Tuesday, October 11, 2011

స్టీవ్ జాబ్స్ జీవితం నుంచి తెల్సుకోవాల్సిన విషయాలు.


నేనేం చెప్పానంటే...

- సాయి అయితిక, October 11th, 2011  ఆంధ్రభూమి డైలీనించి నా వ్యాసం.

నేటి యువతను ఉర్రూతలూగించిన ముఖ్యమైన ఆవిష్కారాల్లో ఐపోడ్- ఐఫోన్- ఐప్యాడ్. ఈ మూడు చెప్పుకోదగ్గవి. మొదటిది సంగీతాన్ని ఎలా మోడర్న్‌గా ఆస్వాదించాలో నేర్పింది. రెండోది సదా ఎలా టచ్‌లో ఉండాలో చెప్పింది. మూడోది స్టైలుగా ఫోను, కంప్యూటరూ ఇంటర్నెట్టూ ఎలా వాడుతూ మొబైల్‌గా ఉండాలో చెప్పింది. ఈ మూడు ఆవిష్కారాల వెనక ఉన్నది ఒకే వ్యక్తి. అతడే స్టీవ్ జాబ్స్. యుతవకు అతను ఈ మూడు కానుకలనే కాదు అద్భుత సందేశాలనూ ఇచ్చాడు. వాటిని గురించీ కాస్త తెల్సుకోండి.
మొదటిది: మనం బతికేది చాలా తక్కువ కాలం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి పని కూడా ఈవేళే చేయాలి.
రెండోది: విభిన్నంగా వినూత్నంగా ఆలోచించు. ఇలా ఆలోచించడానికి ధైర్యం కావాలి. దాన్ని ఆచరణలో పెడతాననే దమ్ముండాలి. ఆచరించి గెలుస్తాననే ధీమా ఉండాలి.
మూడోది: టెక్నాలజీ ఒక్కటే ప్రాణం కాదు. టెక్నాలజీని వాడి సరళమైన కళలతో, మానవత్వానితో ముడిపెడితేనే ఫలితం ఉంటుంది. మన హృదయాలు కదలి పాటలు పాడతాయి.
అతను అనాధగా పుట్టాడు. అది కూడా వారి పెద్దల పెళ్ళికాకుండానే. అంతమాత్రాన కుంగిపోలేదు. ఎవరో దత్తత తీసుకొన్నారు. కాలేజీ చదువులోకి చేర్పించారు. అయనా చదువెందుకో బుర్రకెక్కలేదు. కాలేజీ నుంచి అర్ధాంతరంగా మానేశాడు. అప్పుడూ కుంగిపోలేదు. దేనికీ బెదరలేదు. అతని ఆలోచనలు చెదరలేదు. కానీ తన ఆవిష్కరణలతో ప్రపంచానే్న మార్చేశాడు. అతను లేకుంటే యాక్పీసీ లేదు. అతను లేకుంటే ఐపోడ్ లేదు. అతను లేకుంటే స్మార్ట్ ఫోన్ లేదు. అతను లేకుంటే పీసీ టాబ్లెట్ ఐప్యాడ్ లేదు.
ఇంతా జేసి అతనెంతో పేదవాడుగా ఉండేవాడు. పూట గడవకపోతే కోక్బాటిళ్ళపై ఖాళీ మూతలు అమ్మి జీవించాడు. ఆకలో రామకృష్ణాఅంటూ వారానికోపూట హరేకృష్ణ ఆశ్రమంలో పెట్టే ప్రసాదం తింటూ బ్రతికాడు. ఇంతలో తానుంటున్న ఇంటి కారుషెడ్డులో చిన్నచిన్నసైజు కంప్యూటర్స్‌ను అసెంబ్లింగ్ చేసి అమ్మడం ఆరంభించాడు. ఇంతై వటుడింతై అన్నట్టు ఆపిల్ సంస్థను స్థాపించాడు.
ఎన్నో దెబ్బలు తిన్నా కుంగిపోను మాత్రం కుంగిపోలేదు. సదా కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆవిష్కారాలు. ఈ రెంటి కలబోతగా స్టీవ్ జాబ్స్నేటి యువతకే ఆదర్శప్రాయుడై నిలిచాడు. దృఢ చిత్తం, సత్సంకల్పం - ఉంటే యూత్‌గా మీరింకెంతో చేయగలరు. నేడు చదువులో రాణించక కొందరు, ఉద్యోగం రాలేదని ఇంకొందరు బాధపడుతూ, కుంగిపోతూ, తమను తాము హింసించుకుంటూ ఇంట్లో వారినీ హింసిస్తూ, కుమిలిపోయే యూత్ స్టీవ్ జాబ్స్ జీవితం నించి నేర్చుకోవాల్సిదెంతో ఉంది. అతను జీవించింది 56 ఏళ్ళే. కానీ వందల ఏళ్ళ అనుభవాన్ని సంపాదించాడు. కొన్ని తరాల దాకా తరగని పేరుసంపాదించుకొన్నాడు. అందుకే ఎన్నాళ్ళు బతికాం అన్నది కాదు. ఎంత నాణ్యతగా బతికాం! ఎన్ని మంచి పనులు చేశాం! అనేది ముఖ్యం. ఏదో ఆస్తి పంపకాల్లో తనకర్హత లేకున్నా నాకు పది లక్షలు ఇస్తేనే సంతకం పెడతాననే ఉల్ఫారాయుళ్ళూ, అమ్మానాన్నా చక్కగా చదివించేద్దామనుకొన్నా, జులాయిగా తిరిగే జులాయిరాయుళ్ళూ కూడా తెల్సుకోవాల్సిందిదే.
మనం వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. బతికి ఉన్నప్పుడు సంపాదించేది మంచి పేరుగా ఉంటే అది మనం పోయాక కూడా మనలను బతికిస్తుంది. అదే స్టీవ్ జాబ్స్జీవిత సందేశంగా యూత్ భావించి, కష్టపడితే ఇక భారతదేశానికి తిరుగులేదు.

1 comment: