Monday, November 12, 2012

దీపావళి నవ్యకేళి


వెలుగుల కేళి

  • 11/11/2012
  • వి.వి.వి.రమణ

మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యత ఉంది. మన జాతి సంస్కృతికి ప్రతిబింబాలే మనం జరుపుకునే పండుగలు. వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఆనందోత్సాహాలతో చిన్నా, పెద్దా తేడా లేకుండా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా అంటారు. జగతిని జాగృతం చేసే చైతన్య శోభావళి ఈ దివ్య దీపావళి. మన చుట్టూ ఆవరించుకున్న చీకటినే తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది అన్నది ఆర్యోక్తి.

జన జీవితంలో భాగం దీపావళిపంచ భూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగానూ ప్రసాదిస్తుంది. అందుకే భారతీయులు అనాదిగా అగ్ని సాక్షిగానే ప్రతి పనీ చేస్తున్నారు. దీపాలను వెలిగించడం ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలం, పసుపు, తెలుపు-ఈ మూడు రంగులు మానవునిలో ఉండే సత్త్వ రజ స్తమో గుణాలకు ప్రతీకగా చెబుతుంటారు.ఈ మూడు రంగులను జగత్తును పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం అని. దీపాలను వెలిగించడం ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లు, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతంగా భారతీయులంతా నమ్ముతారు. స్వామి దయానంద సరస్వతి హిందూ ఆధ్యాత్మికత యొక్క గొప్పదనాన్ని చాటడానికే అన్నట్టు, అమావాస్య రోజునే సన్యాసాన్ని స్వీకరించారు.భారతీయతలో భాగంగా దీపావళి పండగ ఒక పర్వదినంగా, జీవితంతోపాటు జీవితంలో భాగంగా వస్తోంది. అందుకే ఒక సినిమా కవి దీపావళిని చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళిఅని బహుచక్కగా వివరించాడు. దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకోలేదు అన్నది సత్యమే. కానీ, చెంత దీపం లేకుండా చీకటి పోదు కదా. దీపం పేరు చెబితే చీకటి పోతుందా అనే సామెత ఎలాగూ ఉంది. చీకట్లో చేసిన పనులను దుష్కార్యాలుగా జమకడ్తారు. ఈ భావానే్న, చీకటి మనసులతో చేసిన పాపాలను గురించి ఆర్పేసిన దీపం వాంగ్మూలం ఇస్తుందని చెప్తారు. చీకటి బజారు అన్న పదం కూడా చాలా ప్రతికూలంగా చెప్పుకోవడం కూడా పరిపాటే.అజ్ఞానాన్ని పారద్రోలేదే జ్ఞాన దీపం’ ‘ఊరికి దీపం బడి-మనిషికి దీపం నడవడిఅని నానుడి. అసలు దీపాలను ఎందుకు వెలిగిస్తామూ అంటే మనలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే ప్రకాశాన్ని ఇమ్మని ఆ దేవదేవుని వేడుకోడానికన్నమాట. ఆ దీపం ఎలా ఉండాలంటే, మట్టితో రూపొందిన మన దేహం లాంటి ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తితో జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి.దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే॥ అని కొందరంటే దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హారతే పాపం సంధ్యా దీప నమోస్తుతే॥ అని మరికొందరంటారు.దీపం జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుకే ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ మనం దీపాన్ని వెలిగించే వేళ విధిగా పఠించాలని పెద్దలు చెబుతారు.కామ, క్రోధ, లోభాలు నరకానికి కారణాలు అని గీతాచార్యుడు వివరించాడు. వీటిని జయించాలంటే, అజ్ఞానాంధకారాన్ని జయించాలి. ఈ అంధకారాన్ని జయించేందుకు జ్ఞానదీపాన్ని వెలిగించాలి. జీవితాలను నరకప్రాయం నుంచి రక్షించేందుకు మనందరికీ కావలసింది అదే. భక్తి వైరాగ్యాలతో అజ్ఞానాంధకారాన్ని ఎదుర్కొని జ్ఞాన జ్యోతిని వెలిగించాలనే విశిష్టమైన సందేశాన్ని ఈ దీపావళి మనకు నిత్యం అందిస్తూనే ఉంది. దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుతించడం సంధ్యా సమయంలో దీపాన్ని దర్శించడం, దీపానికి నమస్కరించడం మనకు సదాచారం. సత్సంప్రదాయం.

దీపం దైవ స్వరూపంసాధారణంగా త్రయోదశినాటి సాయంకాలం నాడు ఇంటి వెలుపల యముడి కోసం దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుందంటారు. దానికే యమదీపం అని పేరు. అలాగే అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోష సమయాన దీపాన్ని దానం చేస్తే, మానవుడు యమ మార్గ్ధాకారంనుండి, విముక్తుడవుతాడని ఆస్తిక లోక విశ్వాసం. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో వివరించినట్టు చెప్తారు. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని కౌముదీ మహోత్సవంఅని నిర్వచించాడు. నరక చతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పాడంటారు. దీపావళి నాడు కౌముది మహోత్సవాన్ని జరిపేవారని, ముద్రా రాక్షసం గ్రంథం వల్ల తెలుస్తోంది. బౌద్ధ జాతక కథల్లో లక్షదీపోత్సవం, దీపదానం కూడా జరిపినట్లు అనేక కథలున్నాయి. బుద్ధుని చుట్టూరా దీపాలను పెట్టి పూజించినట్లు కథలున్నాయి.దీపావళి గురించిన కథలు...దీపావళినాటికి కూతురిని, అల్లుడిని పిలిపించే సంప్రదాయం నాగానందంలో వర్ణించినట్టు తెలుస్తోంది. విశ్వవసు అనే రాజు తన కూతురైన మలయవతికీ, అల్లుడికీ కార్తీక శుక్ల పాడ్యమి నాడు బహుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడట. మహావీరుడు ఈ అమావాస్య నాడే మరణం చెందినట్లు, ఆనాడు దేవతలు ఆయన్ని పూజించి, ‘పావానగరమంతా దీపాల్ని వెలిగించారని అప్పటినుండి దీపావళి పండగ ఏర్పాటైందని జైన హరివంశంలో వివరించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. సకల కళా సంస్కృతులతో విరాజిల్లిన విజయనగర సామ్రాజ్యపు కాలంలో దీపావళిని వైభవోపేతంగా జరుపుకునే పద్ధతి ఉందని తెలుస్తోంది.ఐతే, నేడు దీపావళి చుట్టూ అనేకానేక కథలు వాడుకలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి: నరకాసుర వధ, బలిచక్రవర్తి రాజ్యదానం, రావణ సంహారానంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమవడం (భరత్ మిలాప్), విక్రమార్క చక్రవర్తి పట్ట్భాషేకం జరిగిన రోజు.శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుడ్ని వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ.

ఇంకో కథ కూడా ఉంది. లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు.బలి చక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపిన రోజు దీపావళి!రావణుని చంపి రాముడు తన అర్ధాంగి సీతతో విజయోత్సాహంతో వచ్చిన రోజు దీపావళి!నరకాసురుని సత్యభామ కృష్ణుని వెంట వెళ్లి వధించి విజయోత్సాహంతో వేడుక జరిపిన రోజు దీపావళి!అంటే, చీకటిని పారద్రోలి వెలుగులు ఇచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. నరకాసురుడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేది నరకాసుర వధ. నరకశబ్దానికి నరకం అనడానికి బదులు నరకాసురుడుఅని అన్వయించి కాల క్రమంలో పురాణకథ జోడించి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన రహస్యం ఉందని ఇంకొందరి అభిప్రాయం.ఉత్తరాది భారతీయులు, ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. పశ్చిమ బెంగాల్‌లో దీపావళి రోజున శివ సహితంగా కాళీ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పండగనాడు అమావాస్య చీకట్లు తొలగిపోవడానికి కాకరపువ్వొత్తులు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, మతాబులు మొదలైన బాణాసంచాను కాల్చి పండుగగా జరిపి ఆనందిస్తారు. దీపావళి పండుగల్లాంటి వేడుకలు ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.ప్రతియేటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది. ఈ దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. భారతదేశమంతటా ఈ దీపావళి పండగను మూడు రోజుల పండగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మొదటిరోజు నరక చతుర్దశి, రెండవ రోజు దీపావళి అమావాస్య, మూడవ రోజు బలి పాడ్యమి. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి, అంతకు ముందు కొందరు ధన త్రయోదశి అని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాతి రోజును కొన్ని చోట్ల బలిపాడ్యమి (కార్తీక శుద్ధ పాడ్యమి)గా జరుపుకుంటారు.నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగు వత్తులతో దీపాన్ని దానం చేయాలి. సాయంకాలం దేవాలయానికి వెళ్లి దీపాలను వెలిగించాలి. అమావాస్యనాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో అన్నదానాలు చేయడం మంచిది. ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేయాలి. దేవాలయాలలో, ఇంటి ముంగిళ్లలో దీపాలను అలంకరించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్లలాగ చేసి అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని గుళ్లలో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొనె్నలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో తెప్పలాగా వదులుతారు. ఆ రోజు రాత్రికి స్ర్తిలు చేటలు, తప్పిటలు వాయిస్తూ సంబరంగా జ్యేష్ఠాదేవిని (అలక్ష్మి, పెద్దమ్మవారు, దరిద్రదేవత) ఇండ్లనుండి తరిమివేస్తారు. తరువాత ఇంటిని ముగ్గులతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజిస్తారు. ఇది మూడవ రోజు. బలి పాడ్యమి. బలి పాడ్యమి ఉదయం ఆటలాడతారు. ఆ రోజు గెలిస్తే సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఉత్తర భారతదేశంలో ఈ బలి పాడ్యమి రోజునే గోవర్ధన పూజ చేస్తారు.అశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమికి సముద్ర, నదీ స్నానాలను ఆచరించి ఆ నీటిలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహ సముదాయాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే వాతావరణంలో నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణాసంచా చప్పుళ్లు చిన్నా, పెద్దా అంతా ఆనందంగా గడిపే దీపావళి గురించి ఎంతని వ ర్ణించగలం? దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా కారణంగా వర్షాకాలంలో పుట్టుకు వచ్చిన క్రిమి కీటకాలు నశిస్తాయి. దిబ్బు దిబ్బు దీపావళిఅంటూ సాయంత్రం కాగానే ప్రమిదలతో వత్తులు వేసి, నూనె పోసి ఇంటి ముందు వరండాలో దీపాలు వెలిగిస్తారు.శరదృతువులో దీపావళి పండగ రావడంలో ఒక విశిష్టత కూడా ఉంది. మనోనిశ్చలతకు, సుఖ శాంతులకు అనువైన కాలం ఇది. వానలు తగ్గి చలికాలం ఆరంభమయ్యే ఈ సమయంలో పురుగు, పుట్రా కాస్త ఎక్కువగానే ఉండడాన్ని మనం గమనించవచ్చు. రాత్రిళ్లు వాటినుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి పండగ రూపంలో దీపాలను వెలిగించి వాటిని సాధ్యమైనంత వరకూ దరిచేర నీయకుండా చేయడం దీని వెనుక అసలు పరమార్థం.నరక చతుర్దశి అశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకాసురుడు వధించబడ్డాడు. అందుకే ఆ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించాడీ నరకుడు. నరకాసురుడు రాక్షసుడు. చెలరేగిపోయి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగించనారంభించాడు. లోక కంటకుడైన నరకాసురుడు మహావిష్ణువు చేతిలో కాక తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందింది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినపుడు భూదేవి సత్యభామగా జన్మించింది. ఆ లోక కంటకుడి అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్లాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు నరకుడు మరణించాడు. నరకుని పేరు కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా అందరూ పిలిచేలా వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధు జనులను, పదహారు వేలమంది రాజకన్యలను విడిపించి శ్రీకృష్ణుడు ధర్మాన్ని మళ్లీ ప్రతిష్టింపచేశాడు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాల క్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.దీప లక్ష్మీదేవి దీపావళి అంటే దీపోత్సవమే. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పారద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలు ఇలా చెప్పాయి.తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్‌ అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే॥ దీపావళినాడు నూనెలో (నువ్వుల నూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి ఉంటారుట. ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయడంవల్ల దారిద్య్రం తొలగడమే కాక గంగానదీ స్నాన ఫలం లభించి నరక భయం ఉండదన్నది పురాణాలు చెప్పే మాట.