూమీద మనుష్యులందరూ సమానంగా పంచుకొనేది ఒక్క మరణమే. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం ఎదురయ్యేవన్నీ (అవమానాలూ, ద్వేషాలూ వగైరా) దానిముందు సమానమైపోతాయి. మనం ఈ భూమీద ఏం వదిలివెళ్తున్నాం అన్నదే ముఖ్యం.
సాటి వారికి ఎంత సాయం చేశాం? ప్రపంచానికి మనవంతుగా ఏం అందించాం! ఎంత ప్రేమను పొందాం- అన్నదే శాశ్వతం’’ అని విశే్లషించాడాయన. దాదాపు 35 ఏళ్ళపాటు ప్రపంచానికి ఎనలేని సేవ చేశాడు. 35 ఏళ్ళలోనే నూరేళ్ళ అనుభవాన్ని రంగరించిపోశాడు. తనొచ్చిన పనైపోయిందని తెలిసిపోయింది. అందుకే, ముందే ఆపిల్ సంస్థ పగ్గాలను మరొకరికి అందించి, నేను ఇంకా వెళ్ళిపోలేదు. పోయేదాకా ఆపిల్తోనే వుంటాను చేదోడువాదోడుగా. మన లక్ష్యం బలంగా ఉండాలి. ఎలాటి అనుకోని పరిణామాలు ఎదురైనా మనం మనస్సు మార్చుకోకూడదు. అపుడే ఆ పరిణామాలు మనలను విజయపథంలో నడిపిస్తాయి’’ అన్నాడు. చెప్పడం కాదు. చెప్పింది చేసి చూపించడం స్టీవ్‌జాబ్స్ గొప్పదనం. అతని 56 ఏళ్ళ సంక్షిప్త జీవన స్రవంతి ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.

****************************************
అపర విశ్వామిత్ర సృష్టి
స్టీవ్‌జాబ్స్‌ను విశ్వామిత్రునితో పోల్చడం రైటు. విశ్వామిత్రుడు కేవలం ఒకరోజు (త్రిశంకుడు) స్వర్గానికి పోవాలని నిశ్చయించినపుడు, స్వర్గ ప్రవేశం దొరక్కపోతే, అతనికోసం ఏకంగా ఒక స్వర్గానే్న సృష్టించాడు. ఐతే, స్టీవ్‌జాబ్స్ విషయంలో కొంత తేడా. అతను విభిన్నంగా ఆలోచించి, ఎలా వుంటే వినూత్నంగా, వైవిధ్య భరితమైన గాడ్జెట్లను సృష్టించవచ్చో తెల్సుకొన్నాడు. అందరూ ఐబిఎం పర్సనల్ కంప్యూటర్ వైపు పరిగెత్తుతుండగా ఆపిల్-మాక్, ఐమాక్ పీసీ ఇది మీ కలలకు సాకారం అన్నాడు. వౌస్ వౌస్ అంటూంటే స్క్రోలింగ్ ఉండే వౌస్‌ను రూపుదిద్దాడు. అందరూ ఎంపి3 ప్లేయర్స్ అంటే, జాబ్స్ మాత్రం ఐపోడ్, మ్యూజిక్ స్టోరీ, ఐట్యూన్స్ అన్నాడు. వాక్‌మెన్‌లకీ, క్యాసెట్లకీ మంగళం పాడేశాడు. ప్రజలకు వెర్రెత్తెక్కించాడు. లోకమంతా మొబైల్ ఫోన్ అంటూంటే , కొశ్చనే లేదు. ఇదిగో స్మార్ట్ ఫోన్అన్నాడు. ఇంటర్నెట్టూ దాన్లోనే అన్నాడు. అందరూ, ల్యాప్‌టాప్, నోట్‌బుక్స్ అని అనడం మొదలెట్టాక, అదేమీ అక్కర్లా! ఇదిగో ఐప్యాడ్ అంటూ టాబ్లెట్ పీసీని పుట్టించేశాడు. ఇది ఫోన్‌కెక్కువ, పీసీకి తక్కువ. ఇంకాస్త సమయాన్నిచ్చి వుంటే, ఇంకేం చేసేసేవాడో! తెలీదు!!
***********************************************

తన మరణాన్ని ముందే పసిగట్టిన వేదాంతి!
స్టీవ్‌జాబ్స్ తాను 5, అక్టోబర్ 2011నాడే మరణించబోతున్నట్టు ముందే తెల్సుకొన్నాడా? ఏమో! ఔననే అనిపిస్తోంది. 4 అక్టోబర్‌నాడు ఐఫోన్ 4ఎస్ విడుదలైంది మార్కెట్లో. మరుసటిరోజే జాబ్స్ చనిపోవడం ప్రపంచాన్ని కలచివేసింది. 5వ తేదీనే పోతానని అతను పసిగట్టకపోయి వుండొచ్చు గానీ, ఫిబ్రవరిలో వైద్యపరీక్షల తర్వాత, అతనికి తాను ఇక ఆట్టే బతకడం కష్టంఅని తెల్సిపోయింది. వరసగా తన మిత్రులను కలవడం, పార్టీ చేసుకోవడం అందరికీ గుడ్‌బై చెప్పడం అతనికి మామూలైపోయింది. ఎవరన్నా రేపు కలుద్దాం! లే!అంటే, ‘క్వొశ్చనే లేదు’, రేపు సంగతి ఎవరికెరుక! అనే వాడు. చనిపోయే ముందు కొద్దివారాలుగా, బాగా నీరసించి పోయాడు. ఎంత నీరసించి పోయాడూ అంటే, కనీసం కాస్త దూరం అడుగులు వేసి (తనింట్లోనే) మెట్లదాకా కూడా రావడానికి కష్టపడిపోయాడు. ఐఫోన్ 4ఎస్ రేపు విడుదలౌతుందనగా, 3వ తేదీ నాడు దాని గురించి ఆపిల్ అధికారులకు తగిన సలహాలనిచ్చే నిబ్బరం కేవలం జాబ్స్‌దే. చివరి వారాల్లో ఎక్కువసేపు తన కుటుంబంతోనే గడిపాడు. జాబ్స్ జీవితచరిత్ర మరికొన్ని వారాల్లో విడుదల కానుంది. దీన్ని ఐసాక్సన్ రాశాడు. చివరి రోజుల్లో చాలా సెంటిమెంటల్గా తయారైన, జాబ్స్, తన కుటుంబం, తన ఆపిల్ సంస్థ, ఆపిల్ సభ్యులు- వీరి గురించే ఎక్కువగా ఆలోచించాడు. వారందరినీ వదిలి వెళ్ళిపోతూన్నందుకు బాధపడ్డాడు. ఎన్నో సంస్థలు, ఎందరో ప్రముఖులు జాబ్స్‌కు వీడ్కోలు పలికే రీతిలో డిన్నర్లూ, పార్టీలూ పెట్టి ఆహ్వానిస్తే, ఆయన వాటన్నిటినీ తిరస్కరించాడు. ఆఖరుకి అవార్డులువరిస్తామని వచ్చినా, వాటిని లెక్కచేయలేదు.

ఆపిల్ ఐమాక్- మీ కలల పీసీ
కంప్యూటర్ వినియోగదారుల కలల రాణిగా ఆపిల్ మాక్ (ఐ-మాక్) పీసీని ఆపిల్ సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. నవ్యతనూ, నాణ్యతనూ జోడించి 1299 డాలర్లకే 1998 మే నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టి విజయాన్ని సాధించింది. కేవలం 6 నెలల్లో 2.8 లక్షల ఐమాక్ పీసీలను అమ్మింది. ఐ-మాక్ అంటే, ఇంటర్నెట్ మాకింతోష్ అనడానికి క్లుప్త రూపం. ఇందులో మోటరోలా జి3 అనే 233 మెగా హెర్ట్‌జ్ శక్తిగల సిపియూని వాడింది ఆపిల్. ఇతర పీసీల్లాగా కాకుండా దాదాపు కంప్యూటర్ అన్ని భాగాలూ మానిటర్ షెల్‌లోనే ఇమిడిపోవడం విశేషం. 32 ఎంబిరామ్, 15’’ మానిటర్‌తో, 66 మెగాహెర్ట్‌జ్ శక్తిగల పిసిఐ సిస్టం బోర్డ్‌తో అప్పట్లో చక్కని పీసీగా పేరుపొందింది. దీంట్లోనే మోడెం కూడా ఉంది. ఇంటర్నెట్ కనెక్టవడానికి వీలునిచ్చిన ఐమాక్ ఇండియాలో మాత్రం ఆట్టే విజయం సాధించలేదు.