దీపావళి అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధిగా వస్తున్న ఆచారం. దానివల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారన్నది అనాదిగా భారతీయుల్లో నమ్మకం. స్ర్తిలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకుంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్య భోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్ధం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంట బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుంటాయి.మహాలక్ష్మీ పూజ దీపావళి సందర్భంగా మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి కూడా ఒక కథ చెబుతారు.ఒకసారి దుర్వాస మహర్షి దేవేంద్రుని వద్దకు వెళ్లాడట. దేవేంద్రుడి ఆతిధ్యానికి సంతసించి దుర్వాసుడు ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడట. ఐతే ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కివేసింది. దాంతో దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపించాడట. ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని, సర్వ సంపదలను పోగొట్టుకుని దిక్కుతోచక కాపాడమని శ్రీహరిని ప్రార్థించాడట. అతని ప్రార్థనలకు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని చెప్పాడట. ఇంద్రుడు అలాగే చేయగా, లక్ష్మీదేవి అనుగ్రహించడంతో, తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.ఆ సమయంలో దేవేంద్రుడు తల్లీ! నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?’ అని ప్రశ్నించాడట. దానికి లక్ష్మీదేవి సమాధానమిస్తూ, ‘నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా ప్రసన్నురాలనౌతాననిసమాధానమిచ్చిందట. అందువల్ల ఈ దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ఎవరు ఎలా తెలియగోరి ప్రార్థ్ధిస్తే, ఆ విధంగా ఆ తల్లి కరుణిస్తుంది.దిబ్బు దిబ్బు దీపావళి...దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి...అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని సంప్రదాయంగా నేటికీ మనం కొన్ని ప్రాంతాలలో చూస్తుంటాం. సాయంత్రాలు ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం, పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్లు కడుక్కుని ఇంటి లోపలకి వచ్చి తీపి పదార్థం తింటారు. తరువాత పూజా గృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు.బాణాసంచా కాల్చడంవల్ల ఆ వెలుగులో శబ్ద తరంగాలలో దారిద్య్ర దుఃఖాలు దూరంగా పారిపోతాయి. అందువల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందనీ, ఈ వర్ష రుతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకు వచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా వల్ల నశిస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.నరకాసుర వధ వృత్తాంతం విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రంలోకి ప్రవేశించి ఆ రాక్షసుడిని చంపి, భూమిని మళ్లీ పైకి తీసుకువచ్చాడు. ఆ సమయంలో వరాహావతారంలో ఉన్న విష్ణువు వలన భూదేవి గర్భం దాల్చింది. ఐతే ఆ శిశువు త్రేతాయుగంలో తాను శ్రీరామునిగా అవతరించి, రావణ సంహారం చేశాక జన్మిస్తుందని భూదేవికి తెలిపాడు. త్రేతాయుగంలో జనకునకు సీతను భూమినుండి దొరికినపుడు, తనకొక ఉపకారం చేయమని భూదేవి జనకుని కోరింది. ఆ మాట ప్రకారం జనకుడు రావణ వధ తర్వాత జన్మించిన భూదేవి కుమారుని పెంచి విద్యాబుద్ధులను నేర్పించాడు. అతడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాల వయసు వచ్చేప్పటికి అతనిని భూదేవి గంగాతీరానికి తీసుకువెళ్లి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని, దివ్య రథాన్ని అనుగ్రహించి, ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకుని కామరూప దేశాన్ని పాలించుకొమ్మని నరకుడికి చెప్పి అదృశ్యమయ్యాడు.నరకుడు కామరూప దేశాన్ని చాలా కాలం పాలించాడు. ద్వాపర యుగంలో నరకుడికి బాణుడనే రాక్షసునితో స్నేహం ఏర్పడింది. ఆ ప్రభావంతో నరకుడు లోక కంటకుడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ట మహర్షి ప్రాగ్జ్యోతిష పురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా దేవాలయం తలుపులు మూయించాడు. దాంతో కోపించిన వశిష్డుడు నీవు మద గర్వంతో మితిమీరి సజ్జనులను అవమానిస్తున్నావు. నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావుఅని శపించాడు. ఆ శాపానికి భయపడి నరకుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణం లేకుండా ఉండేలా వరాన్ని పొందాడు. ఆ వరాన్ని పొందానన్న గర్వంతో చెలరేగిపోయాడు. రుషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు. ఇంద్రాది దేవతలను జయించాడు.నరకుడి బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుని ప్రార్థించగా ఆయన నరకుడిని చంపడానికి కామరూప దేశానికి సత్యభామాదేవితో సహా వెళ్లాడు. అక్కడ నరకుడికీ, కృష్ణుడికీ ఘోర యుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. అశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలడంతో ఆనంద పరవశులై ప్రజలు ఆ మిగిలిన రాత్రి భాగంలో మరునాటి దినం వేకువ జామున పండుగ జరుపుకున్నారు. ఆ రెండు రోజులే నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలు.బలి చక్రవర్తి రాజ్యదాన కథ బలిచక్రవర్తి అజేయ బల పరాక్రమాలుకలవాడు. మహా దాత. అడిగినవాడికి లేదనకుండా దానం చేసేవాడు. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలం ముగిసాకనే అతన్ని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి మహా విష్ణువు అదితి గర్భాన వామన రూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞాన్ని చేయసాగాడు. అప్పుడు వామనావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడిగాడు. బలి చక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతైఅన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగునకు స్థలం లేకపోయింది. మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావని వామనుడు అడగ్గా, బలి చక్రవర్తి దానిని తన తలమీద పెట్టమని కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.ప్రపంచ దేశాల్లో దీపావళి ప్రపంచ వసుదైక కుటుంబంగా మారడం ఆనాడే గమనిస్తాం. కళ, సంస్కృతి రంగాల్లో ప్రముఖంగా ఈ విధానానే్న గమనిస్తాం. సుప్రసిద్ధ అరబ్ యాత్రికుడు అల్‌బెరూనీ 11వ శతాబ్దంలో దీపావళిని మన దేశంలో ఎలా జరుపుకుంటామో వివరించాడు.ఎక్కువ దేశాల్లోని చారిత్రక ఆధారాలను చూస్తే అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో దీపదానం చేసే ఆచారం ఉన్నట్టు తెలుస్తుంది. ఈజిప్ట్, యమన్‌లలో జరుపుకునే సూర్యదేవత జన్మదినోత్సవం నడుస్తుంది. ఈజిప్టులో దక్షిణాయనం ప్రారంభ సూచకం, మరణించినవారిపై గౌరవ సూచకంగా దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారం, మరణించిన వారి ఆత్మ తమ ఇళ్ళకు తిరిగి వస్తుందనే విశ్వాసంతో సమాధులనుండి ఇళ్ల వరకు దీపాలని వరసగా వెలిగించి బారులు కడతారు.చైనాలో ఏడాదికి రెండుసార్లు దీపోత్సవాలు జరుపుకుంటారు. అమెరికాలో మన దీపావళి లాంటి హోలోవీన్ను నవంబర్ ఒకటవ తేదీనాడు జరుపుకుంటారు. ఈ పండుగను క్రీస్తు పూర్వం కొన్ని శతాబ్దాల క్రితమే ఇప్పటి ఆంగ్లేయుల పూర్వీకులు కెల్ట్ (డ్రయిడ్) జాతివారే ప్రారంభించారట. రోమనులు పామోనాపండగ కూడా అలాగే ఉంటుంది. ఫలితంగా క్రైస్తవులు ఆల్ హోలోన్’, ‘ఆల్ సెయింట్స్‌డేఅని పండగలు జరుపుకుంటారు. నేటికీ క్రైస్తవులు జరుపుకునే కాండిల్ ఫెస్టివల్మన దీపావళితో పోల్చదగ్గదే. ముస్లింల్లోనూ దీపావళిలా షబేబారాత్’ (రాత్రి ఊరేగింపు) అని చేస్తారు. మహమ్మద్ పైగంబర్, మక్కాకు తిరిగి వెళ్లిన రోజు రాత్రికి సూచకంగా ఇలా దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారానికి శ్రీకారం చుట్టారంటారు. ఆ రోజున బాణాసంచా కాల్చి మతాబులు వెలిగిస్తారు.