ఐపాడ్- పీసీకి తక్కువా, ఐఫోన్‌కెక్కువా!
ల్యాప్‌టాప్‌కన్నా చిన్నది నోట్‌బుక్. దానికన్నా చిన్నది టాబ్లెట్. టాబ్లెట్ పీసీ అనేది ఆడియో-విజువల్ మీడియాకోసం ప్రత్యేకంగా ఒక ఉపకరణం. ఇది స్మార్ట్ ఫోన్‌లకన్నా ఎక్కువ, పీసీలూ ల్యాప్‌టాప్‌లకన్నా తక్కువనూ, ఐఫోన్, ఐపోడ్ టచ్ లాగానే ఐపాడ్ అనేది ఆపిల్ సంస్థ రూపొందించిన మరో వినూత్న ఆవిష్కరణ. ఇది టచ్ స్క్రీన్‌తో (అదీ మల్టీ టచ్‌తో) పనిచేసే డిస్‌ప్లేని కల్గి ఉంది. మిగతా టాబ్లెట్‌లలో ఈ సౌకర్యం లేదు. ఇందులో వయర్లెస్ లాన్- వైఫీ పరిజ్ఞానాన్ని వాడుతోంది. 3జి నెట్‌వర్క్‌కు కూడా కనెక్టవ్వవచ్చు. ఐట్యూన్స్‌తో (పీసీ నించి) యుఎస్‌బి కేబుల్ ద్వారా సింక్ చేసుకోవచ్చు. తొలి ఐపాడ్ 2010 ఏప్రిల్‌లో విడుదల చేసి విజయఢంకా మోగించిన ఆపిల్ కేవలం 80 రోజుల్లో 3 మిలియన్ ఐపాడ్‌లను అమ్మింది. 2010 మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా 14.8 మిలియన్ ఐపాడ్‌లు అమ్ముడుపోయాయి. ఇటీవల, అంటే మార్చి 2011నాటికి ఐపాడ్ 2 రిలీజైంది. ఇది తొలివర్షన్ కన్నా చాలా పల్చగా, రెండు రంగుల్లో దొరుకుతోంది. ఇందులోని డ్యూయెల్‌కోర్ ఆపిల్ ఎ5 ప్రాసెసర్ గత వెర్షన్ ప్రాసెసర్‌కన్నా రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది. జపాన్‌లో సునామీ వచ్చిన దృష్ట్యా, అక్కడ తప్ప ప్రపంచంలోని 25 దేశాల్లో ఐపాడ్ 2 విడుదలైంది.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల మాంత్రికుడు