మన దేశంలో దీపావళి మన దేశంలో దీపావళి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కరలేదు. గోవా వంటి చోట్ల పెద్ద పెద్ద రావణుని రూపాలను ఊరేగించి చివరన ఒకచోట చేర్చి పిడకలు, కట్టెలూ అన్నీ పేర్చి వాటిని దహనం చేస్తారు. బీహార్‌లో రావణ, కుంభకర్ణుల రూపాలను సంహరించి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గుజరాత్‌లో దీపావళి ఆరు రోజుల పండగ. అదే మహారాష్టల్రో నాలుగు రోజుల పండగ. పశ్చిమ బెంగాల్‌లో దేవీ నవరాత్రులు అంతం కావడం దీపావళి వేడుకలు ఆరంభం కావడంవల్ల ఆ రాష్టమ్రంతా పండగ వాతావరణంలోనే ఉంటుంది. ఒరిస్సాలో నరక చతుర్దశికి అంత ప్రాముఖ్యం లేదు. దీపావళి నాడే పెద్ద పండగ. రాజస్థాన్‌లో పిల్లులకు పూజ చేసి విందు చేస్తారు. పిల్లి సంతృప్తి చెందితే అంతా మంచే జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. పంజాబ్‌లో దీపావళి మరుసటి రోజ భాయి దూజ్ పండగ చేసుకుంటారు. ఆ రోజు ప్రతి మహిళా తన సోదరులను కలిసి వారికి వీర తిలకం దిద్దడం అక్కడి ఆనవాయితీ.దీపావళి పండగ-జాగ్రత్త పడండి!వెలుగులు చిమ్మే దీపావళి పండగలో పిల్లలకైనా, పెద్దవారికైనా ఆనందాన్నిచ్చేవి టపాకాయలే! ఫైర్ వర్క్స్ లేని దీపావళి పండగను ఊహించగలరా? ఆ పని ఎవరూ చేయలేరు. దీపావళి నాడు టపాకాయలు ఎంత ప్రాముఖ్యమో పండగ ఆనందం కోల్పోరాదంటే అవి కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ప్రధానమైనవి. కొన్ని ముందు జాగ్రత్తలు ఆచరిస్తే దీపావళి సంబరాలు మనకు మరువలేని అనుభూతులను, ఆనందాన్ని ఇస్తాయి. పిల్లలు టపాకాయలు కాల్చడమనేది పూర్తిగా పెద్దల పర్యవేక్షణలో జరగాలి. దీపావళి రోజున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మరింత ఆనందం కలుగుతుంది. ఈ పండగ జీవితకాల మాధుర్యంగా మిగిలిపోతుంది. మీ దీపావళి సరంజామాను కాల్చే విషయంలో ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. * టపాసులను కొనుక్కుని వచ్చాక, ఇంట్లో వేడి, నిప్పు, నీరు తగలని ప్రదేశంలో సురక్షితంగా ఉంచండి. వీటిని గట్టి మూత గల బాక్స్‌ల్లో పిల్లలకు, పెంపుడు జంతువులకు అందని చోట భద్రంగా ఉంచాలి. * టపాసుల ధ్వని 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ కనుక వాటి ధ్వని మీ లోపలి చెవికి హాని కలిగించవచ్చు. ప్రతి 15 నిముషాలకు కొంత విశ్రాంతినివ్వండి. చెవుల్లో కాటన్ దూదులు పెట్టుకుంటే మంచిది. పసి పిల్లలను ధ్వనులనుండి దూరంగా ఉంచండి.దీపావళి పండుగ వస్తుందంటే పండగకు ముందు వారం రోజులు తర్వాత వారం రోజులు టపాకాయల పేలుళ్లు, వాటి పొగలు, ధ్వని, వాతావరణ కాలుష్యం కలగజేస్తాయి. మీరు చూపే అత్యుత్సాహం వల్ల శబ్ద, వాయు కాలుష్యం అధికమై అది పర్యావరణం చేటుకు దారి తీస్తుందన్న విషయం మరిచిపోవద్దు.

................ఏం చేయాలి? ఏం చేయకూడదు? .....................చేయాల్సినవి: -

టపాకాయలు లైసెన్సు పొందిన అధీకృత డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేయండి- టపాకాయలను గట్టి మూత వున్న బాక్సులో పెట్టండి.- టపాకాయలు వేడికి దూరంగా, పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచండి.- టపాకాయలను ఒకరే నిర్వహించకుండా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాగ్రత్తలు తీసుకోండి- టపాకాయలను వెలిగించేటప్పుడు టపాకాయకూ, మీకూ మధ్య దూరం ఉండేలా చూసుకోండి.- టపాకాయలను వెలిగించేటప్పుడు కేవలం ఒక పొడవైన కేండిల్ లేదా కాకరపువ్వొత్తి వంటి దాన్ని ఉపయోగించండి. అగ్గిపుల్లలతో వెలిగించవద్దు. - టపాసులు కాల్చే సమయంలో అందుబాటులో ఎప్పుడూ ఒక బకెట్ నీళ్లు ఉంచుకోండి. ఏదైనా ప్రమాదం జరిగినపుడు నివారించడానికి ఉపయోగించవచ్చు.చేయకూడనివి:- సరదాకైనా సరే, ఎప్పుడుగానీ టపాకాయలు చేతితో పట్టుకుని కాల్చకండి.- గుంపులున్న చోట, ఇరుకైన ప్రదేశాల్లో టపాకాయాలు కాల్చకండి.- టపాకాయలను ఇంటిలోపల కాల్చకండి. చుట్టుపక్కల గుడిసెలు గానీ, గడ్డివాములు గానీ లేకుండా ఉండే ఆరుబైట ప్రదేశాల్లో కాల్చండి.- పెద్దవారు పక్కన లేకుండా కేవలం పిల్లలే టపాకాయలు కాల్చుకోవడానికి పెద్దలు ఒప్పుకోవద్దు.- ధ్వని పెద్దగా రావాలని టపాకాయలను సీసాలలో గానీ, డబ్బాలలోగానీ పెట్టి కాల్చకండి.- టపాకాయ వెలిగించిన తర్వాత అది వెలుగుతోందా లేదా అని దానిమీదకు ముఖం పెట్టి చూడకండి. అలాగే ఒకవేళ అది సరిగా కాలకపోతే అది కాలిందా లేదా అని దగ్గరకు వెళ్లి పరీక్షించవద్దు. కొత్తది కాల్చండి.- భూచక్రాలను కాల్చేటప్పుడు పాదరక్షలను మరిచిపోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు.- మీ దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులు, అగరవత్తులను ఉంచొద్దు.

..............బాణాసంచా రాజధాని-శివకాశి........................

శివకాశి బాణాసంచా తయారీకి పెట్టింది పేరు. దేశంలోని టపాసుల ఉత్పత్తిలో శివకాశి వాటా 90 శాతం. తమిళనాట మధురైకి దక్షిణాన, చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివకాశికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. 14వ శతాబ్దంనుంచే ఈ నగరం ఉంది. హిందువుల పవిత్ర క్షేత్రం కాశీ ఉత్తరాదిన ఉండగా, దక్షిణాదిన రెండు కాశీలు ఏర్పాటయ్యాయి. వాటిలో ఒకటి తెన్‌కాశి కాగా మరోటి శివకాశి. ఇవి రెండూ తమిళనాడులోనే ఉన్నాయి. 14వ శతాబ్దంలో హరికేసరి పరాక్రమ పాండియన్ ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన వారణాసిలో శివుడిని దర్శించుకుని అక్కడినుంచి శివలింగాన్ని తీసుకువచ్చాడు. దీన్ని తాను ఉంటున్న తెన్ కాశిలో ప్రతిష్టించాలని భావించాడు. శివకాశికి వచ్చాక ప్రయాణ బడలిక తీర్చుకున్నారు. ఈ లింగాన్ని తీసుకొస్తున్న గోవు అక్కడినుంచి కదలనని మొండికేసింది. దీంతో ఆయన ఆ లింగాన్ని తన స్వస్థలం తెన్‌కాశికి తీసుకెళ్లలేమని భావించి దాన్ని అక్కడే ప్రతిష్టించాడు. అందుకే ఈ నగరానికి శివకాశి అని పేరొచ్చిందంటారు.343.76 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 2.5 లక్షల జనాభా ఉండే శివకాశిలో దాదాపు 65 వేల కుటుంబాలు, 8 వేల పరిశ్రమలు (అనుమతి ఉన్నవి, లేనివీ కలిపి) ఉన్నాయి. ఏటా 1500 కోట్ల రూపాయల బాణాసంచా వ్యాపారం జరుపుతుంది శివకాశి. ఇక్కడినుంచి బాణాసంచా విదేశాలకూ ఎగుమతి అవుతాయి. కనకే శివకాశి ప్రపంచ బాణాసంచా రాజధానిగా పేరొందింది.అగ్గిపుల్లల పుట్టినిల్లు చైనా అని అందరికీ తెలుసు. 1921 ముందు భారత్‌కు ఫ్రాన్స్, ఇంగ్లండ్ నుంచి అగ్గిపుల్లలు దిగుమతి అయ్యేవి. 1921 తర్వాత పరిస్థితి మారింది. కోల్‌కతాలో మొదటిసారి అగ్గిపెట్టెల పరిశ్రమ ఏర్పాటైంది. ఆ తర్వాత శివకాశికి చెందిన పి.అయ్యానాడార్, ఎ.షణ్ముగనాడార్ అనే ఇద్దరు వ్యక్తులు జర్మనీ నుంచి యంత్రాలను తీసుకువచ్చి ఇక్కడ అగ్గిపుల్లల పరిశ్రమను ఏర్పాటు చేసారు. అప్పట్లో స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకోవడం, విదేశీ వస్తు బహిష్కరణ చేయడంవల్ల దేశంలో శివకాశి అగ్గిపుల్లలకు డిమాండ్ పెరిగింది. అప్పటినుంచి ఇక్కడ పెద్దఎత్తున అగ్గిపుల్లల తయారీ మొదలైంది. తర్వాత ఇక్కడ పరిశ్రమల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ 280 అగ్గిపుల్లల చిన్నస్థాయి పరిశ్రమలు, 3200 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఏటా 15 కోట్ల అగ్గిపుల్లలు తయారుచేస్తున్నారు. దేశానికి అవసరమైన అగ్గిపుల్లల్లో 70 శాతం ఈ తరహా పరిశ్రమలనుంచే ఉత్పత్తి అవుతున్నాయి.భారతీయ మినీ జపాన్1960 సంవత్సరం దేశంలో నిరుద్యోగం రాజ్యమేలే సమయంలో అందరు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే శివకాశిలో వున్న నిరుద్యోగులు ప్రభుత్వం నుంచి సాయం పొందకుండా అభివృద్ధి చెందాలని కలిసి నిర్ణయించుకున్నారు. అగ్గిపుల్లలు, బాణాసంచా, ముద్రణ, ఇతర పరిశ్రమల్లో రాణించారు. గణనీయమైన వృద్ధి సాధించారు. అది తెలుసుకున్న నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శివకాశికి కుట్ట జపాన్ (చిన్న జపాన్) అని పేరుపెట్టారు.