* స్టీవ్ జాబ్స్ ఒక ద్రష్ట. కంప్యూటర్ రంగంలో నవ కల్పనలకు ఆద్యుడు. సదా మనం సంప్రదించి, సమాచారాన్ని పంచుకోవడానికి కొత్త మార్గాలు చూపాడు.
-
డా.మన్మోహన్‌సింగ్, భారత ప్రధాని
*
అమెరికాలోని గొప్ప ద్రష్టల్లో స్టీవ్‌జాబ్స్ ఒకరు. విభిన్నంగా ఆలోచించే ధైర్యం కలిగి, ప్రపంచానే్న మార్చేయగలనని నమ్మి గొప్పగా చెప్పగలిగినవాడు, మార్చి చూపించే సత్తా కల్గినవాడు జాబ్స్.
-
బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షులు
*
స్టీవ్ మంచి స్నేహితుడు. గట్టి పోటీదారు. ప్రపంచంలో అలాటివాళ్ళు అరుదుగా కనిపిస్తారు. అతను ప్రపంచానికి తెచ్చిన విప్లవాత్మక మార్పుల ఫలితాలు మరికొన్ని తరాలదాకా అనుభవిస్తూంటాం.
-
బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత
*
థామస్ ఎడిసన్‌లాటి గొప్ప ఆవిష్కర్త స్టీవ్‌జాబ్స్. అతను ప్రపంచానే్న మన వేలికొసల్లోకి తెచ్చేశాడు.
-
స్పీల్‌బర్గ్, ప్రఖ్యాత అమెరికన్ సినీ దర్శకుడు
*
ప్రపంచానికి కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ, చేతిలో ఇమిడిపోయే ఐపాడ్, ఐఫోన్‌లను సృష్టించిన ఘనత స్టీవ్‌జాబ్స్‌దే!
-
నారా చంద్రబాబునాయుడు, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

2 comments:

  1. రమణ గారూ,
    కొంచెం ఆలస్యంగా మీ కథనం చూస్తున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా చాలా బాగుందీ కథనం. తెలుగు బ్లాగుల్లో వచ్చిన అన్ని కథనాలకంటే బాగుంది. నేను నెలవంక బ్లాగులో స్టీవ్ జాబ్స్ పై తక్షణ స్పందనగా కథనం ప్రచురించాక అదనపు అంశాలను విస్తృతంగా సేకరించాను. మనిషి జీవితంలో టెక్నాలజీ ప్రాధాన్యత ఏమిటి అనేది స్టీవ్ మాటల్లోనే పేర్కొంటూ విస్తృత కథనం రాయాలనుకున్నాను. కాని గత నెలరోజులుగా నా చందమామలు బ్లాగు పనిచేయకపోవడం - రెండురోజులనుంచి ఇది పనిచేస్తోంది.- ఇంట్లో సిస్టమ్ పాడవటం, మోడెమ్ డామేజ్ కావడం. కొత్త సిస్టమ్ కోసం ప్రయత్నం.. ఇలా సమస్యలు ఎదురై ఏమీ చేయలేకపోయాను.
    స్టీవ్ జాబ్ స్వయంగా టెక్నాలజీకి మితిమీరిన ప్రాధాన్యత లేదని, ఇవ్వవలసిన అవసరం లేదని జీవితాన్ని సరళీకరించడం, సౌకర్యవంతం చేయడం వరకే దాని పాత్ర ఉంటుందని స్పష్డంగా చెప్పారు. దీన్ని మీ కథనంలో కొంచెం హైలైట్ చేసి ఉంటే బాగుండేది.
    ఇది మినహా మీ కథనం చక్కటి శైలితో తయారైంది. అభినందనలు.

    నాకొక్కటే అభ్యంతరకరమైనది. స్టీవ్‌పై సంతాప ప్రకటనల్లో మన రాజకీయ నేతల ప్రకటనలను పరిహరించి ఉంటే బాగుండేది. ఒబామాలు, మన్మోహన్‌లు, చంద్రబాబుల వంటి వారి ప్రకటనలు, సంతాపాల నుంచి మనం నేర్చుకునేది ఏమీ లేదని నా నిశ్చితాభిప్రాయం. మన దేశానికి, ప్రవంచానికీ వీళ్లు చేసిన, చేస్తున్న నిర్వాకాలు చాలు అనే నా ఉద్దేశం. అందుకే ఉద్దేశపూర్వకంగా నా నెలవంక బ్లాగులో వీరి తరహా ప్రకటనలు ప్రచురించలేదు.

    మంచి కథనం అందించినందుకు మరోసారి అభినందనలు.

    ReplyDelete
  2. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా. ధన్యవాదాలు...
    రమణ

    ReplyDelete