 ..............దీపావళి పండుగ కాలుష్యాన్ని అరికట్టే 5 మార్గాలు! ..............ప్రతి ఏడు ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉన్నప్పటికీ కాలుష్యంవల్ల మన మనుగడ కష్టతరమైపోతోంది. ఈ కాలుష్యం తగ్గాలంటే కొన్ని చర్యలు చేపట్టాలి. వాటిలో ప్రధానమైనవి కొన్ని సూచనలు పాటించండి. * దీపావళి వేడుకలకు ప్రధానంగా ఇండ్లలో లైటింగ్ ఏర్పరుస్తాం. సంప్రదాయ నూనె దీపాలు మంచివి. విద్యుత్ దీపాలకు బదులు నేడు ఆధునికంగా వస్తున్న గ్రీన్‌లైట్లు పెట్టండి. * దీపావళిని దివ్వెల పండుగ అన్నారే కానీ ధ్వని కాలుష్యాన్ని కలగచేసే పండుగ అనలేదు. మీరు కాల్చే టపాసులు రంగురంగుల పూలతో కాంతులిచ్చేవిగానే ఎంపిక చేసుకోండి. కానీ చెవులు పగిలేలా లేదా గుండెనొప్పులు వచ్చేలా అధిక ధ్వనులు వచ్చే బాంబులు వంటివాటి జోలికి పోకండి. * టపాకాయలవల్ల అధిక కాలుష్యం కలుగుతుంది. వాటిని ఆపలేం. అయితే కాల్చేటప్పుడు కొంత బాధ్యత వహించి సాధారణంగా ఇండ్లముందు, రోడ్లమీద కాకుండా నివాసాలకు దూరంగా బయట ప్రదేశాల్లో కాలిస్తే ధ్వని, పొగ కాలుష్యాలుండవు. * దీపావళి వచ్చిందంటే అంతా ప్లాస్టిక్ కవర్లు, బాక్సులే దర్శనమిస్తాయి. టపాకాయల కవర్లు, స్వీట్ బాక్సుల కవర్లు, పగిలిన బాటిల్స్ ఇలా ఎన్నో దర్శనమిస్తాయి. పండుగ పేరుతో ఆనందించదగినదే. కాని అనవసరమైన ప్లాస్టిక్, బాటిల్స్ వంటి వాటికి చోటివ్వకండి. వీటన్నింటినీ సేకరించి తగిన విధంగా నిర్మూలించండి* దీపావళి మరుసటి రోజు మీ ఇంటిముందు, ఇంటి లోపల, రోడ్డుపైనా ఎక్కడ చూసినా చెత్తే. మీరు రూపొందించిన ఈ చెత్తను తొలగించే చర్యలు మీరే చేపట్టండి. మీ ఇంటి ముంగిట వున్న చెత్తనంతా దూరంగా పడవేసి దానిని తగలబెట్టడం వంటి చర్య చేస్తే మీ పరిసరాలు కాలుష్యం లేకుండా ఉంటాయి.ఈ చర్యలలో కొన్నింటిని పాటించినా చాలు. మీరు కాలుష్యాన్ని తొలగించడానికి లేదా తగ్గించడానికి పాటుపడిన వారవుతారు. అందువల్ల ఈసారి పండుగను కాలుష్యం లేని విభిన్నరీతిలో జరుపుకుని ఆనందించండి. *